2943* వ రోజు ...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

శుక్రవారం (17-11-23) నాటి శ్రమ దృశ్యాలు!

అవి మరొకమారు గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు కాల్వ ప్రక్కనే కనిపించాయి! 27 మంది గ్రామాంకితుల వేకువ 4:12 - 6:06 సమయాల నడిమి పారిశుద్ధ్య పనికి చెందినవి! ముందుగా పరస్పర పరామర్శ్మల - కత్తి విసరుల – దంతెల గరగరల - మధ్యేమధ్యే చతురోక్తుల – కొందరి కూనిరాగాల - సందడి సన్నివేశాలవి!

ఇన్నేళ్ల గ్రామ శ్రామికులకూ, శ్రమదాన హితాభిలాషులకూ, ఆ రెండు గంటల శుభ సంకల్పాన్ని తరచుగా అమెరికా – దావణగెరేల నుండి వీడియోల్లో వీక్షించే వారికీ ఇవన్నీ చిరపరిచితాలే గాని, చల్లపల్లిలోనే ఇంకా దీని తాకిడి తగలని 30- 40% మంది వచ్చి చూస్తే మాత్రం సంభ్రమాశ్చర్య కారణాలు! తక్షణ ప్రేరకాలు!

ఎందుకంటే - ఈ దృశ్యాలు లబ్ద ప్రతిష్టులైన పెద్ద డాక్టర్లకూ, ఇంటి పనులు వాయిదా వేసి, బ్రహ్మ కాలంలో ఊరికి దూరంగా వచ్చిన గృహిణులకూ, ఒజ్ఞలకూ, చిరుద్యోగులకూ, రైతులకూ, బేహారులకూ సంబంధించినవి మరి! అషామాషీగానో -  అన్యమనస్కంగానో కాక ఒక నిర్దిష్ట ప్రయోజనమాసించి - సుదీర్ఘకాలంగా – మంచి లక్ష్యం వైపు ఒక్కొక్క అడుగుగా ముందుకు కదులున్న ఒక సామూహిక సన్నివేశమది!

మచ్చుకొకటి - రెండు సంగతుల్ని ప్రస్తావిస్తాను:

-  కాలు నొప్పితో సరిగ్గా నిలబడలేక - బోర్లించిన డిప్ప మీద కూర్చొని, పనిచేసే వాళ్లకి లైటు చూపుతూ, డిప్పను జరుపుకొంటూ రోడ్డును కాస్త – కాస్త శుభ్రపరుస్తున్న ఒక గృహిణీ,

- గంగులపాలెం దారికి పడమరగా మురుగు కంపును తేలిగ్గా తీసుకొని, పిచ్చి కంపనీ, గడ్డినీ తొలగించుకుపోతున్న ఇద్దరు రైతులూ,

- ఒక మాజీ వార్డు మెంబరమ్మా,

- 76 ఏళ్లొచ్చినా - 84 ఏళ్లు గడుస్తున్నా - చలి వణికిస్తున్నా ఊరి వీధి బాధ్యతలు మానని 3 గ్గురు పెద్దలూ,

నేటి సమీక్షా సమావేశ వివరాలు:

1) పసుపులేటి ధనలక్ష్మి గారు చాల రోజుల తర్వాత ప్రకటించిన గ్రామహిత నినాదాలూ,

2)  డాక్టర్ DRK అందించిన ఒక నిరంతర యాత్రికుడు దాసరి అమరేంద్ర గారి రేపటి శ్రమదాన సందర్శనా సంగతులూ,

3) అడపా వాని సూక్తులూ.......

రేపటి వేకువ సమయపు వీధి పారిశుద్ధ్యం కూడ ఇదే చోట ఆగి, కొనసాగించవలెననే అంతిమ నిర్ణయం!

కదన శంఖములు

అర్ధరథుడని – మహారథుడని - అతిరధుండని పేర్కొన్నది

శత్రుహనన మొనరించిన సాహసికుని భారతం

కాలుష్యం రక్కసి పై కదన శంఖములు ఊదిన

స్వచ్చోద్యమ కారులనే పదములతో చెప్పదగును?

- ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త

   17.11.2023.