పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!
రెస్క్యూ కార్యకర్తలదే 2934* వ శ్రమదానం!
మంగళవారం వేకువ సైతం 5+3 మంది హరితీకరణ సేవలు బందరు జాతీయరహదారికి దక్షిణంగా 4.25 నుండి 6. 15 దాక లభించాయి! అంతకుముందు వాన పడినా, పని వేళమాత్రం వదిలిపెట్టింది.
ఐనా అక్కడ తడి, కాళ్ళు జారుడుతో జాగ్రత్తగా పని జరిగింది. ఆ నలుగురైదుగురి పనిపాటుల్లో ముగ్గురు పెద్దల సహకారం.
ఈ వేకువ సమయాన నాటింది 12 మొక్కలు. బహుశా ఈ సరిక్రొత్త జాతీయ ఉపదారిలో - ఈ 1700 కు పైగా మొక్కలతో - 2.2 కిలోమీటర్ల దారికి రెండు ప్రక్కలా పెద్ద వృక్షాల పచ్చదనానికీ, చిన్న - పెద్ద పూల మొక్కల పుష్ప సంపదకీ ప్రారంభోత్సవం జరిగిందన్నమాట!
ఇప్పటికిప్పుడు చూసినా కొన్ని మొక్కల పూలు వచ్చే పోయేవారిని చిరునవ్వుల్తో పలకరిస్తూనే ఉన్నాయి! మరో 7-8 నెలల తర్వాత ఈ రహదారి భాగంలో వెల్లివిరిసే హరిత – పుష్ప పైభవానికా నవ్వుల పువ్వులు సూచికలన్న మాట! గత నాలుగైదు నెలలుగా శ్రమదానంలో పాల్గొన్న కార్యకర్తలకూ, గ్రామస్తులకూ మరికొన్ని నెలల పిదప ఈ రహదారి ప్రతిదిన సందర్శకం కాబోతున్నది!
సోమిశెట్టి రాఘవేంద్రరావు, ఫణి కుమారి గార్ల జంట పుత్రులు రుత్విక్ రాఘవ హరణ్, రుషిక్ రాఘవ హరణ్ ల జన్మదిన సందర్భంగా తమ స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తంగా ఇచ్చిన 2,000/- విరాళానికి స్వచ్ఛ కార్యకర్తలు ధన్యవాదాలు చెప్పుచున్నారు. బాలురకు ఆశీస్సులు.
కేసరపల్లిలో “అమ్మ వృద్ధాశ్రమం” నిర్వహిస్తున్న శ్రీమతి చెరుకూరి షీల గారు స్వచ్చోద్యమం కోసం 10,000/- విరాళాన్ని అందజేశారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
నేటి శ్రమదానానంతర ఉద్యమ నినాదకర్త కస్తూరి శ్రీనివాసుడు.
బుధవారం నాటి మన కలయిక ప్రదేశం బెజవాడ రోడ్డులో విజయా కాన్వెంట్ దగ్గరే!
వినుతించిరొ – గణుతించిరొ
ఎందరు సందర్శించిరొ – వినుతించిరి – గణుతించిరొ
తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ
అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును
చల్లపల్లి శ్రమ వేడుక సార్థకమను కొందును!
- నల్లూరి రామారావు,
07 .11.2023.