2998*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

భోగికి ముందు నాటి శ్రమ వైభోగం - @2998*!

            శ్రమ 40 మందిదీ, శుభ్ర- సౌందర్య భోగం సన్ ఫ్లవర్  కాలనీ గ్రామ భాగానిదీ!  వెరసి - శనివారం వేకువ - 4.10-6.12 నడిమి 2 గంటల పాటు సందడీ చైతన్యం పురివిప్పుకొన్నవి! సంఘజీవులైన గ్రామపౌరులకు కర్తవ్య నిర్దేశం చేశాయి! కాలనీ వీధి 150 గజాల మేరా స్వచ్ఛ - శుభ్రతలు నెలకొల్పాయి!

స్వచ్ఛ కార్యకర్తలు నాకు మూడు రకాలుగా కనిపిస్తారు:

1.     1 కి 3 మార్లు ఆచి తూచి వీధి శుభ్రతకు పాటుబడేవారు,

2.     ప్రతి వేకువ ఈ 30-40 మంది సాహచర్యాన్ని,సాంగత్యాన్ని,సందడినీ రోజంతటి కీ ఉత్సాహాన్నిచ్చే టానిక్ లాగా జుర్రుకొనేవాళ్లు,

3.     ఒకటి రెండురోజులిందులో పాల్గొన లేకపోయినా- ఏదో పోగొట్టుకొన్నట్లు మూడోనాటికి ఠంచనుగా, ఆవురావురు మని శ్రమ చర్యకు పాల్పడే వారు.

            ఐతే అందరిదీ ఏకోన్ముఖ లక్ష్యమే ! అది సమగ్ర  స్వచ్ఛ - సుందర చల్లపల్లి నిర్మాణమే! వ్యష్టి కన్న సమష్టి సుఖ సౌకర్య కల్పనా నల్ప ఆశయమే!

            సరే! 4.00 వేకువ నుండి నిముషక్రమాన అంచెలంచెలుగా వచ్చి చేరి, మురికి - మొరటు పనుల కుపక్రమించిన ఇందరు నేడు సాధించినదేమి? ఇచ్చిన సందేశమేమి? అంటే:

            [తన ‘ఖడ్గ సృష్టి’ కావ్యంలో శ్రీశ్రీ అన్నాడొక గేయంలో ..

            “సరి హద్దు లెరుంగని సకల జగజ్జనులారా!

             మనుష్యుడే నా సందేశం! మానవత్యమే నా సంగీతం!”]

A.    ఓ సోదర గ్రామస్తులారా! రోజూ వీలైనంతమందిమీ కలిసి గంటపాటు శ్రమిద్దాం, స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం....” అనీ,

B.    మన ముందు తరం వాళ్ళు మనకు నేర్పిన శ్రమ జీవన సౌందర్య పాఠాన్ని ఆచరించి, రాబోవు తరం వాళ్లకు కాలుష్య రహిత ప్రపంచాన్ని మిగుల్చుదాం! అనీ

            మరి, ఇది వట్టి కబుర్ల సందేశం కాదు, ఆచరణాత్మకం!

- అందుగ్గాను ఒకాయన గంట పాటు చెత్త బండెక్కి దిక్కుమాలిన చెత్తను సర్దడం  చూశాను.

- ఇంత మంచులోనూ శ్రమ జనిత స్వేద బిందువులు జార్చుతున్న ఎడమవాటం కార్య కర్తను గమనించాను.

- ప్రధాన శ్రమదాన స్రవంతికి దూరంగా బందరు రోడ్డులోని SRYSP కాలేజి వద్ద శుభ్రపరుస్తున్న ఇద్దరి ప్రయత్నం తెలుసుకొన్నాను.

- ఊడ్చి ఊడ్చి , చీపుళ్లరిగేలా, గూళ్లు ఒరిగేలా శ్రమించిన నలుగురు మహిళల్ని కనిపెట్టాను.

- ఒక సీనియర్ కార్యకర్త -  లక్ష్మణరావు ప్రకటించిన స్వచ్చోద్యమ నినాదాలు పలికాను.

- అందరితోబాటు DRK గారి సమీక్షా వచనాలు విన్నాను.

            రేపటి 3000 రోజుల ముందస్తు పండగకు 4.15 కే అందరూ నూతన యూనిఫామ్స్ లో గంగులవారిపాలెం రోడ్డు వద్ద కలవాలని విన్నాను.

            కాకి  మాధవరావు గారితో  మొక్కలు నాటించే, భోగి మంటల వద్ద నిలబడే రేపటి వేకువ వందలాదిమంది తరలిరావాలని అభిలషిస్తున్నాను!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  13.01.2024