2873* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల!

కోమలానగర్ కు మారిన రెస్క్యూ చర్యలు - @2873*

            మంగళవారం (15.9.23) వేకువ 4.30 కాక మునుపే స్వచ్ఛ కార్యకర్తల ఉనికి కోమలానగర్ ముఖ్య వీధిలో ఆకుల దుర్గాప్రసాద నామధేయుని ఇంటి వద్ద ఉన్న కారణమేదనగా - భారీగా పెరిగి, రోడ్డు పైకి విస్తరించిన మామిడి చెట్టు!

            భవనం మీది కెక్కి, నిచ్చెననుపయోగించి, కొమ్మలు కత్తిరించి, సైజులుగా నరికి, వీధిచారులకిబ్బందిలేనట్లు తుక్కునంతటినీ ట్రాక్టర్లో నింపి, చెత్తకేంద్రానికి తరలించుటే ఈ నాటి రెస్క్యూ చర్యలు!

            నిచ్చెన ఆధారంగా చెట్లెక్కుట, కొమ్మలు నరుకుట చాల మార్లు చూసినదే గానే, బాగా ఎత్తైన, వాలుకొమ్మల మీద పవళించి కూడ రంపమో కత్తో ఈ స్థాయిలో వాడి - ఇంత రిస్కీ పనులు చేయడం ఈ రోజు చూశాను!

            అసలైన ప్రమాదకర కార్యాలు నలుగురివే గాని - కాస్త ఆలస్యంగానూ, మరికాస్త కాల విలంబంగానూ, విజయనగర్ నుండీ, శివరాంపురం నుండీ వచ్చిన వాళ్లెలా పనిలో దిగారో వాట్సప్ లో గమనించుడు!

            ఇంతా జేసి మహా వృక్షం పని పూర్తయిందా అంటే - అర్ధభాగమే జరిగింది. స్థానికులు కూడ ఎవరైనా సహకరిస్తే పని ముగిసేది!

            నేటి స్వచ్ఛ సుందరోద్యమ సంకల్ప నినాదకర్త తూములూరి లక్ష్మణుడు!

            బుధవారం నాటి వేకువ మన కలయిక గంగులవారిపాలెం వీధి గస్తీ గది దగ్గరే!

            ప్రజాశీర్వాదం లభిస్తే

గ్రామ పౌరుల కడుగడుగునా స్వచ్ఛ సంస్కృతి గుర్తుకొస్తే

ప్రజాశీర్వాదం లభిస్తే గ్రామ ముఖ్యులు దయ తలిస్తే

యువత సైతం కలిసి వస్తే - ఉద్యమానికి మద్దతిస్తే

స్వచ్ఛ సుందర చల్లపల్లి అసాధ్య మందువ సోదరా?

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

   05.09.2023.