2999*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

3000* - 1 వ నాటి వేడుకలు

            ఆదివారం - 14.1.24 వ నాడు భోగి పండుగా, 3000* వ నాటి ముందస్తు స్వచ్చోద్యమ పండుగా కలిసి వచ్చి, వేకువ 4.15 నుండి 8.30 దాక - 180 మందితో జరిగిన జమిలి వేడుకలు!

            తొలుత 4.30 కే 50 మంది కాఫీలు ముగించి, ప్రముఖ అతిథి కాకి మాధవరావు గారితో ½ కిలోమీటరు దూరం నినాదాలతో డప్పు వాద్యాలతో నడిచి, జాతీయ రహదారికి దక్షిణంగా 2 మొక్కలు నాటి, రంగవల్లులు తీర్చిదిద్దిన సన్ ఫ్లవర్ ఆర్చి దగ్గరకు చేరుకొన్నారు.

            భోగి మంటలు వెలిగించి, చుట్టూ నిలిచిన మహిళల నాట్యాలు. 6.00 సమయానికి 100 దాటిన గ్రామస్తుల, స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య 8.00 కి 180 దాటిపోయింది.

            మైకు నుండే కాక, నందేటి శ్రీనివాసుని గళం నుండి మంచి మాటలు, పాటలు, పద్యాలు. ఆ పైన ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అప్పటి ఎన్నికల అధికారి శ్రీ కాకి మాధవరావు గురించి డాక్టర్ డి.ఆర్.కె. గారి సముచిత పరిచయ వాక్యాలు. పెద్ద గూడెం నుండి వచ్చిన చిన్న విద్యార్ధినుల సంక్రాంతి నృత్యాలు. మధ్యలో గ్రామ సర్పంచి, కార్యనిర్వహణాధికారి, ఇంకొందరు గ్రామ ముఖ్యుల ప్రసంగాలు, ఎందుకీ ఊరి స్వచ్చోద్యమం ఇంత సుదీర్ఘంగా, అర్ధవంతంగా, ఫలప్రదంగా నిలువగలిగిందనే విశ్లేషణలు!

            ఇక అప్పుడు, 20 నిముషాలు కొనసాగిన ప్రసంగంలో ముఖ్య అతిథి మాధవరావు గారి అనుభవ పూర్వక సందేశం.

            ప్రభుత్వాలంటే - ప్రజాప్రతినిధులంటే - రాజ్యాంగమంటే

మానవతా విలువలంటే - ప్రభుత్వోద్యోగుల విధులంటే - చట్టాలమలు జరగడమంటే - అన్నిటా మానవత్వకోణమెలా ఉండాలంటే..

వంటి వన్నీ స్పృశించారు.

తన పెదమద్దాలి గ్రామం కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్నప్పుడెలా వికసించిందో చెప్పారు, మరీ పెద్ద వయసులో తన ఊరిలో స్వచ్ఛ - శుభ్ర ఉద్యమం నడపబోయి తానెలా విఫలమయిందీ - అందుకు భిన్నంగా చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమమెలా విజయవంతమౌతున్నది విశ్లేషించారు.

            అవసరమైనపుడు ఆంగ్ల కవులు వర్డ్స్ వర్త్, కీట్స్, తెలుగుకవి అందెశ్రీ లను దహరించారు. వ్యక్తుల్ని పొగడ వద్దనుకొంటూనే - చల్లపల్లి స్వచ్ఛ సంకల్ప మూల విరాట్టుల్ని మెచ్చక ఉండలేకపోయారు!

 

ఈ నాల్గు గంటల వేకువ సమావేశంలో :

ఏ మాత్రం మంచు వెనకడుగేయనేలేదు.

ఐనా పిల్లల్తో సహా ప్రేక్షకులంతా కదల్లేదు.

వందల మందికి ప్లాస్టిక్ వస్తు రహిత అల్పాహార విందు నందించిన కడియాల సురేశ్  కుటుంబీకుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి.

            సమయాతీతమౌతున్నా రాయపాటి రాధాకృష్ణ - రమ దంపతులు తమ విరాళాన్ని 10,000/- ఇవ్వనే ఇచ్చారు!

            పనిలో పనిగా గోళ్ళ విజయకృష్ణ గారి 3,000/- లు చెక్కు కూడా అందినది.

            స్వచ్ఛ చల్లపల్లి క్రమశిక్షణకు, కార్యకర్తల జాగ్రత్తలకూ తగ్గట్లే ఉన్నది - అతిథులు అనల్పాహారాన్ని స్వీకరించిన పద్ధతి!

            ఇంత మంచులో చలిలో - వేకువ 4:00 సభలు స్వచ్చోద్యమ చల్లపల్లిలో కాక ఎక్కడైనా జరుగగలవా - అని కొందరి ఉవాచ!

            ఆలోచనలను మధించి

ఉద్రేకములొస్తుంటవి - ఉద్వేగములూ ఉంటవి

తొమ్మిదేళ్ళ శ్రమదానంతో ఎన్నెన్నో వస్తవి

అన్నిటిని సమన్వయించి - ఆలోచనలను మధించి

గ్రామ ప్రగతి వైపు కదలు స్వచ్యోద్యమ సారధ్యం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  14.01.2024

రాయపాటి రాధాకృష్ణ,రమ దంపతుల విరాళం
గోళ్ళ విజయకృష్ణ గారి విరాళం