2879* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

2879* వ నాటి 22 మంది కష్టార్జితం!

            బుధవారం (13-9.23) వేకువ 4.14 - 6.08 వేళల నడుమ SRYSP కళాశాల కుడి ఎడమలుగా బందరు రహదారి కేంద్రంగా నెలకొన్న శ్రమ అది! శ్రమ కార్యకర్తలదైతే - ఫలితంగా ఇక్కడి 100 గజాల విశాల వీధి సౌందర్యమూ, గంగులపాలెం వీధిలో అందమైన బోగన్ విలియా చెట్ల కొమ్మల నవీకరణతో వచ్చే ఆహ్లాదమూ, ఎవరైన అంది పుచ్చుకోగల వాళ్లకు సామాజిక స్ఫూర్తీ... ఇవన్నీ గ్రామస్తులకంకితం.

తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశ్రమానంతరం కూడ - ఈ కార్యకర్తలది వ్యసనమా,సేవా, బాధ్యతా, ఆదర్శమా అనే చర్చలు కూడ అనవసరమే!

            “ఇంత పెద్ద ఊరి బాధ్యతల్ని కొద్దిమందిమి మోయగలమా, విస్తృత పౌర సమాజం పూర్తిగా సహకరించకుండానే ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోగలమా... అనే మీమాంసను స్వచ్ఛ కార్యకర్తలేనాడో అధిగమించారు.

            అదృష్టవశాత్తూ అన్ని రాజకీయ వర్గాల్నుండీ, స్వచ్ఛంద సంస్థల నుండీ కొంత హార్దిక, ఆర్థిక సానుకూలత లభిస్తూనే ఉన్నది.

            తొలినాళ్లలో - అనగా 2013 - 2014 ల్లో వలె ఈ చక్కటి కార్యక్రమాన్ని ఒక వింతగానో - పిచ్చిగానో - చూసే కొద్దిమంది కూడ ఇప్పుడు లేరు!

            ఎక్కడెక్కడి సామాజిక పరిశీలకులూ, సంఘ పరివర్తనాభిమానులూ నిరంతరం ఈ చల్లపల్లి శ్రమదానం మీద ఒక కన్నేసే ఉంచుతున్నారు! ప్రస్తుత దుష్టకాల వాతావరణంలో ఇవన్నీ సానుకూలతలే కదా!

నేనైతే ప్రతి వేకువలో వలెనే ఈ పూట కూడ గమనించి, సంతోషించే దృశ్యాలివి :

1) ఒకానొక దివ్యాంగుడు శక్తిమేర గంటన్నరపాటు ప్రైవేటు ఆస్పత్రి వద్ద శ్రద్ధగా శ్రమించడాన్ని,

2) పెద్ద వయసులో ఇద్దరు తమ శరీరాలు సహకరించిన మేర గొర్రులు ఊతంగా వంగిగడ్డి చెక్కి, తుక్కుల్ని ఊడ్చడాన్ని,

3) సొంతింటినో గుడి ప్రాంగణాన్నో శుభ్రపరుస్తున్నంత దీక్షగా ముగ్గురు మహిళలు గూళ్ల నొప్పి లెక్కచేయక రోడ్డును ఊడ్వడాన్ని,

4) శ్రావ్య ఆస్పత్రి, రిజిస్ట్రార్ కార్యాలయ, పండ్ల కొట్లాది చోట్లన్నీ కొందరు శుభ్రపరచడాన్ని...

            ఈ సామూహిక శ్రమోత్సవానికి దూరంగా ఉన్నవారైతే వాట్సప్ ఫోటోల్లోని 6.00 ప్రాంతంలో కనిపించే నాణ్యమైన బందరు బాటనూ కాస్త దూరంగా సుందరీకరణం జరిగిన గంగులవారిపాలెం బాటలోని సుమ వైభవాన్నీ చూసి సంతృప్తి చెందవచ్చు!

            శ్రమదానం సంగతలా ఉంచి, 6.20 సమయంలో- కళాశాల ద్వారం దగ్గర పని సమీక్షా సమావేశంలో – మనకోసం మనంట్రస్టు ఖర్చులకూ - రాబడికీ అంతరం తగ్గడాన్నీ,

            - రెండు దఫాలుగా వచ్చిన 1974, 1977 వైద్య బృందాలు (1 లక్ష & 49 వేలు) పంపిన డబ్బుతోను, సజ్జా వారి (లక్ష) భూరి విరాళంతోను, కోడూరు, మాలెంపాటి (520/-, 2000/-) తదితరుల యథాశక్తి సహకారంతోను అది సాధ్యపడడాన్నీ గ్రహించవచ్చు.    

                రేపటి మన వేకువ శ్రమదాన ఉద్యుక్తత మునసబు వీధి పార్రంభం నుండే అని నిర్ణయింపబడెను.

            సద్యః ఫలితాలనేవి

సద్యః ఫలితాలనేవి సమకూడును పురాణాల

గాథలలో చలన చిత్ర కల్పనలో; వాస్తవిక

ప్రపంచాన దశాబ్దాలొ - శతాబ్దాలొపట్టవచ్చు.

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సంగతైన అంతే గద!

- ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  13.09.2023.