2842* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మళ్లీ అదే బందరు బైపాస్ లో - @2842*

            ఈ శ్రావణ శుక్రవారం బ్రహ్మకాలంలో పాతిక మంది శ్రమదానవీరులు భక్తి - శ్రద్ధతలతో చేసిన పూజలేమిటిరా అంటే - రామానగరానికి దూరంగా ఒక రహదారి శుభ్రత, దాని దక్షిణపు 10 అడుగుల మార్జిన్ లో అసహ్యకరంగా బలిసిన గడ్డి - ఇంగ్లీష్ తుమ్మచెట్లూ - ఎందుకూ కొరగాని వెర్రి చెట్లూ వగైరాల తొలగింపూ!

            వాళ్లెప్పుడు మేల్కోని, ఎన్నింటికి బయల్దేరి, ఎంతెంత దూరాల్నుండి వచ్చారో గాని నూకలవారిపాలెం డొంక రోడ్డు దగ్గరి NH 16 వద్దకు చేరుకొని, పనిలోకిదూకింది మాత్రం 4.18 వేళ!

            అక్కణుండి పడమరగా - మూణ్ణాలుగు వందల గజాల బారునా నిన్నటి వికృత చిట్టడవి - మురుక్కాల్వ వంతెన దాకా మటు మాయమై 200 కు పైగా పూల మొక్కలు నాటుడుకు సిద్ధమైపోయింది!

            మన వాట్సప్ మాధ్యమంలో గనుక నేటి పని స్థలం వేకువ 4.00 కు ముందుది కనిపిస్తే పరిశీలించండి - ఎంతెంత పెద్ద ముళ్ళ చెట్లు వాన గుంటల మధ్య నిలబడి భయపెడుతున్నాయో? మరి - అందరి ఉమ్మడి ఖాతాలో - 2500 నిముషాల శ్రమ తరువాత - మంత్రం వేసినట్లు చెట్టు కూలిపోయి మొక్కల కంప పెట్టుటకనువైన తుంపులుగా మారిపోలేదా?

            అదే కదా - యాంత్రిక శ్రమకూ, మానవ శ్రమకూ ఉండే తేడా! అదీ గాక - స్వచ్ఛ శ్రామికులైతే మనసుపెట్టి, తలలుపయోగించి, ఇన్ని వేల రోజులు ప్రయత్నిస్తే చల్లపల్లి, పరిసర రహదార్లింత ఆహ్లాదమయంగా ఉండకేం చేస్తాయి?

            ఇంతటి కష్టాన్ని ఇష్టంగా చేయబట్టేస్త్రీ కార్యకర్తలు కూడ చీకట్లో ముళ్ళ కంపలు లాక్కెళ్ల బట్టే చెట్ల పని బట్టేవాళ్లు తమ పని పూర్తిచేస్తుండగానే - కొందరు వాటిని కావలసిన సైజుల్లోకి నరుకుంటే సిమెంటు బాటను ఊడ్చేవాళ్లు ఊడుస్తుంటే - ఇంతటి ఉమ్మడి శ్రమదానంతో ఎంతటి పనైనా భారంగా తోచదు మరి!

            నేటి పని పూర్తయ్యాక 6.20 సమయాన ఈ ఊరికీ, స్వచ్ఛ చల్లపల్లికీ, ఈ ప్రాంతానికి మొక్కల సరఫరాదారుడు - తాతినేని వేంకట రమణుడు ముమ్మారు వినిపించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో నేటి సామాజిక బాధ్యత ముగిసింది.

            అంతకు ముందు నాటిన వందలాది పూల మొక్కల్లో కొన్నిటికి కంప రక్షణ పనికోసం రేపటి వేకువ మనం కలుసుకోదగిన చోటు - ఇదే రహదారిలో కాసానగర్ దగ్గరే!

            కలదపోలిక ఎంత మాత్రము?

ఎలా ఉండెనొ మురుగు కాల్వలు, మురికి పట్టిన ఊరి దారులు?

మలవిసర్జిత దురిత బాటలు! జీవకళ కనిపించెనా? - మరి

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను మ్రింగిన నేటి ఊరికి

గతంలో మన చల్లపల్లికి కలదపోలిక ఎంత మాత్రము?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.08.2023.