2997*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతుకుదాం!

సన్ ఫ్లవర్ కాలనీలో 36 మంది సేవా దళం - @2997*

            పుష్యమాసే - శుక్రవాసరే (12/01/2024) బ్రహ్మ కాలే (4.15 - 6.12).... యధావిధిగా అక్కడ చీపుళ్ల, దంతెల, కొండొకచో కత్తుల, ఎడనెడా డిప్పల సందడి! ఇదేదో పుణ్య ముహూర్త - భగవదాలయ పూజా విధీ

కాదు, అన్న సంతర్పణా కాదు, ఉచిత వస్తు పంపిణీ కూడ కాదు - కేవలం కొందరి శ్రమదానం! స్వచ్ఛ శుభ్ర - సౌందర్య పరిపూరిత స్వగ్రామ నిమిత్తం. పట్టుబట్టి - పదేళ్లుగా మొండిగా కొందరు కార్యకర్తల సామాజిక బాధ్యతాంశం!

               ఇది అల్లాటప్పా లక్ష్యం కాదనీ, ఏటికెదురీదే బృహత్ప్రయత్నమనీ, ఒక నాటికో, ఒక ఏటికో పరిమితం కాదనీ తెలుసు! ఇప్పటికి 3000 రోజులౌతున్నా తాము సాధించినది పాక్షిక విజయమనే అవగాహనా వాళ్లకు ఉంది! ఉద్యమ భవితవ్యం పట్ల నమ్మకమూ ఉన్నది!

            అందుకే పండగ రోజులైనా సరే ఒక్క రోజూ విశ్రాంతి లేకుండ ఈ ప్రయత్నం! 3000 పని రోజుల వేడుకను విశ్రాంత సివిల్ ఉన్నతోద్యోగి కాకి మాధవరావు గారు విశిష్ట అతిధిగా, కడియాల వారు ఆతిధ్య గృహస్తులుగా జరుప నిర్ణయించినందు వల్ల - ఈ వేకువ శుభ్ర సుందరీకరణ కృషి కాలనీ ముఖ ద్వారం తూర్పు దక్షిణాల్లో చేశారు.

            సిమెంటు రోడ్డంతా, పచ్చదనంతో, పూల సొగసులతో ఆహ్లాదంగానే ఉన్నా దక్షిణం ఖాళీ చోట్లు అంతగా నచ్చక, ఇందరు కార్యకర్తలు అక్కడి ఎండు పుల్లల, పిచ్చి చెట్ల, పచ్చికల మీద చేయి చేసుకోవలసి వచ్చిందట!

            సుమారిరవై సెంట్లున్న చోటు గంటన్నరలో దర్శనీయంగా మారిపోయిందంటే - అది 50 పని గంటల శ్రమమాహత్మ్యమే! ఒకాయన ఎత్తైన వేప చెట్టెక్కి, కొమ్మలు తొలగించగా, ఏడెనిమిది మంది ఎగుడు దిగుడు చోట్ల ఎండు - పచ్చి గడ్డి లేపేస్తే, అన్నిటినీ కొందరు గుట్టలుగా లాగితే, డిప్పల్తో వాటిని ట్రాక్టర్లోకి చేరవేస్తే, పై నుంచి ఒకాయన అందుకొని, సర్ది త్రొక్కి, అణచేస్తే, ఈ సందర్భంలోనే ఒక సూపర్ వైజర్ దూరం నుండి చెత్త డిప్పను ట్రక్కు పైకి విసిరితే (వీడియో చూడుడు), అప్పటికే 6.15 ఐపోయి, విజిలు మ్రోగితే - నేటి పనులు ముగిశాయి.

            7 వ తరగతి చదువుతున్న బాల స్వచ్ఛ కార్మికులిద్దరు ఆర్య, ఆరవ్ వంతు లేసుకొని, స్వచ్ఛ - సుందర నినాదాలు పలుకగా, నాణ్యమైన - సేంద్రియ ఎరువు వాడి కాయించిన అరటి పళ్లను కొర్రపాటి వీరసింహుల వారు - ఒకటికి రెండు మార్లు పంచగా, 14 వ తేదీ భోగి పండుగ నాటి కార్యక్రమాన్ని Dr. డి. ఆర్కే వివరించగా నేటి కార్యక్రమం ముగిసింది.

            ఒక సామాన్య గృహిణి, రామారావు గారి సతీమణి ఉడత్తు ఝాన్సీలక్ష్మి గారి స్వచ్చోద్యమం పట్ల స్పందనగా – 500/- విరాళం అందినందుకు స్వచ్ఛ కార్యకర్తల వినమ్ర కృతజ్ఞతాంజలి.  

            రేపటి వేకువ కూడ మిగిలిన సిమెంటు రోడ్డు సుందరీరణ కోసం గంగులవారిపాలెం బాట వద్దే కలుద్దాం!

            పాఠాలను నేర్పించిన

శ్రమ విలువను తెలియజేసి, సహనం గొప్పను తెలిపిన

ఐకమత్య బలమెట్టిదొ ఆచరించి బోధించిన

పరుల కొరకు పాటుబడే పాఠాలను నేర్పించిన

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామాలు!

- ఒక స్వచ్ఛ సుందర కార్యకర్త

  12.01.2024