1857 * వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1857* వ రోజు కబుర్లు.

 

ఈ నాటి చలి వేకువలో 4.02-6.05 నిముషాల నడుమ విజయవాడ మార్గం-6 వ నంబరు పంట కాల్వ-నారాయణ రావు నగర్ వెళ్లే రోడ్డు/గట్టు మీదను, ప్రభుత్వ వ్యవసాయ శాఖ భవనం దగ్గర-ద్విముఖంగా జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

 

స్వచ్చ సైన్యాధికారులిద్దరు-వైద్యుల వారైన రామకృష్ణ ప్రసాదు-పద్మావతి భాగ్యనగర ప్రయాణంలోను, మరికొందరు భక్త కార్యకర్తలు శబరిమల యాత్రలలోను, ఉండటంతో మన సైనిక బలం కొంత తగ్గింది.

 

పంట కాలువ వంతెన నుండి చిన్న కార్ల షెడ్డు దాక కొందరు శుభ్ర పరిస్తే, డ్రైను లోని ఎండు-పెద్ద చెట్ల మొదళ్లను ముగ్గురు సర్దారు. మిగిలిన ఎండు తుక్కును, గడ్డిని, పిచ్చి మొక్కల్ని తొలగించి, సదరు వ్యర్ధాలన్నిటిని డిప్పలతో ఎత్తి ట్రస్టుకు చెందిన ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

కాలువ దక్షిణపు దిశలో నిన్న పోగేసిన వ్యర్ధాలను ఈ ఉదయం ముగ్గురు కార్యకర్తలు కొంత ట్రాక్టర్ లో కెత్తి, కొంత కాలువ రివిటి దగ్గర పల్లంలో పూడ్చారు.

 

ఉత్తరపు గట్టును 100 గజాల మేర నలుగురు కత్తి వీరులు దట్టమైన పిచ్చి-ముళ్ల మొక్కల్ని, గడ్డిని అడ్డు తొలగించి పాదచారులకు సౌకర్యం కల్గించారు.

 

సుందరీకరణ యోధులిద్దరూ నీటిపారుదల శాఖకు చెందిన భవనం ప్రహరీకి రంగులు పూశారు. ఇలా- ఎంత వర్ణించినా ఈ స్వచ్చ సుందర కార్యకర్తల దైనిక చర్యల కథనం పూర్తి కాదు. వీరి సామాజిక బాధ్యతా నిర్వహణకు, నిస్వార్థ సమయ-శ్రమదానాలకు కామాలు తప్ప ఫుల్ స్టాపులుండవు!

 

నేటి స్వచ్చంద శ్రమదాన కృషి సమీక్షా సమావేశంలో నర్సు మహాలక్ష్మి శ్రావ్యంగా ముమ్మారు పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.30 నిముషాలకు మన బాధ్యతలకు ముగింపు!

 

రేపటి మన శేష బాధ్యతా పరిపూర్తి కోసం ఈ 6 వ నంబరు కాల్వ దగ్గరే కలుసుకొందాం!

 

         పడికట్టు పదాలేనా!

చిత్త శుద్ధి-నిజాయితీ సెలవు తీసుకొంటున్నవి

“ప్రజా సేవ”-“శ్రమదానం” పడి కట్టు పదాలైనవి

స్వచ్చ సైన్య సేవలె మినహాయింపులు ఇందుకు

వేలాది దినాల సేవె వినుత సాక్ష్య మందుకు!

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 12/12/2019

చల్లపల్లి.