2932* వ రోజు .............

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

                             2932* వ నాటి శ్రమదాన విశేషాలు!

          అంటే 5.11. 23 - ఆదివారం వేకువ కాలపు సంగతులు!

          ఊరికా చివర్నుండి పనిచోటుకు 3 ½  కిలోమీటర్ల దూరం – గంగులవారిపాలెం- కాసానగర్ల నడుమకు 41 మంది బ్రహ్మ కాలంలో చేరుకోవడమే ఒక విశేషం.

          అప్పటి దాక వానపడి, ఏటవాలు చోట జారిపోతున్న కాళ్లు కూడదీసుకొని, పలుగుతో- పారతో గుంటలు త్రవ్వి, పెద్ద చెట్లు నాటేందుకు సిద్ధం చేయడం రెండో విశేషం.  

          వాళ్ళేమీ ఆవారాగాళ్లు కాదు - నిత్యం బిజీగా ఉండే ఉద్యోగినీ ఉద్యోగులూ, వృత్తి నిపుణులూ ఐ ఉండీ - ఇతర పనుల్ని సర్దుబాటు చేసుకొని మరీ తమ ఊరి అందచందాల నిమిత్తం - వానరాబోతుందని తెలిసీ ఈ బందరు (NH 216) ఉప మార్గంలో చాత నైనంత శ్రమించింది మరొక విశేషం!

          మీరెంత వరకు నమ్ముతారోగాని - ఇందులో 7-8 మందైతే మరీ అతిగా- స్వచ్ఛ సుందరోద్యమంతో మమేకమైపోయి కలవరిస్తారంటే అతిశయోక్తే కాదు!

           మగవాళ్ల సంగతి సరే - ఉషోదయం కన్న ముందే ఇంటి పన్లుండే గృహిణులూ, చిరుద్యోగినులూ, గ్రామ మెరుగుదలకే తొలి ఓటేసి, ఇంత దూరం వచ్చినదీ, రకరకాల వీధి బాధ్యతలు నెరవేర్చినదీ విశేషం కాదూ?

          ఇందరు కార్యకర్తలు క్రమశిక్షణగా, ఐకమత్యంగా, ఒక ఉమ్మడి లక్ష్యంగా 58 మొక్కల్ని శ్రద్దగా నాటారే- అదీ నా దృష్టిలో విశేషమే!

          చల్లపల్లి నుండి సరే అమెరికా నుండి వచ్చిన వాళ్ళు, రామానగరం, - శివరాంపురం నుండి చీకట్లో వచ్చిన వాళ్లు, తమది కాని ఊరి పట్ల ఇంత నిబద్ధత చూపడం సామాన్య విషయం కాదు.

          యువత ప్రాతినిధ్యం కూడ ఉన్న, ధ్యాన మండలి, లయన్స్  వంటి వారి ప్రమేయమున్న ఈ ఉదయం 4.20 - 6.16 నడుమ 2 గంటల పాటు కేవలం 58 చెట్లు నాటడమే కాదు – నిన్న పొరపాటున సరైన చోట్ల గుంటలు త్రవ్వక- ఈ వేళ మళ్లీ అనువైన చోట్ల త్రవ్వే పని వల్ల జాప్యం జరిగింది.

          6.25 పిదప గాని 40 మందితో సమీక్షా సమావేశం జరగలేదు!

- అందర్లో నేటి తమ శ్రమదానం వల్ల వచ్చిన సంతృప్తి కనిపించింది.

- వచ్చే ఆదివారం- అనగా 12-11-23 న జరిగే తొమ్మిదేళ్ల వార్షికోత్సవం తాలూకు ఉద్విగ్నత ఈ వేళ చాల మందిలో కనిపించింది.

- అందుకు తగ్గట్టుగా మన ఆస్థాన వాగ్గేయకారుడు 2 మంచి పాటలు పాడగా - అంతకు ముందు ధ్యాన మండలి ప్రతినిధి గోళ్ల వేంకటరత్నం స్వచ్చోద్యమ సాంప్రదాయక నినాదాలు చేయగా

- కార్యకర్తలు వ్రాత పూర్వకంగా తమ అనుభవాలు పంచుకోవాలని DRK గారు గుర్తుచేయగా....

- అక్టోబర్ నెల స్వచ్చోద్యమ జమా ఖర్చులను DRK గారు వివరించగా...... నేటి కార్యక్రమం ముగిసింది.

          బుధవారం మనం మరొకమారు కలువదగిన చోటు బెజవాడ బాటలోనే!

      ఆది తప్ప అంతం లేనట్లే

ఔరా! ఈ స్వచ్ఛంద శ్రమదానం ఏమొగాని

 ఆది తప్ప అంతం లేనట్లే కనిపిస్తున్నది!

ఫలితం - 50 శాతం పరిశుభ్రత, పచ్చదనం

వ్యాపిస్తూ ప్రతి ఊరికి ఆదర్శం అనిపిస్తది!

- నల్లూరి రామారావు,

   05 .11.2023.