2941* వ రోజు ....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదగునా!

అవసరమైన గ్రామ వీధిలో 2941* వ నాటి శ్రమదానం!

బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా :

- పదో, పన్నెండో పూల తీవ మొక్కలు మరికొన్ని చెట్ల ప్రక్కన నాటబడ్డాయి. నాటిన శ్రమా, ఖర్చూ గురించి కాదు ఈ ఆశాజీవులాలోచించేది; ఇవి ఎన్నాళ్లకు పెరిగి, చెట్ల మీదకి ప్రాకి, కుసుమాలను ప్రసవించి, ఇప్పటికే అందంగా ఉన్న ఈ 1 కిలోమీటరు రోడ్డును ఇంకెంతగా దర్శనీయం చేస్తాయనే!

ఈ 9 ఏళ్ల బట్టీ వీళ్ల బుద్ధులిలా ఉండబట్టే, ఇన్ని రహదారులూ, పబ్లిక్ ప్రదేశాలూ, బైపాస్ మార్గాలూ

శ్మశానాలూ, ఇంకా చెప్పాలంటే మురుగు కాల్వల గట్లు కూడా దిష్టి తగిలేంతగా పుష్ప – హరిత నిర్భరములైపోయినవి!

ఊరి ప్రధాన వీధుల్నీ, బస్ స్టాండు నీ ఊడ్చి మెరుగులు దిద్దితే చాలక – ఊరి పొలిమేరలు దాటి, కిలోమీటర్ల కొద్దీ 9 రహదారుల్ని హరిత - పుష్ప సంభరితం చేసే మంకు పట్టేమిటో – అందుగ్గానూ ఎక్కడికక్కడ 30-40-50 వేల చొప్పున ఖర్చులేలనో – అందు నిమిత్తం కొందరు దాతల సహకారమెందుకో అందరూ తెలుసుకొని తీరాలి!

ఇక ఈ నాటి వేకువ 30 కి పైగా పని గంటల ఫలితాలేమంటారా? అందుకేంలోటు? తమ నివాస గ్రామమూ, దాని చుట్టు ప్రక్కల్లా ఏమేమి చేయాలో - ఏరోజెక్కడ ఎలా కష్టించాలో శ్రమదాతలకే తెలుసు!

దారి పొడవునా ఏ ప్లాస్టిక్ తుక్కూ, కాగితమ్ముక్కా, కనపడితే సహించలేని బలహీనత వాళ్ళది! ఏ గడ్డి పరకా, పిచ్చి మొక్క మిగిలినా కత్తులకెర వేయక – దంతెల్తో ప్రోగులు చేయక - చీపుళ్లతో బాటను శుభ్రం చేయక ఊరుకొంటారా? అందుకు కంపుగొట్టే బండ్రేవు మురుగైనా, వీధి మార్జినైనా వాళ్లకొకటే!

తక్కిన కార్యకర్తల వ్యసనమలా ఉండనిద్దాం - 10 నెలల్నాడు కాలు బాగా దెబ్బతిని – ఇప్పుడే కోలుకొంటున్న అన్నపూర్ణ సంగతే చూద్దాం – ఆమె కోడలి పుట్టినరోజుట - ఇందరు కార్యకర్తల శ్రమ వేడుకను చూడక ఇంట్లో కూర్చొనలేకపోతున్నదట - పదడుగులేస్తే కాలు నొప్పి వస్తున్నా సరే - వచ్చి, అందరికీ తీపి వంట తినిపించి, ట్రస్టు ఖర్చులకు 1000/- బహూకరిస్తే!!

సదరు అన్నపుర్ణ ప్రకటించిన వెరైటీ నినాదాలతోనూ, DRK గారి ఎక్కడెక్కడి ప్రముఖులో చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ప్రశంసిస్తున్న, సందర్శించబోతున్న వార్తలతోనూ నేటి శ్రమదానం పరిసమాప్తి!

రేపటి వేకువ కూడ మన లక్ష్యం ఇదే గంగులవారిపాలెం వీధి మలుపు కటూ - ఇటూ శ్రమించడమే!

            సాష్టాంగ ప్రణామములు!

“స్వార్థంలో కిక్కు వద్దు - త్యాగంలో మజా ముద్దు

వ్యక్తుల విజయాలకన్న సామాజిక జయమెమిన్న”

అను ఆదర్శం కోసం అహరహమూ శ్రమిస్తున్న

స్వచ్చోద్యమ కారులార! సాష్టాంగ ప్రణామములు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.11.2023.

పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ గార్లు వారి కోడలు లావణ్య గారి తరపున స్వచ్చోద్యమానికి విరాళం