2872* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

రెస్క్యూ టీమ్ వారి 2872* వ నాటి కృషి

            సోమవారం - 4.9.23 వేకువ 4.20 నుండే - గతవారం పొడిగింపు గానే ప్రాత శివరాంపురం వీధి పడమర గానే వాళ్ల ప్రయత్నం జరిగింది! చోటు సైతం అదే - బాల దుర్గా రాంప్రసాదుని ఇంటి ఎదుటనే!

            అస్తవ్యస్త పెను వృక్షాల సమూలచ్చేదనమే ఈ వేకువ కార్యక్రమం కూడ! అందుగ్గాను 3/4/5 కిలోమీటర్ల దవ్వు చల్లపల్లి నుండి కొందరూ, ఉభయ శివరామపురస్థులిద్దరూ అక్కడికి చేరుకోవడమే ఒక విశేషం!

            అక్కడ రంపాలతో, గొడ్డలితో, వారు శ్రమించడమూ తత్ఫలితంగా చెట్ల కాండాలు కొన్ని పనిముట్ల తయారీకి అనువుగా పలకలుగా తెగుతున్న దృశ్యాల్ని వాట్సప్ చిత్రాల్లో చూస్తున్నారా?

            ఇప్పుడు కాదు గానీ ఇలా తొలి కోడి కూతకు వెనకా ముందుగా మేల్కొనడమూ ఇంటి - గొడ్ల చావిళ్ల పంట పొలాల పనులకి దిగడమూ ఒకప్పటి గ్రామ వాతావరణం! ఐతే అవి సొంత బాధ్యతలు! ఈ స్వచ్ఛ కార్యకర్తలవి సొంతూరి - అప్పుడప్పుడూ ఇలా ఇరుగు పొరుగూళ్ల బాధ్యతలు! అందువల్లనే అవి తప్పక ప్రస్తావనార్హాలు!

            6.30 కు తమ వేకువ శ్రమదాన అంతర్యాన్ని ముమ్మారు నినదించి చాటినది - క్రొత్త శివరాంపుర వాస్తవ్యుడూ, ‘లవ్లీనామాంతర క్రొత్తపల్లి వేంకటేశ్వరుడు!

            చెప్పవచ్చును!

ఎన్ని వేల దినమ్ములైనా ఎన్ని లక్షల గంటలైనా

ప్రాలుమాలని బద్ధకించని విసుగుచెందని - విశ్రమించని

ఊరి కంకితమైన సక్రమ ఉద్యమం ఏదైన ఉంటే -

చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమోద్యమమని చెప్పవచ్చును!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.09.2023.