2871* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

ఈ నాటిది అక్షరాలా 2 గంటల శ్రమదానం - @2871*

          అదైతే 27 మంది తో 4.15 - 6.14 వరకు శనివారం (2.9.23) వేకువ జరిగిన కృషి! వీధి - గంగులవారిపాలెం - సుమారు 10 ఏళ్ళ నాడు – 2013 లో ఇక్కడనే శ్రమదానోద్యమం మొదలయింది!

          ఎలా మారిందో గాని ఈ వేకువ కార్యకర్తలు ముందు అనుకొన్నదీ - ఆగి కలుసుకొన్నదీ బందరు రహదారిలోని స్టేటు బ్యాంకు వద్దనే! 90% పని జరిగింది మాత్రం జూనియర్ కళాశాల తూర్పు ప్రహరీ బారునా! మిగిలిన 10 శాతం 6 వ నంబరు కాల్వ వంతెన దక్షిణ భాగాన!

          నేటి కృషిని గ్రహించే ముందు - అసలీ గంగులపాలెం వీధి 10 ఏళ్ల పూర్వపు దృశ్యాన్ని గుర్తుచేసుకోవాలి! 2013 తర్వాత ఇక్కడ ఎంత మానవ శ్రమ జరిగితే, దాని వెనక ఎంత మేధో శ్రమ నెలకొంటే - ఎంతగా ఆర్థిక భారం వహిస్తే ఇప్పటి ఈ ఆహ్లాదం సాధ్యపడింది? ఆనాడు తప్పనపుడు ముక్కు మూసుకొని మాత్రమే నిప్పుల కొలిమి గుండా నడిచిన గ్రామస్తుల కాళ్లు అప్రయత్నంగా, అనివార్యంగా ఈ బాట వైపు సాగుతున్నాయా లేదా?

          ఈ ఏడెనిమిది వందల గజాల బాటే ఈ వేళ ఊరంతటికీ నమూనాగా మారడం వెనక 3000 రోజుల ఉక్కు సంకల్పం ఉన్నది! ఏ రైనా - రాష్ట్రమైనా ఆదర్శంగా తీసుకోదగిన చరిత్ర అది!

          అనుకోకుండా ప్రవేశించిన పాతిక మంది స్వచ్ఛంద కార్మికులు ఈ బాట పడమర ప్రక్కన

- కళాశాల గోడెక్కి రెండు ప్రక్కలా చెట్ల కొమ్మల్ని సుందరీకరించారు (అందులో ముళ్ల చెట్లు కూడ!)

- త్వరలో అక్కడ నాటి పెంచవలసిన బంతీ, చేమంతీ, నేల గులాబి వంటి పూల వనాల కోసం నేలను గడ్డి తొలగించి, సిద్ధం చేశారు.

- అసలే శుభ్రంగా ఉన్న రోడ్డును మళ్లీ ఊడ్చి, సంతోషించారు.  

- ఆడుతూపాడుతూ కబుర్ల మధ్య పని జరిగినట్లే అనిపించలేదు గాని తెల్లారిం తర్వాత చూస్తే ఎన్నెన్ని పచ్చని కొమ్మలు రెమ్మలు - గడ్డి ప్రోగులుపడినవని!

- రోజుటివలె అదంతా ఎత్తితే ఒక ట్రాక్టరు సరిపోదు. సమయం చాలక ఎత్తనూ లేదు, మధ్యాహ్నంలోపు ట్రస్టు  కార్మికులా పని పూర్తి చేస్తారు.

          ఈ వేకువ విశేషం - ముప్పాళ్ల భార్గవ శ్రీ అనే వామపక్ష నాయకుడు విజయవాడ నుండి వచ్చి శ్రమదానంలో పాల్గొనడం, తొమ్మిదేళ్ల స్వచ్ఛ సుందరోద్యమాన్ని విశ్లేషించడం!

          మరొక విశేషమేమంటే - కార్యకర్తల శ్రమనూ, తత్ఫలితాన్నీ ప్రతిరోజూ కళ్లారా చూసి, నినాదాల్ని ప్రోత్సహించే DRK వైద్యుడే స్వయంగా నినాదాలు గట్టిగా పలికి అందర్నీ త్సాహపరచడం.

          3 వ విశేషం - దేసు జాహ్నవి జన్మదినం గుర్తుగా 1000/- విరాళం అందడం!

          ఇక - రేపటి వీధి పారిశుద్ధ్య ప్రణాళికేమంటే - రేపు వేకువ కూడ మనం గస్తీ గది వద్దనే కలిసి,  పురోగమించడమే!

          గ్రామం గెలవాలన్నదె

కార్యకర్తదేమున్నది - కల దతనికి ఓర్పు

పనిగంటలు లక్షలుగా ప్రయాణించు నేర్పు

గ్రామం గెలవాలన్నదె కార్యకర్త అభిమతం

ఎన్నేళ్లయినా చేతన ఇప్పటికీ మృగ్యం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.09.2023.