2843* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

2843* వ స్వచ్ఛ సుందరోద్యమాన్ని పరిశీలిద్దాం రండి!

            శనివారం (5-8-23) నాటి డజను మంది కార్యకర్తల రహదారి పచ్చతోరణం మరీ వేకువ 4.17 నుండే! ఐదేళ్ల అరిందా నుండి 84 ఏళ్ల పెద్దాయన దాకా - చివరికి తేలిన కార్యకర్తల సంఖ్య 31ఇందులో కొంగ్రొత్త యువ వ్యాపారి - అనిల్!

            ఇక వీళ్ల కర్మ ఘర్మ క్షేత్రం - నిన్నటి నిర్ణయానుసారం - బందరు రహదారిలోని కాసానగర సమీపం. నిర్వాకం ఏమంటే - గతంలో తామే నాటిన పూలమొక్కలకి పశువుల నుండి రక్షణగా చుట్టూ ముళ్లకంప లేర్పరచడం!

            అసలైతే - చల్లపల్లి స్వచ్ఛ - హరిత సుందరోద్యమంలో ఈ పని విభాగం ట్రస్టు ఉద్యోగులదే! ఐతే ఎన్ని వేల మొక్కలకని వాళ్లు - ఎక్కడెక్కడో వెదకి, ముళ్ల చెట్లను కనిపెట్టి, అవసరమైన అనుమతులు పొంది వాటిన్నరికి, ఇక్కడికి రవాణా చేసి, కంచెలమర్చగలరు? పని చోటుకు దగ్గర్లో ఉన్న ఖాళీగానే ఉన్న వాళ్లేమన్నా ట్రస్టు వారికి  సహకరిస్తున్నారు గనుకనా?

            NH-16 కు ఉత్తర దిశగా నాల్రోజుల్నాడు నాటిన పూల మొక్కలన్నిటికీ కంచెలమర్చడం ఈ వేకువ పూర్తి కానేలేదు. ఇదేదో సినిమా షూటింగో గ్రాఫిక్కో కాదు, అసలు నటులకు మారుగా కొసరు నకిలీ (డూప్) లు చేసే పనీ కాదు సూది ముళ్ల కొమ్మల్ని కత్తిరించుకొని, త్రాళ్లు సిద్ధం చేసుకొని, మొక్క చుట్టూ పాతి, శ్రమించే విషయం.

            ఆరేడు నెల్లపాటు మొక్కల్ని రక్షించే సంగతి - అందువల్ల ఆలస్యం అవుతుంది మరి! ఇన్ని ప్రణాళికలు వేసుకొని, వ్యయ ప్రయాసల కోర్చుకొని, ఇందరు కార్యకర్తలు పాటుబడుతున్నారంటే ఈ 16/17 వందల మొక్కలు ఎదిగి, వేల - లక్షల పూలు పూసి, జాతీయ రహదారిని సుగంధ భరితం చేస్తే చాలనే ఒకే ఒక్క ఆశయంతో!

            ఈ స్వచ్ఛ - సుందరోద్యమం పిచ్చోళ్ల స్వర్గం కాదనీ, వాస్తవ ప్రపంచంలో అమలు జరుగుతున్నదేననీ ఇప్పటికే ఋజువైంది! బాటకు దక్షిణాన కొందరు కార్యకర్తలు మొక్కల పాదుల్ని సరిజేస్తూ కనిపించారు. నలుగురు రోడ్లూడ్చిన వాళ్లూ, బురద చట్టుల్ని గోకిన కార్యకర్తలూ తమ విధులనుకొన్న పనుల్ని మరువ లేదు!

            గ్రామ సామాజికులకు కనీస బాధ్యతను గుర్తు చేసే నినాదాల్ని ప్రతి ఉదయమూ వినిపించడం స్వచ్ఛకార్యకర్తలకలవాటు. ఆ పనిని నేడు పూర్తి చేసినది సాధనాల సతీష్! రేపటి, తరువాతి (వేంకటాపురం రోడ్డు) శ్రమదాన సంగతుల్ని వివరించినది డాక్టర్ DRK. ప్రసాదు!

            రేపు ఆదివారం కనుక ఇదే రహదారి కిరుప్రక్కలా 200 కు పైగా జెట్రోఫా – చిన్న తురాయి వంటి పూల మొక్కలు నాటేందుకు కార్యకర్తలు విరివిగా వచ్చి కలువదగిన చోటు - ఈ బాటలోనే  21 - 22 వ కిలో మీటర్ల నడుమ - అనగా నూకలవారిపాలెం డొంక సమీపంలో.

            స్వచ్చోద్యమ సంబంధులు

ఆరోగ్యమె మానవునికి అసలు భాగ్యమనుకొంటే -

సంతోషమె ఊరి జనుల సగం బలం అనుకొంటే -

చల్లపల్లి ప్రజలకు అవి స్వచ్చోద్యమ సంబంధులు

ఆదర్శ సమాజ గతికి అత్యుత్తమ రహదారులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   05.08.2023.