1856* వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1856* వ నాటి దినం విశేషాలు. 

 ద్విముఖంగా నడచిన నేటి మన గ్రామ బాధ్యతలు విజయవాడ మార్గం-6 వ నంబరు పంట కాలువ కేంద్రంగా4.08-6.20 నిముషాల నడుమ సహర్షంగా ముగిసినవి. స్వచ్చ శ్రామికులు 28 మంది.

 

ఐదుగురు సుందరీకరణ బృందం వ్యవసాయ శాఖ, పురాతన భవనపు ప్రహరీని పాత ప్రకటనలను అతి కష్టం మీద గీకి, ప్రైమర్ పూశారు. సదరు కార్యాలయ బాధ్యుల అనుమతి కూడ పొందారు. ఇందుకు గాను నిన్న  రాత్రి అక్కడి లోతైన కంపు గొట్టే మురుగు కాల్వ మీద తాపీ వారి సహాయంతో పరంజా కట్టారు. 200 చదరపు అడుగుల ప్రహరీ సుందరీకరణ కోసం ఎంత ప్రణాళికో, శ్రమో గమనార్హం!

 

ఈ రోజు ఎక్కువ మంది కార్యకర్తల శ్రమదానంతో శుభ్ర పడింది మాత్రం 6 వ నంబరు కాలువ గట్టే! 20 మంది కత్తుల-గొర్రుల-చీపుళ్ల వారు ఒకప్పటి సారా పరిశ్రమ ప్రహరీ వెలుపల 150 గజాల మేర- చిత్తడిగా ఉన్న డ్రైను గట్లను-ముళ్లు, గడ్డి, పిచ్చి కంపలు, తీగలు తొలగించి, కాల్వలోనికి కోసుకుపోయి పడిన గుంటలను, ఆ వ్యర్ధాలతో పూడ్చి గంటన్నరకు పైగా శ్రమిస్తేనే ఇప్పుడా కాలువ దక్షిణపు గట్టు శుభ్రంగా-సౌకర్యంగా, అందంగా రూపొందింది.

 

ఈ ప్రాంతంలో బహిరంగ మల విసర్జన జరుగుతుండటం దురదృష్ట కరం.

 

నలుగురు శ్రమ దాతలు వంతెనకు పడమరగా కాల్వ గట్టులను 50 గజాల మేర బాగు చేశారు. ఆ వ్యర్ధాలతో కొంత కోసుకుపోతున్న కాల్వ గట్టు దగ్గర సర్ది నష్ట నివారణ చేశారు. గతంలో తామక్కడ నాటి పెంచిన చెట్ల పాదుల్ని బాగు చేశారు.

 

రహదార్ల ప్రక్క ప్రహరీలకు అందం సమకూరుస్తూ-వీలైన ప్రతి చోట ఉద్యానాలు నిర్మిస్తూ- కాల్వ గట్ల ముళ్ల పొదల్ని తొలగిస్తూ 1855 రోజుల ఈ నిర్విరామ శ్రమ వీళ్లకెందుకో సోదర గ్రామస్తులు సానుకూలంగా ఆలోచించాలి.

 

రంగుల పనిలో-ప్రతి స్వచ్చ సుందరీకరణ కృషిలో పరిపూర్ణత కోసం తపించే ఆకుల దుర్గా ప్రసాద్ కార్యకర్తలను అన్ని స్వచ్చ వేడుకలలో మరింత ఉత్సాహంగా ఉండమని ఉద్భోదిస్తూ-ఎలుగెత్తి ముమ్మారు చాటిన స్వచ్చ-శుభ్ర- సుందర సంకల్ప నినాదాలతో 6.40 కు నేటి మన సామాజిక బాధ్యతలకు స్వస్తి!

 

రేపటి మన గ్రామ సుందరీకరణ కృషి కూడ 6 వ నంబర్ కాలువ దగ్గర నుండే ప్రారంభిద్దాం!

 

             మందహాస “మద్యం”

డ్రైను లందున-దారులందున వేన వేలుగ పాన పాత్రలు

స్వచ్చ సుందర కార్యకర్తల సహనమునకు పరీక్షలేమో

స్వచ్చ సుందర మాతృ గ్రామం త్రాగుబోతుల స్వర్గమేమో

దారి ప్రక్కల పూల వనములు “బారులుగా” మారేనేమో!

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 11/12/2019

చల్లపల్లి.