2930* వ రోజు ......... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అందరం మానేద్దాం!

2930*వది శుక్రవారం (3.11.23) నాటి శ్రమదానం!

            దానం 33 గ్గురిది!  (అందులో ఒకరు పెట్రోలు బంకు ఉద్యోగి) సమయం 4.17-6.10 AM ప్రాంతానిదిచోటు ఇంచుమించు నిన్నటిదే - అనగా విజయ వాటిక బాటలో NTR పార్కు- నడకుదురు బాట కూడలే!  కార్యకర్తల శ్రమకు సాక్షులు 100 కు పైగా మంది!  మచ్చుకైనా పాల్గొన్న వారు 0మంది!

పని వివరాలకొస్తే

1) 4 రోడ్డు గుంటల పూడిక,

2) పార్కు ప్రక్క లోతైన మురుగ్గుంట బాగు చేత,

3) రెండు రోడ్లకు చెందిన 100 కు పైగా గజాల పరిశుభ్రత,

4) పనిలో పనిగా బంకు ఆవరణ దుమ్మూ ధూళీ తొలగింపు.

            మొదటిది ఆరేడుగురి బరువు పని - పార, పలుగుల్తో రాళ్లనూ, మట్టినీ కదిలించి,డిప్పల కెత్తి, లోతు గుంటల్లో సర్ది, చదును చేసినది. ముమ్మరంగా వచ్చి వెళ్లే  వాహనాలను తప్పించు కొంటూ కష్టించిన ఈ పని వల్ల మళ్లీ గుంటలు పడే దాక వేలాది బస్సులు, కార్లు, ఇతర వాహనాల ప్రయాణ సౌకర్య సాధనమన్నమాట!

            రెండోదే అసలు సిసలు ఒళ్లు జలదరించే శ్రమ! ఎన్నాళ్లుగా ఎందుకు నిలిచి పోయిందో గాని లోతైన డ్రైను ఘాటు కంపుకొడుతున్నఊబి.  దాన్నిండా తెగ బలిసిన పిచ్చి మొక్కలూ, అల్లుకొన్నకాడలూ, ప్లాస్టిక్ సరంజామా! అసలు నిన్ననే ఒకరిద్దరు దాన్లో దిగబోయి, సమయం చాలదని ఆగిపోయారు. ఈ ఉదయం చీకట్లో ఒక BSNL రిటైర్డ్ ఉద్యోగి సాహసించి దిగడంతో నలుగురైదుగురు పూనుకొన్నారు.

            ఇకేముంది - ఒక LIC విరమణ ఉద్యోగితో సహా అందరి బట్టల్నిండా మురుగు కాటుక మచ్చలు. అందమైన పార్కులో నిత్యం వందలాది నడక వారికి మాత్రం కాస్త సౌకర్యం.

            చీపుళ్ల కార్యకర్తలైతే - ఉభయ దారుల్నీ, మార్జిన్లనీ, బంకుకు చెందిన టైల్స్ నీ విసుగూ విరామం లేకుండా ఊడుస్తూనే ఉన్నారు. బంకు ఉద్యోగులిద్దరు కూడ తమ ఆవరణనే కాక, పార్కు గేట్లలో శ్రద్ధగా ఊడ్చడం గమనించాను!

            ఫ్లెక్సీలు వద్దు మొర్రో” అని మనం ఏడెనిమిదేళ్లుగా బ్రతిమాలుతూనే ఉన్నాం గాని మొరాలకించిందెవరు? NTR విగ్రహం దగ్గరనుకొంటా - డ్రైన్లో పడున్న ఫ్లెక్సీని కార్యకర్తలు బైటకు లాగారు.

            నాయుడు మోహన రావు చేసిన నినాదాలతో మొదలైన సమీక్షా సమావేశంలో కార్యకర్తల సంఖ్యా బలం చాలక - పనివాళ్లతో NH216, వేంకటాపురం, పాగోలు రోడ్లను బాగుచేయించిన ఖర్చు 60,000/- అనీ, వరదా హరిగోపాల్, దోనేపూడి శరత్ గార్ల చందాలందుకు సరిపోయెననీ తెలిసింది. శ్రమదానం 9 వ వార్షికోత్సవ సందర్భంగా కార్యకర్తలు తమ అనుభవాలను వెల్లడించాలని కోరడం కూడ జరిగింది.

            రేపటి మన శ్రమ దానం కూడ VJA బాటలోని పెట్రోలు బంకు నుండే మొదలగునట!

            గరిటెడే చాలని

గంగిగోవుపాలుగరిటెడే చాలని

వేమనార్యుడెపుడో విశదపరచె

ఇంత చల్లపల్లి నింతంతగా మార్చి

నట్టి శ్రామికులకు అంజలింతు!

- నల్లూరి రామారావు,

   03.11.2023.