2878* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

మరొకమారు రెస్క్యూ టీం వారి కృషి – 2878*

          మంగళవారం (12.9.23) వేకువ కూడ వాళ్ల ప్రయత్నం గంగులవారిపాలెం బాటలోనే – బండ్రేవు కోడు కాలువ సమీపాననే జరిగింది. వానలో - ఉరుములు, మెరుపులో ఉన్నా - రెస్క్యూ టీం వాళ్లకేం లెక్క?

          వానలకు పైరులేమో గాని, రోడ్ల మార్జిన్ల కలుపూ, పిచ్చి మొక్కలూ మాత్రం ఏపుగా పెరుగుతున్నవి! పూల మొక్కల పాదులనిండా గడ్డి మాత్రం దట్టంగా వ్యాపిస్తున్నది! స్వచ్ఛ కార్యకర్తలకైతే చేతి నిండా పనే!

          అందుకు తగ్గట్లే ఈ వేకువ 11 మంది దాక గంగులపాలెం వీధిలోకి చేరుకొన్నారు. గద్దగోరు పూల చెట్ల కొమ్మల్ని మరొకమారు కత్తిరించడం కొందరి పనికాగా –

          బురద నేల నుండి గడ్డీ, పనికిరాని మొక్కలూ కత్తుల్తో పని లేకుండ సులువుగా పీకిన చర్యలు కొందరివి కాగా –

          తెగిపడ్డ కొమ్మ – రెమ్మల్ని ట్రాక్టర్లో నింపుకోవడం ఇద్దరి పని గాను - ఇంచుమించు రెండు గంటల శ్రమ జరిగింది!

          వానకు జంకక, చలికి బెదరక, ఉక్కపోతలకు వెనుకడుగేయక, ప్రకృతికి దగ్గరగా, ఒంటికారోగ్యప్రదంగా, ఊరి బాధ్యత నెరవేరుస్తున్న సంతృప్తితో – ఏళ్ల తరబడీ సాగుతున్న స్వచ్చోద్యమ మిది! అన్ని ఊళ్లలో అమలు కాదగిన ఆవశ్యక కర్తవ్యం!

          శ్రమదానం ముగిశాక - 6.30 కు మాలెంపాటి గోపాలకృష్ణుల వారి నినాదాలతో నేటి పనులు ముగిశాయి.

          బుధవారం వేకువ మన కలయిక వాన రాకడను బట్టి - గంగులవారిపాలెం/ లేదా బైపాస్ రోడ్లలో ఒకదానిలో!

          ఒంటి చేతి చప్పట్లా?

సాధించిన ఫలితమ్ములు సంతృప్తి నొసంగుచున్న

సంపూర్ణ ప్రగతి౦కా చాల దవ్వుగా నున్నది

ఒంటి చేతి చప్పట్లా? ఊరంతా పాల్గొనదా?

జన జాగృత చల్లపల్లి సచ్ఛరిత్ర లిఖించదా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.09.2023.