2996*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్న్యాయం వెతుకుదాం!

31 మంది శరీర కష్టంతో చూపు త్రిప్పుకోనీయని NH216 అందం - @2996*

          గురువారం (11-1-24) వేకువ సమయపు సంగతది. ఆ 31 మందిలో సమీప 18 వ వార్డు - గంగులవారిపాలెం నుండి ఒక కార్యకర్త! చిత్రం గానే ఉంటుంది మరి - ఈ ఊరికి సంబంధించని ఇరుగు పొరుగూళ్ళ వారూ, ఎక్కడో అమెరికా, స్వీడన్, బ్రిటన్ వంటి వేల కిలోమీటర్ల దూరస్తులూ కొందరీ సామాజిక బాధ్యతనొక అదృష్టంగా భావిస్తుంటే - స్థానికులు కొందరికది పట్టక పోవడం! ఆఖరికి నిన్నటి 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొందరు చల్లపల్లి శ్రమదానాన్ని కీర్తించడం....

          “ఎవరి రాజధాని?” అని వెనకటికి కొందరు మేధావులు పుస్తకాలు వ్రాసినట్లు – ‘ఎవరిది చల్లపల్లి? – 150 మంది స్వచ్ఛ కార్యకర్తలదా, పాతిక వేల మంది జీవత్ప్రజలదా?’ అనే సందేహం కలుగుతుంది! సందేహాలూ, ప్రశ్నలూ స్వచ్ఛ వాలంటీర్లవి కాదు – ‘తమ ఊరి వీధుల్ని మరింతగా ఎలా ఉంచుకోగలం – ఏం చేయగలం...’ లాంటి చర్చలూ, ప్రణాళికలూ తప్ప - వాళ్లకిలాంటి సందిగ్ధతలకు తీరికెక్కడుంది గనక?

          చరిత్రలో పరస్పర దోపిడీలూ, నమ్మిన మంచి పని కోసం తెగింపులూ చూశాం గాని, ఇందరు కార్యకర్తల ఏకోన్ముఖ కర్తవ్య దీక్ష దశాబ్దకాలంగా తమ ఊరి కోసం వాళ్ళ లక్షలాది పని గంటల శ్రమ సమర్పణం ఇక్కడ చల్లపల్లిలో మాత్రమే చూస్తున్నాం. సరే రానున్నది ‘భోగి’ అనే  పెను పండగే - అందుగానూ ఇళ్ళ బూజులు దులిపి, పిండి వంటలు చేసుకొని, ఇంకా కావాలంటే ఇళ్ల ముందు ముగ్గులు పెట్టుకోవచ్చుగాని - ఇలా సర్పంచులు, పెద్ద డాక్టర్లు, వయోధిక ఉద్యోగులూ, వేకువ 4 గింటికే రోడ్లూడ్చి, మొక్కల్నాటి, డ్రైన్లను బాగుచేసే పనులా?

          ఒక్కో కార్యకర్తదీ ఒక్కో స్టైలు! ఒకాయన పూల మొక్క సుందరీకరణ కోసం చేతకి ముళ్లు గీసుకొన్నా పట్టించుకోడు; మరొక పెద్దాయన రాగానే ఒక మురికి జాగా ఎంచుకొని – సాధ్యమైనంత వరకు ఒంటి చేత్తో దాన్ని అద్దంలా బాగుచేస్తాడు; కుర్రాడిలా కనిపించే మరొక విశ్రాంత ఉన్నతోద్యోగి కాలం వృధా ఔతుందని పని

ముగిసేదాక మౌనాన్నాశ్రయిస్తాడు!

          అలా చూస్తుండగానే ఈ పూట 2 గంటల కాలం ముగిసింది. ఇక 6.40 కి కాబోలు - సాధనాల సతీష్ కార్యకర్తలందరికీ గ్రామ సుందరోద్యమ నినాదాలు గుర్తు చేస్తే, భోగి నాటికి, పూర్తికాదగిన పనుల్ని డాక్టరు DRK వివరిస్తే, శాస్త్రి మహాశయుని 5000/-, మాలెంపాటి డాక్టరు గారి 6000/-, కోడూరు వేంకటేశ్వరుని 520/-, సూర్యదేవర రాజేశ్వరి గారు గుట్టుగా ఇచ్చిన 20,000/-, మరొక అజ్ఞాత మహిళ గతంలో లాగే 5,000/- (ఈ మధ్య అజ్ఞాత దాతల సంఖ్య పెరిగిపోతున్నది!) ట్రస్టు బాధ్యుడు అందుకుంటే,

          రేపటి వేకువ మనం కలువదగింది సన్ ఫ్లవర్ కాలనీ వీధిలోనని గ్రహించి, నేటి కారక్రమం ముగించారు!

         గడి తేరిన ఉద్యమమిది!

అడుగులు తడబడి కదలిన, బుడిబుడి నడకలు నేర్చిన,

బులిబులి పలుకులు పలికిన, బిత్తర చూపులు చూసిన

స్వచ్చోద్యమ శిశువు కాదు - అనుభవాల రాటు దేలి

స్థిత ప్రజ్ఞ సాధించిన, గడి తేరిన ఉద్యమమిది!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  11.01.2024