2840* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

జాతీయ (NH-16) రహదారి సుమ సుందరీకరణం @2840*.

          బుధుని రోజు (2.8.23) వచ్చిందంటే - ఈ ఊరి సామాజిక బాధ్యుల శ్రమదాన పండుగ మొదలైనట్లే! వారంలో 5 రోజుల వేడుకకు నాంది పలుకుతూ - బందరుకు 22 - 21 కిలోమీటర్ల నడిమి ఉపరహదారి దగ్గర ఉత్తరపుటంచున 4.18 కే - ఇంత ఊరి నుండి కేవలం 20 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఆయుధధారులై కనిపించారు!

          తిరిగే కాళ్ళూ, తిట్టే నోళ్ళూ ఆగవన్నట్టుగా – వేకువ 3.30 కు ఠంచనుగా లేచి, 2/3/4 కిలోమీటర్ల ధిగమించి, కార్యక్షేత్రానికి చేరందే వాళ్లకు మనశ్శాంతి ఉండదాయె! తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యతిరేకతో - సానుకూలతో – వాళ్లదిదే తంతు! తాము తలపెట్టిన ఊరి మెరుగుదలకు ఏనాటికానాడు పునః పునరంకితులైపోవడమే వాళ్ల వంతు!

          ఆ వరసలోనే - బండ్రేవు కోడు బ్రిడ్జి నుండి అఫీసర్స్ క్లబ్ దారి నడుమ సుమారొక 150 గజాల రాదారి మార్జిను పూల మొక్కల కొలువుకు సంసిద్ధమైపోయింది. ఐతే - ఇదేమీ అనుకొన్నంత సులభంగా మాత్రం జరగలేదు.

          ఏడెనిమిదడుగుల పల్లంలోకి దిగి, ఎగుడు దిగుడు చోట - చాలీచాలని వెలుతురులో ఈ మాత్రం పని జరగడమే గొప్ప! కొన్ని పిచ్చి – ముళ్ల మొక్కలైతే - కత్తుల కెదురు తిరిగి, గొడ్డలి మాట మాత్రమే విన్నాయి!

          మగ కార్యకర్తలు - ముఖ్యంగా ఆజన్మాంతం శరీర శ్రమ కలవాటు పడ్డ రైతులు సరే - నర్సులూ, గృహిణులూ, ఇద్దరు ముసలి ఘటాలూ, వ్యాపారులూ ఇంతటి కష్టం ఎందుకిష్టంగా చేస్తుంటారు?

          ఈ గ్రామ స్వచ్ఛ వైద్యుడు పదే పదే – “ఈ మట్టి పిసుకుడు, రోడ్లు ఊడ్పుడు పనులు ఇంకెవరు చేస్తారు?” అని ఆశ్చర్యపడేట్లుగా చల్లపల్లిలోని 100/150 మందికి ఇదేం ఖర్మ? లేక ఇదేం అదృష్టం?

          ఎవరి ఆహ్లాదం కోసం ఇన్ని లక్షల శ్రమ గంటల ప్రయత్నమో ఆ గ్రామస్తుల సహకారం అంతంత మాత్రంగా ఉన్న చోట 2840* నాళ్ల ఉడుం పట్టు స్థిత ప్రజ్ఞతా? లేక వెర్రి చేష్టా?

          ఏదో - నాలాంటి పని తక్కువ - జిజ్ఞాస ఎక్కువా ఉన్న వాళ్ల సందేహాలే కాని – ఇవన్నీ ఆలోచిస్తే - పట్టుమని 20 మంది - వేళకాని వేళ - కొందరు జంగిల్ క్లియరెన్స్ చేసి, ఇంకొందరు గోకుడు పారల్తో రోడ్డు మట్టిని చెక్కే, నికృష్టపు ప్లాస్టిక్ తుక్కుల్ని ఏరే పనికి...పాటుబడగలరా?

          6. 20 వేళ - నిన్నటి, నేటి, రేపటి కార్యక్రమాల్ని ప్రస్తావించి, పరవశించిన వైద్యుడు దాసరి వారైతే - దైనందిన స్వచ్చోద్యమ నినాదాలు వినిపించినది నల్లూరి వారు!

          పూల మొక్కల పుణ్యకార్యం కోసం రేపటి వేకువ మనం కలుసుకోదగిన చోటు - మరల 22 -21 కిలోమీటర్ల మధ్య గల NH - 16 మాత్రమే!

          మన శ్రమదాన తరంగం!

తెల్లారక ముందే రహదారుల సంస్కరణముగా

కల్లాకపటం ఎరుగని కర్మల పరిపక్వముగా

ఎన్నటికీ వడి తగ్గని స్వచ్ఛ - సుందరోద్యమముగ

చల్లపల్లికే దక్కిన సాటిలేని అదృష్టముగ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.08.2023.