2994*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

                        అవనిగడ్డ బాటలో పాక్షికంగా శుభ్ర- సుందరీకరణం@ 2994*

          26 మంది నిర్వహించిన సోమ-మంగళ వారాల పారిశుద్ధ్య - కృషి ఈ వేకువ 4.15-612 కాలావధిలో ముగిసింది. పాగోలు బాట మొదలు అడపా గార్డెన్స్ దాక అటు 150 గజాల రాదారి అందమూ, ఇటు స్వచ్ఛ కార్యకర్తల ఆత్మానందమూ - ఉభయకుశలోపరి –

          ఈ రెండు రోజుల మీదా హక్కు వాస్తవానికి రెస్క్యూటీమ్ వారిది. ఐతే 3000 రోజుల మైలు రాయికి సమీప 14 వ తేదీ నాటి భోగి వేడుకకు సంసిద్ధులయేందుకు పనిచోట్లూ, పని పద్ధతులూ మారినవి.

          అందరికీ గుర్తుండే ఉండాలి - 3 ఏళ్ల నాడనుకుంటా MLA బృందంతో సహా మనం వినూత్న పద్ధతిలో శ్మశానం లోనే భోగి వేడుకలు నిర్వహించుకొన్న సంగతి? ఒక రకంగా చూస్తే- స్వచ్ఛ చల్లపల్లి ఉత్సవాలన్నీ ఇలా గమ్మత్తుగానే ఉంటాయి!  వందల మంది పాల్గొనే  సమావేశాలూ, వార్షికోత్సవాలూ, వేకువనే జరుగుతాయి! ఈ ఏడూ అంతే - కడియాల రామారావు- భారతి దంపతుల సౌజన్యంతో ఈ 14 వ తేదీ – సన్ ఫ్లవర్ కాలనీ సమీపంలో జరుగనున్నవి!

          అటు భోగీ, ఇటు శ్రమదానోద్యమ 3 వేల దినాల వేడుకా కలిసి వచ్చినవి!  దీనికి సీనియర్ మోస్ట్ IAS అధికారి కాకి మాధవరావు గారు ముఖ్య అతిథి అని తెలిసింది.

ఇక – 9.01.2024 వ నాటి కార్యకర్తల 40-50 పనిగంటల వీధి బాధ్యతల సంగతి కొస్తే:-  అవన్నీ అవనిగడ్డ రాదారిలోని బండ్రేవు కోడు కాల్వవంతెన కేంద్రం గానే!

1) వంతెన కిరు ప్రక్కలా మురుగు కాల్వలోని ఎన్నెన్ని గాజు, ప్లాస్టిక్ బుడ్లు బైటకొచ్చాయో! వంతెన గోడల్లో మొలిచి, పెరిగి, దాన్ని బద్దలు కొట్టబోతున్న పిచ్చి మొక్కల్ని తొలగించడం చూశాను.

2) గోడల ప్రక్క గండ్లు పడి, ప్రమాదంగా మారుతున్న వాటిని పూడ్చడం గమనించాను.

3) కాల్వ పూడిక తీసిన మట్టీ, సమీప గృహస్తుల నిర్వాకంతో తయారైన చెత్తా కలిసి, అసహ్యంగా మారిన డంపును డజను మంది కంపును భరిస్తూ ఎత్తిన వైనం కనిపెట్టాను.

మనబోటి వాళ్లకు తెలియాల్సిన జవాబులేమంటే-  1) ఎందుకిందరు కార్యకర్తలు దశాబ్దకాలంగాఈ మురికి- దుర్గంధ కార్యాలు చేస్తుంటారనీ,

2) మిగిలిన గ్రామస్తుల సంగతి వదిలేసి, ఆ సమీప గృహస్తులైనా వచ్చి సహకరించరెందుకనీ!

 

నేటి శ్రమదాన నినాదాల కర్తవ్యం సజ్జా ప్రసాదుగారిది, తన సోదరుడు అర్జున సారధి గారి విరాళం- 1502/- ను చెల్లించినది పల్నాటి అన్నపూర్ణ గారు!

మన రేపటి శ్రమదానం గంగులపాలెం సమీపంలోని జాతీయ రహదారి చెంతనే!

           కలయో-వైష్ణవ మాయో

కలయో-వైష్ణవ మాయో- కాకుంటే కనికట్టో-

గాఫ్రిక్సో- చిత్త భ్రమో కాదిది వాస్తవమేనని

లక్షల పని గంటల శ్రమ సాక్ష్యంగా నిలుస్తోంది!

మెరుగుపడిన ఊరు కూడ మరీ మరీ చాటుతోంది!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  09.01.2024