2940* వ రోజు ....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా!

చల్లపల్లిలో 2940* వ నాటి శ్రమ విశేషాలివీ!

         మంగళవారం నాడు (14.11.23) నాడు రెస్క్యూ టీం అనబడేది గంగలవారిపాలెం బాట – బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపుటంచున హాజరైనది 4.25 కే, ఎవరి శ్రమదాన విన్యాసాలు వారు ప్రదర్శించినది 6. 12 వరకే, దఫ దపాలుగా ఇతర కార్యకర్తలు వచ్చి, వాళ్లతో కలిసిపోయిందీ పని వాళ్ల సంఖ్యను పెంచిందీ 15కే.

         మొన్నమొన్నటి దాకా వాన గాడు వీళ్లను వెంటాడితే, ఈరోజిక మంచు గాడు వాళ్లతో స్నేహం మొదలెట్టాడు! అతనికి తోడు చల్ల గాలి గాడూ తోడయ్యాడు! వీళ్లందర్ని చూసి, వెనకడుగేస్తే వాళ్లసలు స్వచ్చ కార్యకర్తలెట్లా ఔతారు? మంచు తడి ఉన్న చెట్టెక్కితే జారిపడతామని భయపడితే రెస్క్యూ కార్యకర్తలెలా అనిపించుకొంటారు?

         అసలింతకీ “వేకువ చీకట్లో మురుగు నీళ్ల ఒడ్డున చెట్టెక్కే అగత్యమేమున్నది?” అంటే – అంత పెద్ద చెట్ల మీదికి ప్రాకించిన పూల తీగలు కొన్ని పట్టు తప్పి క్రిందకు వ్రేలాడుతున్నవట! నిచ్చెన్ల మీదుగా 4 చెట్లపై కొమ్మలకెక్కి, తీగల్ని బాగా అమర్చడమే నేటి ముఖ్య కార్యక్రమం!

         ఇక - మిగిలిన కార్యకర్తలు మాత్రం చేతులు ముడుచుక్కూర్చోలేదే! బాట మీదా, అంచుల్లో పడిన ప్లాస్టిక్ వ్యర్ధాల్నీ, దుమ్మూ - ధూళినీ, సీసాల్ని ప్రోగేయడమూ, ఊడ్వడమూ, ఏరడమూ వాళ్ల వంతు!

         ఈ వ్యవహారాల్ని కెమేరాలో బంధించడం ఇంకొకాయన సరదా!

         పనిమంతులకి కావలసిన పనిముట్లూ, మంచి నీళ్ళూ అందించడం ఇంకో ముసలాయనకిష్టం!

         చివరికి పద్మాభిరామం దగ్గరకు చేరిన 15 మందీ ఈ రోజు శబరిమలై వెళ్లబోతున్న కస్తూరి విజయ్ ననుసరించి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలందుకొన్నారు.

         రేపటి వేకువ కూడా మన శ్రమక్షేత్రం ఈ గంగులవారిపాలెం బాట తొలి మలుపు వద్దనని నిర్ణయించారు!

         సహర్షంగా స్వాగతిస్తాం!

అహోరాత్రులు శ్రమిస్తున్న – మహోద్యమమై క్రమిస్తున్న

వీధులూడ్చి డ్రైను నడిపీ వెన్ను దన్నై నిలుస్తున్న

ఊరి పరువును నిలుపుతున్న ఉత్తమోత్తమ కార్యకర్తల

స్వచ్ఛ - సుందర ఉద్యమాన్నే సహర్షంగా స్వాగతిస్తాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.11.2023.