2995*వ రోజు........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

NH 216 సుందరీకరణలో 29 మంది - @2995*

          10/01/2024 - బుధవారం కూడ చల్లపల్లి శ్రమదానం కథ మామూలే! కర్మకేం ఈ అవనిగడ్డ బాట నుండి గంగులవారిపాలెం సుందర కర్మకాండ యధాతధంగా జరిగిపోయినవి!

          ఆ 4 రోడ్ల కూడలిలోని మూడు ప్రక్కల బాటలూ కార్యకర్తల కష్టంతో కొంతమేర ఇప్పుడు అద్దంలా మెరుస్తున్నవి. నాలుగోది అంతకు ముందే శుభ్రంగా ఉండి, పెద్దగా పనిపడలేదు.

          నాకు గుర్తున్నంత వరకూ ఈ శ్రమకారులు ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ డజను మార్లు ఊడ్చారు; నీడ చెట్లూ - పూల చెట్లూ 100 కు పైగా నాటారు; వాటిని సంరక్షించేందుకు నీరు పోశారు; పాదుల్లో కలుపులు తీశారు; జబ్బుతో మరణించిన మొక్కల్ని మళ్ళీ నాటారు! ఊరికి దూరంగా బందరు ఉపరహదారి మీద వాళ్ళ కెందుకింత ప్రేమో మరి!

          ప్రముఖ అతిథులు వచ్చిన సందర్భాల్లో క్రొత్త మొక్కలు నాటిస్తూనే ఉన్నారు! ఆ పని ఉభయ తారకం - అంటే విశిష్ట అతిధుల్ని గౌరవించడమూ, రహదారి స్వచ్ఛ సుందర చల్లపల్లి ప్రక్క నుండి వెళ్లేదనే ప్రత్యేకత నిలపడమూ!

          భోగి పండుగా, 3000 స్వచ్చోద్యమ దినాల వేడుకా జమిలిగా 14 వ తేదీన వస్తున్న సందర్భంగా ఆ నాటి విశిష్ట అతిథి శ్రీమాన్ కాకి మాధవరావు క్రొత్తగా మొక్క నాటవలసిన నేపధ్యమే ఈ నాటి శ్రమదాన లక్ష్యం!

          వాళ్ళు డాక్టర్లో – ఉద్యోగులో – వయో వృద్ధ విశ్రాంతులో – సర్పంచో – రైతో – గృహిణో – వ్యాపారో.... ఎవరైతేనేం - నేటి ప్రతి కార్యకర్త ఆలోచనా ఒకటే – తమ చల్లపల్లి గ్రామం సమీప రహదారి స్వచ్చ – శుభ్ర – హరిత సుందరంగా ఉండాలి తప్ప – దుమ్ము కొట్టుకొని, ప్లాస్టిక్ వ్యర్ధాలు నిండి ఉండకూడదనే!

          అందుకోసం కొందరు 3 వైపులా రోడ్ల కసవులూడ్చారు; పిచ్చి మొక్కల పని పట్టారు; ఖాళీ మద్యం – నీటి సీసాలనేరారు; డ్రైన్లలో చిత్తు పేపర్లతో సహా దేన్ని వదల్లేదు! వదిల్తే వాళ్ల కసంతృప్తి గదా!

          6.30 కు కాఫీ/ సరదా కబుర్లు ముగించి, బండి శరత్ ముమ్మారు ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకు బదులిచ్చారు. ఎప్పటిలాగే DRK గారి సమీక్షా సంగతులు విన్నారు.

          రేపు సైతం మరింత సుందరీకరణ కోసం NH 216 లోని గంగులవారిపాలెం - 3 రోడ్ల సెంటర్లోనే కలవాని నిర్ణయించారు!

          లాలనగా – పాలనగా

లాలనగా – పాలనగా – గ్రామ పర్యవేక్షణగా –

ఊరి మెరుగుదల దిశగా – పచ్చని రహదారులుగా –

పావులక్ష మొక్కలుగా – స్వచ్ఛ – శుభ్ర వేదికగా –

స్వచ్చోద్యమ చల్లపల్లి నవ వసంత వేడుకగా!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

 

  10.01.2024