2874* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

గురువారం 7.9.23 → @2874*

            నేటి వేకువ వరుణుడు ఊరి వీధి స్వచ్ఛ కర్మల్ని ఉపేక్షించి - చల్లగాలితో ప్రకృతి కూడ కార్యకర్తలకు స్నేహ హస్తం చాపి - 4.11 to 6.08 నడుమ వీధి సౌందర్య కృషి సజావుగా సాగి, 19+4 మంది యధేచ్ఛగా తమ బాధ్యతలు నెరవేర్చుకొన్నారు!

            సదరు వీధేమో గంగులవారిపాలెం పేరిట! + 4 మందేమో మనకోసంమనంసంస్థ కార్మికులు! కృషి సాఫీగా జరిగి, కొన్ని చిన్నవీ - రెండు మూడు పెద్దవీ తుమ్మ ముళ్ళవీ ఎత్తైన కొమ్మలు నేల వ్రాలి బాటకు మరింత అందం తెచ్చినవి! కళాశాల లోపలి వైపునా, ప్రహరీ వెలుపలా రంపంతో సహా నిచ్చెనెక్కీ, ప్రహరీపై నిలబడీ ఈ పనులు పూర్తి చేసినది ఐదారుగురూ, ఆ వ్యర్ధాల్ని రోడ్డు వైపుకు మోసింది ముగ్గుర్నలుగురూ!

            ఇక్కడికి ఉత్తరంగా నీళ్ల ఫౌంటైన్ల దగ్గరా, సేల్ఫీ కేంద్రం దగ్గరా - ఎక్కడ కలుపు మొక్కలుంటే అక్కడ, అదుపు మీరిన గద్ద గోరు వంటి ముళ్ళ - పూల చెట్ల కొమ్మల దగ్గరా, దీక్షగా పనులు చేసినవారైదారుగురు.

            గత 3 నాళ్ల వర్షాలకు నేల బాగా నాని, అందరి కాలి చెప్పులకూ 2 అంగుళాల మందాన మట్టైతే అంటుకొన్నది! ఒకరిద్దరి చేతులకు పూల చెట్ల ముళ్లు గీసుకుపోనే పోయినవి! అప్పటి వర్క్ మూడ్లో ఇవన్నీ ఎవరు పట్టించుకొన్నారు?

            [షరా! శ్రమతో గాక వట్టి కబుర్లతో ఏ ఫలితమూ దక్కదని అందరం ఒప్పుకొనేదే! ఊరి జనాభాలో ఈ 0.1% మనుషులు చేసే శ్రమ కొద్దిపాటిదీ, నేను దాన్ని సాగదీసి, వర్ణించేది పెద్దపాటిదీ అని ఎవరైనా అనుమానిస్తారేమోనని నేననుమానిస్తున్నాను! మరో ప్రక్క - మన సమకాలంలో ఎక్కడా జరగని శ్రమదానాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నానీ శంకిస్తున్నాను!]

            ఇక - ఇక్కడికి దూరంగా, పంట కాల్వ వంతెనకు తూర్పుగా ముఖ్య కార్యరంగానికి బాగా ఎడంగా ఒకానొక 69 ఏళ్ల స్వచ్ఛ కార్యకర్త కత్తితో, పారతో కూర్చోలేక వంగొని చేసిన పనికి జోహార్లు!

            ఈ వేళ కూడ పీకిన గడ్డీ, నరికిన కొమ్మలూ, రోడ్డు ప్రక్కనే పడి ఉన్నవి - అవి ట్రస్టు కార్మికుల వంతన్న మాట!

            6. 25 కు - నేటి సంతోషవ్యక్తీకరణ వేళ - శిరస్త్రాణాలు లేక జరుగుతున్న ప్రమాదాన్ని డి.ఆర్.కె. గారు ప్రస్తావించి, కార్యకర్తల్ని హెచ్చరించగా -

            కాస్త ప్రశాంతంగా దైనందిన ఉద్యమ నినాదాల్ని పైడిపాముల రాజేంద్రుడు పలుకగా -

            రేపటి వేకువ సైతం ఇదే గంగులవారిపాలెం వీధిలో ఆస్పత్రి ఉత్తర స్థలంలో మనం కలువదగిన చోటు అనే నిర్ణయంతో-

            నేటి కార్యక్రమం ముగిసెను!

            ఊరు మారిన క్రమంబెట్టిది?

ఎవరు బోధకు లెవరు సాధకు లెవరు కర్తలు భోక్తలెవ్వరు

స్వార్థమెవరిది త్యాగమెవరిది స్వచ్ఛ సుందర మార్గమెవరిది

జనం మేలుకు ప్రజల మధ్యన సాగుచున్న ప్రయాణమెట్టిది

ఉదాహరణ ప్రాయముగ ఒక ఊరు మారిన క్రమంబెట్టిది?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.09.2023.