2863* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

శ్రావణ శుక్రవారం పని దినం వరుస సంఖ్య- 2863*

          మొత్తం 26 మంది కార్యకర్తల్లో ఈ 25.8.23 వేకువ 9 మంది ఉనికైతే మరీ 4.09 కే! సదరు ఉనికి గంగులపాలెం మురుగు కాల్వ వంతెనే గాని సమయం గడిచే కొద్దీ తూర్పు, పడమర, దక్షిణ దిశలకు విస్తరించింది.

1) బండ్రేవు కోడు కాల్వ వంతెన తూర్పున కాల్వ గట్లు రెండూ కోసుకుపోతున్న చోట రాళ్ళూ మట్టీ పీకేసిన పిచ్చి ముళ్ల మొక్కలూ చేర్చి కాస్త భద్రత కల్గించారు.

2) ఉత్తరం గట్టు మీద అలాంటివి తొలగిస్తున్నపుడే చీకట్లో తేనెటీగల తుట్టె కదిలి ఏడుగురు కార్యకర్తల ముఖాలు కుట్టేశాయి.

3) రోడ్డు దగ్గరి చోటు ఖాళీగా, బోసిగా ఉండిపోతే అక్కడ 5 పూలమొక్కలు నాటారు.

4) వంతెనకు దూరంగా - పడమర వైపున ఇద్దరు సుందరీకర్తలు నిన్నటి తరువాయిగా చెట్ల కొమ్మల కత్తిరింపును కొనసాగించారు.

5) ఏ ట్రక్కో ఢీకొని పడగొట్టిన బరువైన వంతెన గోడ మొక్కను మరొకమారు సర్ది కాల్వలోకి జారకుండా పెగ్గులు పాతారు.

6) ఎక్కువ మంది శ్రమధారపోసింది మాత్రం వంతెన దక్షిణంగా బైపాస రహదారి దాకా, తెల్లారేకొద్దీ అక్కడే పని సందడీ, పని వేగమూ కన్పించింది!

          మీరెవరైనా ఈ 100 నిముషాల శ్రమదానాన్ని దగ్గరగా పరిశీలించండి - ఏ ఒక్కరి పారిశుద్ధ్య ప్రయత్నమూ మ్రొక్కుబడిగా గ్రుడ్డిగా జరగడం లేదనే సంగతి గ్రహిస్తారు!

          అసలలా జరగడానికిదేమన్నా కీర్తి ప్రతిష్టల కోసమో ఎవరి ఒత్తిడితోనో జరిగే పనా? అలాంటిదైతే తేనె టీగల కాట్లు పడినప్పుడో, చెమటల్తో బట్టలు ఒడలి కంటుకుపోతేనో, బురద బట్టల కంటినప్పుడో విరమించే వాళ్లు!

          ఒక నిస్వార్థ సామాజిక - సామూహిక సత్కర్మ కాండలోమజా ఏమిటో. ఇది వ్రాసే నాకన్న, చదివే పాఠకుల కన్న 2863* రోజులుగా రుచి చూస్తున్న శ్రమజీవన సౌందర్యకారులకే బాగా తెలుస్తుంది!

          నేటి కృషి సమీక్ష ప్రారంభంలో ఒక నిఖార్సైన గ్రామ సుందరీకర్త - ఆకుల దుర్గాప్రసాదు ముమ్మార్లు చాటిన స్వచ్ఛ - సుందరోద్యమ త్రివిధ నినాదాలతో, DRK గారి ప్రశంసతోనూ, నేటి శుభ్ర సుందరీకృత వీధి పట్ల అందరి వదనాల్లో సంతృప్తితోనూ ముగిసింది.

          బైపాస్ రహదారి ప్రక్కన మిగిలిపోయిన పని నిమిత్తం రేపటి వేకువ కూడ మన కలయిక గంగులవారిపాలెం సమీపాననే!

         స్పందనార్హము వందనార్హము

చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమ ప్రణాళిక సర్వశ్రేష్టము

స్పందనార్హము వందనార్హము ప్రతి దినం అనుసరణ కర్షము

ఎందరెందరి శిరోధార్యమొ ముందు ముందది తేటతెల్లము

కట్టు కథలివి కావు - నిత్యం కనుల ముందుండే యదార్ధము!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.08.2023.