3001*వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

కనుము పండుగ నాటి వీధి సేవలు - @3001*

            నేటి పండుగ 16-1-24 – మంగళవారానిది! పండగేమిటి -  వానలు, వరదలేమిటి - అసలీ స్వచ్చంద శ్రమదానం ఎప్పుడాగింది గనుక! మంగళవారం ఊరి బయట అందరూ రానక్కర్లేదని నిన్న ప్రకటించడం వల్ల కార్యకర్తల సంఖ్య తగ్గి, 20-1 కి పరిమితమయింది గాని, పనిలో అంకితభావం తగ్గిందా - ఉత్సాహం మాత్రం లోపించిందా?

            ఈ పూట కార్యరంగం మరొకమారు బండ్రేవు కోడు వంతెన కేంద్రంగానే! సమయమో? 4.10 - 6.10 మధ్య! ఈ వేకువలో వచ్చిన వ్యర్దాలు తక్కువ, మినప చేను వైపూ, మురుగు కాల్వ ఒడ్డునా కొడవళ్లతో,  రైల్వే పారల్తో కోసిన, చెక్కిన గడ్డిని కూడ చేనుగట్టునే సర్దారు.

 

            కొన్ని ప్లాస్టిక్ నీళ్ల సీసాలూ, గ్లాసులూ, కొద్దిపాటి పుల్లల్లాంటి వ్యర్ధాలూ దొరికినా, అవి ఒక చిన్న ట్రక్కులోకే సరిపోయినవి. కాకపోతే NH 216 మీద మాత్రం ఎక్కడి నుండి ఏ పుణ్యాత్ముడో తెచ్చి పడేసిన డజన్ల కొద్దీ ఎంగిలాకులూ, ఆహార వ్యర్ధాలూ, ప్లాస్టిక్ సంచులూ మాత్రం అక్కణ్ణించి డిప్పల్తో మోసి తేవలసి వచ్చింది!

            వంతెన దగ్గర మురుగు కాల్వ గట్టు మీద నడుములు వంచి, ఒకరు కత్తితో, రెండవ వారు పారతో గడ్డి చెక్కుతూ, వాళ్ల 60-70 ఏళ్ల వయస్సులు మర్చిపోయి అనుకొంటున్న మాటలివి – “ఏమిటయ్యా! ఇద్దరం ఇంత సేపు బాగు చేసింది ఈ ఏడెనిమిది గజాల స్థలాన్నేనా?

            ఈ ఉదయం మరొక విశేషమేమంటే - చల్లపల్లికి 20 కిలోమీటర్ల దూర గ్రామస్తుడూ, ప్రస్తుతానికి విజయవాడలో ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడూ ఐన రామచంద్రరావు గారు వేకువనే వచ్చి, స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి పని చేయడం, పనిచేస్తున గంటన్నరా, పని విరామానంతర నినాద/సమీక్షా సమయంలోనూ వారి కమితంగా నచ్చినవి- “ఇందరు శ్రమ త్యాగ ధనులొక చోట చేరి, ఇంత సుదీర్ఘకాలం ఒక గొప్ప ఆశయం కోసం నిలబడడమూ”నట!

            స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకూ, ఒక సామాజిక స్ఫూర్తిదాయక గీతానికీ గాత్ర దానం చేసిన వారు నందేటి శ్రీనివాస్!

            రేపటి మన శ్రమ నిర్దేశిత ప్రదేశం కూడా గంగులవారిపాలెం రోడ్డు మూల వంతెన వద్దే.  

            కనిపించని శత్రువు

చెట్లులేక బోసిపోయి చెడినది వాతావరణం

కనిపించని శత్రువు మన గ్రామానికి కాలుష్యం

మోడుబారు గ్రామంలో 30 వేల చెట్లు పెంచు

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  16.01.2024