3000*వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

10 వ సంక్రాంతిని చూసిన స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం

అతి పెద్ద పండగ నాడు కూడ 27 మంది ఉత్సాహం - @3000*

            సోమవారం – 15-1-24 - మకర సంక్రమణ పర్వదినంలోనూ కార్యకర్తల శ్రమ పర్వం ఆగలేదు - 4.17 కే మొదలై, 6.15 దాక 2 డజన్ల మందికి పైగా 216 జాతీయ రహదారికీ బండ్రేవు కోడు వంతెనకీ నడుమ తమ వెలకట్టలేని శ్రమను సమర్పించారు.

            “ఆ వీధి భాగంలో శుభ్రత లోపించిందా? రకరకాల పూల మొక్కలు ప్రకృతి ప్రేమికుల్ని అలరించడం లేదా? ఏడాకుల వృక్షాలు గంభీరంగా నిలబడి పచ్చదనాల విందులు చేయడం లేదా? ముఖ్యమైన పండగనాడైనా కాస్త విశ్రాంతి తీసుకోరాదా?.....” అని ప్రశ్నించి ప్రయోజనం లేదు. ఆ150 గజాల వీధి సౌందర్యంలో ఏ లోపాలు కనిపెట్టారో సుందరీకర్తల్నడగాలి!

            ఇక - దట్టమైన మంచులో, చలిలో, చిమ్మ చీకటి వేళ ఊరికి దూరంగా వచ్చి శ్రమించిందెవరు? ఇంచుమించు సగం మంది 60 ఏళ్ళ వారు, అరుదుగా సెలవు లభించే ఉద్యోగులు, త్వరగా తిరిగి వెళ్లి ఇంటి పనులు చూసుకోవలసిన గృహిణులు వగైరాలు!

మరి – ఠంచనుగా ఉద్యోగాలకు వెళ్లేంత బాధ్యతగా వీళ్లక్కడ ఒరిగబెట్టిందేమిటి? అంటే:

- బాగా అందం అతిశయిస్తున్న పూల మొక్కల కొమ్మల్ని మరింత అందంగా ఉంచడానికి దీక్షగా కత్తిరించడం - (ఇందులో ఒకాయనైతే మరీ P.HD చేసేశాడు! అతనికి నేనైతే “శత సహస్ర ఖండన మండనాచార్యుడు” అనే బిరుదు కూడ అక్కడికక్కడ ప్రకటించాను!

- ఏడెనిమిది మంది ఎంచుకొన్న ఉద్యోగమేమంటే – వాళ్ల కత్తులకే బలైన పిచ్చి చెట్లను పొలం గట్టున అందంగా పేర్చడం! - ఇందువల్ల ట్రాక్ట నింపే పని నేటికి తప్పింది!

- ఇక - ఐదారుగురు కత్తుల - దంతెల, చీపుళ్ల పని మంతులైతే వంతెన మలుపు దగ్గర - అదేదో బంగారు ఆభరణాల తయారీ అన్నంత నేర్పుగా కలుపు తొలగించి, దుమ్ము ఊడ్చి శుభ్రపరుస్తున్నారు!

            6.30 వేళ శివబాబు గారి నినాదాల్నందుకుని, అతని ఆదర్శ వాఖ్యాలను విని నిన్నటి సభా విశేషాలను చర్చించి, అన్నపూర్ణ గారి కుమారుని (పల్నాటి చరణ్) జన్మదిన కానుకగా 2000/- విరాళాన్ని DRK గారు స్వీకరించి, రేపటి ‘కనుమ’ పండుగనాడు అవకాశమున్న వాళ్లం ఇదే గంగులవారిపాలెం సమీపంలో కలుద్దామని నిర్ణయించుకొని, ఇళ్లకు ప్రయాణమయ్యారు!

            ఎంపికయే విచక్షణ

సంగ్రామం లేనిదెచట జన జీవనమందున?

ఏ యుద్ధం సార్ధకమను ఎంపికయే విచక్షణ

కాలుష్యం పై కదనం ఊరి కొరకు గావున –

అది ఆహ్వానింపదగిన దనుట మంచి భావన!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  15.01.2024