3002*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

శ్రమదాన ధారా వాహికలో 3002* వ ఎపిసోడ్!

          విసుగూ - విరామం లేని స్వచ్ఛ - సుందర చల్లపల్లి తయారీలో 17-1-24 - బుధవారం నాటి భాగస్తులు 23 మంది. సుమారు 2 గంటల చొప్పున 4.15 నుండి 6.10 దాక జాతీయ రహదారి, బండ్రేవు కోడు కాల్వ వంతెనకు ఉభయ పార్శ్వాల, కొసరుగా కాల్వ దక్షినోత్తర  గట్టు పరిశుభ్ర - సుందరీకరణం!

          చల్లపల్లి గ్రామ స్వచ్ఛ వాలంటీర్ల 2013, 2014 నాటి ప్రయత్నాలకు ఆరంభం తప్ప, కనుచూపు మేర ముగింపు కనిపించడం లేదు. ఈ ఊరి వ్యక్తులు ఏ అమెరికాకో వెళ్లి ఆర్నెల్లకో – ఆరేళ్లకో తిరిగి వచ్చినా అప్పుడు కూడా వాళ్ళు ఈ స్వచ్ఛంద శ్రమదాన సంస్కృతిని చూడగలుగుతారు! ఊళ్లో ఏ అద్భుతమో జరిగి - అన్ని వార్డుల, అన్ని వీధుల వారూ పోటీపడి, గంగులవారిపాలెం రోడ్డులాగా, కమ్యూనిస్టు బజారులాగా ప్రతి అంగుళమూ బాగుపడితే తప్ప!

          వంతెన - NH216 ల నడుమ ఏడెనిమిది మంది తళుక్కుమనే అద్దంలాగా శుభ్ర - సుందరీకరించినా;

          నలుగురైదుగురు పారలు, కత్తులు, దంతెలతో కాల్వ దక్షిణపు గట్టు మీది, పనిలో పనిగా మినప చేను అంచు మీది పిచ్చి మొక్కల మీద, కాలుష్యాల మీద దండెత్తినా:

          ఇద్దరు మహిళలు ఓపిక తెచ్చుకొని, వంతెన ఉత్తరపు భాగంలో బాగుచేసినా:

          ముగ్గురు రైల్వే పారల్తో, అదే దిక్కున - కాల్వ అంచును అందగించినా, వీళ్ళకు దూరంగా - బందరు రహదారి మీద ఒకే ఒక కార్యకర్త గంటకు పైగా - శ్రమించినా -

          ఇవన్నీ చల్లపల్లి శ్రమ సంస్కృతిలో భాగం! ఐతే - ఇలాంటి సామాజిక బాధ్యతొకటి ఇక్కడ దశాబ్దకాలంగా జరుగుతున్నదని జయరాజ్ వంటి సుప్రసిద్ధ కవి చెప్పినా చాల మంది నమ్మనే నమ్మకపోవడం మన సమకాల మహిమ!

          ఒక చేత గ్రామ స్వచ్చోద్యమ బ్యానర్ నూ, మరొక చేత మైకునూ పట్టి, పోస్టల్ మెండు శ్రీను ముమ్మారు ఉద్యమ నినాదాలను ప్రకటించగా,

          హైదరాబాదు ఉద్యోగి వంశీ శ్రమదాన అవకాశం తన అదృష్టమని సంతోషించగా,

          6.35 కు నేటి ప్రయత్నం ముగిసింది.

          రేపటి కృషి కూడ ఇంచుమించు ఇదే చోట – మురుగు కాల్వ వంతెన కేంద్రంగానే ఉండగలదు!

          అయ్యయ్యో! చెత్త పనులు!

ఔద్యోగిక బాధ్యతలో! అమిత ధనం కూడికలో!

పదవుల పందేరములో - ప్రఖ్యాతుల మార్గములా!

అయ్యా! ఇవి చెత్త పనులు! బొత్తిగ ఇవి బురద పనులు!

ఐతే ఎన్నటికైనా అమలు పరుచదగిన పనులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  17.01.2024