2890* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

          105 నిముషాల శ్రమదాన సమాచారం చిత్తగించండి!-@2890*

 

          ఈ ఆదివారం (24.9.23) వేకువ వీధి పారిశుద్ధ్యానికి 4.17 కే సన్నద్ధులైన 10 మందీ, పోలీస్ ఠాణా వీధికి బదులు వాన వల్ల బైపాస్ వీధికి మారిన శ్రమదాన స్థలం దగ్గరికి తరువాత్తరువాత వచ్చి, పనిలో వంగిన 20 మంది సాగించిన గ్రామ మెరుగుదల కృషి వివరాలివి:

వాహనాల్నినిలుపుకొని, చేతొడుగులూ, తలదీపాలూ వేసుకొని, ఆయుధ పాణులైనది ప్రాత కాలం నాటి ప్రభుత్వాసుపత్రివద్దనే గాని, ఎక్కువ మంది పనిలో వంగింది మాత్రం కమ్యూనిస్టు వీధి వద్ద ! అసలా ప్రాంతం చూడ చక్కగా ఉన్నదే బుల్లి రహదారి వనాలతో- రెండు ప్రక్కలా కనువిందు చేసే పూలతో చిక్కని పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నమాట నిజమే!

          ఐతే వాన ముసురుతో వేగంగా పెరిగి, విద్యుత్తీగల్నంటుకోబోతున్న రెండు మూడు చెట్లూ, కంచె దాటి వీధిలోకి చొచ్చుకొచ్చిన కొన్ని పూల చెట్ల కొమ్మలూ, పచ్చగా పెరిగిన పచ్చికా, గంటకు పైగా డజను మందికి పని చూపెట్టాయి !

 

    అవిగాక వీధి సౌందర్యానికి కళంకంగా సిమెంటు బాట మీద దుమ్మూ-ఇసుకా - ఎడనెడా ప్లాస్టిక్ గాజు వస్తువులూ!

 

  గతంలో ఐదారుమార్లు డజన్లకొద్దీ వాలంటీర్లు వారాల తరబడీ శుభ్రపరిచిన (ఆ సందర్భంగా కొన్ని అపవాదులెదుర్కొన్న), ట్రక్కుల కొద్దీ తుక్కుల్ని చెత్త కేంద్రానికి తరలించిన కస్తూర్బాయి ఆస్పత్రి ఆవరణను ఈ ఉదయం చూస్తుంటే- స్వచ్చ శుభ్రతల్ని పాటించే వాళ్లకెంత బాధకలుగుతున్నదో!

    ఆస్పత్రికిప్పుడు  ప్రవేశమార్గమే లేకుండ, తుక్కులు నిండిపోయినవి. ఆ దగ్గర్లో గణేష్ ప్రెస్ వారి ఇంటి ఎదుట బండెడు ఎండు పుల్లల గుట్ట - ఇవి తప్ప - నేటి 30 మంది 50 పని గంటల శ్రమతో- అటు విజయ నగర్ తొలి వీధి నుండి- ఇటు యడ్లవారి బజారు దాక మచ్చలేని వీధి సౌందర్యమే!

          అసలు స్వార్థ రహితంగా తమ శ్రమనూ, గంటన్నర విలువైన కాలాన్నీ ఈ బైపాస్ వీధికి సమర్పించడమూ, అక్కడ ఆ సాంతం మైకు నుండి వినవచ్చే సామాజిక కర్తవ్య ప్రబోధక గీతాలూ, అలసి - సొలసి చెమట ఒంటితో 6.10 కు పని ముగించి వస్తున్న 30 మంది సమూహమూ బాగా ఆలోచిస్తే ఎంత చక్కని దృశ్యం!

          మిగిలిన పనులన్నీ స్వచ్ఛ- సుందరోద్యమ శాస్త్రోక్తంగానే జరిగాయి,  అంటే -150 గజాల వీధి ఊడ్పులూ,  ప్రోగు పడ్డ వ్యర్థాల లోడింగూ, చెత్త కేంద్రానికి తరలింపూ వంటివన్నమాట!

          నేటి తుది సమీక్షా సమావేశ వివరాలేవనగా:

- మద్యపాన వ్యతిరేక దినమట - వక్కలగడ్డ నుండి వచ్చిన కాంపౌండర్ శేషు మంచి అర్థవంతమైన పాట విన్పించాడు.

- 3 రోజుల్నాడు స్వల్ప గాయపడ్డ అడపా గురవయ్య భావోద్వేగ పరమైన ప్రసంగమూ,

- శరీరానికి ఉపవాసం ఎలా ఉపయోగపడుతుందో డాక్టర్ DRK వివరించిన వైద్య పరిజ్ఞానమూ,

- ధ్యానమండలి పక్షాన రాయపాటి రాధాకృష్ణుని శ్రమోద్యమ నినాదాలూ,

 

          బుధవారం వేకువ కూడ వర్షముంటే - ఇదే ప్రభుత్వాసుపత్రి వద్దా, లేకుంటే పోలీస్ వీధి దగ్గరా కలువ వలెననే సమష్టి నిర్ణయమూ...

 

          ప్రతిన చేసే క్రమం చూస్తిని

బ్రహ్మ కాలం లోన జరిగే శ్రమను నిత్యం చూచుచుంటిని

ఎంతకైన తెగించి తెచ్చే వీధి శుభ్రత కెల్ల సాక్షిని

స్వచ్ఛ సుందర చల్లపల్లికి ప్రతిన చేసే క్రమం చూస్తిని

శ్రమల మూల్యం, వాటి ఫలితం సమస్తం గమనించువాడిని!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.09.2023.