3003*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

3000+3*  పని దినాల స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లి!

            18-1-24 (గురువారం) నాటి లెక్క అది! రోజుటికన్న - వేకువ 4.09 కే నేటి కార్యకర్తల్లో తొలి సగం (డజను) మంది గ్రామ వీధి పారిశుద్ధ్య కృషికి ఉత్సాహం ప్రదర్శిస్తే మలి డజను మంది వచ్చి, జత కలిశారు. ఇక అక్కడి నుండి నికరంగా 2 గంటల పాటు బండ్రేవు కోడు వట్టిపోతున్న మురుగు కాల్వ ఉత్తర -  దక్షిణ ఉభయ దిశలా సాయుధపాణులై జరిపిన పోరాట ఫలితంగా :

- వంతెనకు తూర్పు - దక్షిణ కాల్వ గట్టు 100 గజాల బారునా 6.15 తర్వాత ఎంతగా శుభ్రపడిందో - అక్కడి పొలాల రైతుల రాకపోకలకెంతగా సౌకర్యవంతంగా మారిందో వాట్సప్ ఛాయ చిత్రంలో గుర్తించండి.

(ఇదేదో పగటి పూట - మీడియా సమక్షంలో బట్టల్నలక్కుండా నిర్వహించిన శ్రమదానం కాదు సుమా! కటిక చీకటీ మంచుల్లో క్రమ పద్ధతిలో - ఒకరికొకరు సహకరించుకుంటూ - కూర్చొనీ, వంగొనీ సాధించిన స్వచ్ఛ సౌందర్యాలు!]

- రెండవ శ్రమ దృశ్యం అంతకు ముందే వారధికి దక్షిణ - పడమరగా, కాస్తంత ఎగుడుదిగుడుగా - ఆంధ్రప్రదేశ్ రహదార్లలాగానే ఉన్న మురుగు కాల్వ గట్టు - పరిశుభ్ర సుందరీకరణం! అరగంటకు పైగా జరిగిన శ్రమదానంలో ఎవరి కాలూ జారలేదు - అక్కడి 100 గజాల మేరా ఏ పిచ్చి మొక్కా మిగల్లేదు!

            పై రెండు చోట్లా పని జరుగుతున్నప్పుడు మంచూ, చలి గాలీ తగ్గలేదు! సదరు రెండు సన్నివేశాల్ని దగ్గరగా పరిశీలించినపుడు తమ సొంతూరి స్వస్తత కోసం స్వచ్ఛ కార్యకర్తల మొండి పట్టుదల ఎంతటిదో నాకు మరొకసారి తెలిసొచ్చింది. 

- ఏడెనిమిది మంది కార్యకర్తల కర్మక్షేత్రం కాల్వ ఉత్తరపు గట్టు! అంతకు ముందు అక్కడ చిరు లోపాలు - మాగాణి వరి గడ్డీ పీచులూ, ప్లాస్టిక్ సీసాల వ్యర్ధాల్లాంటివేవైనా మిగిల్తే ఇప్పుడు వాటిని తుడిచి పెట్టేశారు!

            ఈ నిత్య గ్రామ సుందరీకర్తల్ని చూస్తుంటే ఏక కాలంలో సంతోషమూ, ఆందోళనా కలుగుతుంటాయి! సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నందుకు మొదటిదీ, వేకువ చీకట్లో ఏముళ్లు చేరుస్తాయో ఏ గుంటలో కాలు మెలికపడుతుందో - అనేది రెండోదీ!

6.30 కి జరిగే సమీక్షా సమావేశంలో :

- ఎవరి తరపునో పల్నాటి అన్నపూర్ణ తెచ్చిపంచిన డైరీలు,

- కొర్రపాటి పరసింహుల వారు విస్పష్టంగా ముమ్మారు పలికి పలికించిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ,

- రేపటి వేకువ మన శ్రమదానం బండ్రేవు కోడు వంతెన తూర్పు వైపుగా అనే ప్రకటనా!

            పక పక నవ్వుచు

గంగులపాలెం వీధికి కళ మళ్లీ పెరుగుతోంది

బంతులు - చేమంతులాది బహు జాతుల పూల సొగసు

పక పక నవ్వుచు మనలను ప్రశ్నిస్తూ ఉన్నది

మానవ శ్రమ మరు భూమిని మార్చెను చూసితిరాఅని!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  18.01.2024