2841* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మరొక శ్రమదాన ఘట్టం - @2841*

          గురువారం (3.8.23) వేకువ 4.14 కే డజను మంది ప్రారంభించిన రహదారి సుందరీకరణ ప్రయత్నం 20 మంది కార్యకర్తలతో 6.07 కు ముగిసింది. పని స్వభావంలో మార్పు లేదు, కార్యకర్తల సంఖ్యలోనూ మార్పు లేదు, స్థలం కూడ నిన్నటి తరువాయి గానే - బందరు బైపాస్ కుచెందిన 21 వ కిలోమీటరు వద్ద - అనగా క్లబ్ రోడ్డు అనబడే చైతన్య పాఠశాల వీధి దగ్గర!

          అవే చేతులు పట్టిన అవే పనిముట్లు - కత్తులు, కొడవళ్ళు, గోకుడు పారలు, దంతెలు, చీపుళ్ళు! ఎన్నివేల దినాలైనా వాళ్లకు విసుగు లేదు, పట్టు సడలదు.

          కార్యకర్తల అసలు ప్రణాళిక - బండ్రేవుకోడు వంతెనకు తూర్పుగా మరో 350 గజాల రహదారిని రెండు - మూడు వందల పూల మొక్కల్తో అలంకరించడం. నిన్నా - ఇవాళా - ఎల్లీ - ఎల్లుండీ కూడ ఆ పనికి సన్నాహకంగా రెండు ప్రక్కలా అందుకు అడ్డువస్తున్న పనికిరాని పిచ్చి – ముళ్ల కంపల్నీ, గడ్డినీ నిర్మూలించడమూ, రాళ్ళూ - రప్పలూ, సీసాలు ఏరేయడమే కొసరు ప్రణాళిక !

          నూకలవారిపాలెం బాట దాక – మరొక 150 గజాల రోడ్డు ఉత్తర భాగాన్ని మొక్కలకు సంసిద్ధం చేసిన 20 మంది అభినందనీయులు! అందుగ్గాను – వంగొనీ, కూర్చొనీ, వాళ్ల శ్రమ వర్ణనాతీతం!

          సొంతానిక్కాక - అందరి ఉమ్మడి ఆహ్లాదం కోసం ఇలా వేళ కాని వేళ శ్రమించడం సృచ్ఛ చల్లపల్లిలో కాక ఇంకెక్కడ జరుగుతుంది? అధవా జరిగినా ఈ స్థాయిలో తొమ్మిదేళ్ళెలా కొనసాగుతుంది?

          ఈ శ్రమదానం వెనక ఏ మాత్రం స్వార్థమున్నా ఏ నాడో అటకెక్కేది! దశాబ్ద కాల పరీక్షకు నిలిచేదే కాదు!

          వాలంటీర్లలో పది మంది చేతి కత్తులు నిర్విరామంగా పని చేస్తే - ఒకాయన గొడ్డలి పెద్ద పిచ్చి చెట్లను నరుక్కొంటూ పోతే - ఇద్దరి పదును కొడవళ్లు గడ్డి కోసుకుపోతుంటే - ముగ్గురి గోకుడు పారలు సిమెంటు బాట మట్టిని చెక్కుతుంటే - రెండు మూడు చీపుళ్లు ఊడుస్తుంటే. 150 గజాల రహదారి, 10 - 12 అడుగుల మార్జినూ అందంగా మారకేంజేస్తుంది?

          కాఫీలు రుచి చూశాక - 6.20 కి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాల్ని ప్రకటించినది భోగాది వాసుదేవుడైతే – 3 రోజుల పని ప్రణాళికను వివరించింది DRK వైద్యుడైతే - ఉత్తేజకరమైన పాట వినిపించినది నందేటి గాయకుడు!

          రేపే కాదు - శని, ఆదివారాల వేకువల్లోనూ – మనం కలిసి పాటుబడదగింది బందరు ఉపరహదారిలోని బండ్రేవు కోడు క్రొత్త వంతెన ప్రాంతమే!

          స్వచ్ఛోద్యమ సంబంధులు

ఆరోగ్యమె మానవునికి అసలు భాగ్యమనుకొంటే –

సంతోషమె ఊరి జనుల సగం బలం అనుకొంటే –

చల్లపల్లి ప్రజలకు అవి స్వచ్ఛోద్యమ సంబంధులు

ఆదర్శ సమాజగతికి అత్యుత్తమ రహదారులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.08.2023.