2931* వ రోజు ......... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

2931* వ నాటి గ్రామ పారిశుద్ధ్య ప్రగతి!

          అది శనివారం (4-11-23) వేకువ 4.15 - 6.10 సమయానిది. ప్రగతి సాధక శ్రామికులు 33 మందిలో NTR పార్కు టాయిలెట్ల నిర్వాహక ఉద్యోగి కూడ ఉన్నాడు. స్థలం బెజవాడ బాటలో

1) ఇంధన నిలయ

2) విద్యుత్ కార్యాలయ ప్రాంతం.

          అర్థరాత్రి దాటాక భారీ వర్షంతోనూ, 4.00 AM దాక కొద్దిపాటి వానతోనూ “అసలీ వేకువ వీధి పారిశుద్ధ్య శ్రమదానం జరిగేనా?” అనే సందేహం కలిగింది గాని, ఇంతకన్న ముసురు వానల్లో మాత్రం జరగలేదా? ఈ వేకువా  అంతే - చినుకులైనా, చలైనా కార్యకర్తల నిన్నటి సంఖ్య తగ్గలేదు!

          ఇవాళ్టి కష్టతర శ్రమదానం గురించీ, కొందరి పని విన్యాసాల గురించీ ఎంతని వ్రాయను? అసలే మురుగ్గుంట - దాన్ని క్రమ్మేసి పెరిగిన పొన్నగంటి కాడలూ, ప్రాకి, పెనవేసుకొన్న పిచ్చి తీగలూ, ఎక్కడ కాలుంచినా వాన తడికి జారి, డ్రైన్ లో పడే పరిస్థితి - అద్దాని వద్దనే 22 మంది రకరకాల పారిశుద్ధ్య - సుందరీకరణ ప్రయత్నాలు!

          రోడ్డుపై నిల్చిన JCB అంచున నిలబడి, బాలెన్స్ చేసుకొంటూ ఒక సుందరీకర్త బోగన్ విలియా ముళ్ల కొమ్మల్ని కత్తిరిస్తుంటాడు! ఇంకొక 63 ఏళ్ల విశ్రాంతోద్యోగి ముందు జాగ్రత్తగా కల్లు గీత కార్మికుడిలా నడుముకు త్రాడు కొట్టుకొని డ్రైన్లో గడ్డిని పెకలిస్తుంటాడు! 2 M.Sc. డిగ్రీలున్న ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయిని కరెంటు పోల్స్ మీద నిలబడి, దంతెతో

మురుగు గుంట నుండి తుక్కులు లాగింది!

          అసలక్కడ గంటన్నర శ్రమించిన ఏ కార్యకర్త బట్టలు, చీరలు మురుగులో తడిసి, నాని, కంపుకొట్టకుండనే లేదు! ఒక రిటైర్డ్ BSNL ఉద్యోగికైతే పని విరమించాక 20 నిముషాల తర్వాత కూడ బట్టల నుండి మురుగు ఓడుతూనే ఉన్నది!

          ఇక్కడికి కాస్త దూరంగా - కరెంటు కార్యాలయం ఎదుట ఏడెనిమిది మంది శ్రమ మరొక రకం. అక్కడ ఇద్దరు రైతుల్లో ఒకాయనైతే 3 - 4 కిలోమీటర్ల దూరపు శివరాంపురం నుండి రోడ్డు మీద వాన నీళ్లలో సైకిలు త్రొక్కుకుంటూ వచ్చాడు!

          ఏమైతేనేం - ఇందరి దీక్షతో - రెండు నాళ్ల శ్రమతో 2 మురుక్కాల్వలూ రోడ్ల మీది 4 గుంటలూ బాగుపడ్డాయి.

          కాఫీ వేడుక ముగిసి, గోళ్ల విజయకృష్ణ వేగంగా ముమ్మారు చెప్పిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, DRK గారి స్వచ్ఛ సుందర కబుర్లతోనూ నేటి కృషి ముగిసింది.

          60 కి పైగా నీడనిచ్చే మొక్కలు నాటేందుకు రేపటి వేకువ మనం కలువదగింది గంగులపాలెం దగ్గరి NH216 ఉపరహదారిపైననే!

          నేల వదలక సాముచేసే

ప్రకృతిని విధ్వంస పరచే పాప కర్మం కాదు వీరిది

ప్రకృతితోటి మమేకమౌతూ పరవశించే పనులు వీరివి

సాటి వారిని గౌరవించే స్వచ్ఛ సంస్కృతి బాట వీరిది

నేల వదలక సాముచేసే నేర్పు వారిది - ఓర్పువారిది !

- నల్లూరి రామారావు,

   04.11.2023.