3004*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

3004* వ నాటి శ్రమ వీచికలు గుర్తిద్దాం!

            శుక్రవారం (19-1-24) వేకువ కటిక చలిలో అవి మొదలయింది 4.13 కు, చిట్టచివరి ఎడమ వాటు కార్యకర్త పని ముగించినది 6.18 కి! నిన్నటిలాగే 3 చోట్ల - మళ్లీ 2 డజన్ల మందే గురి చూసి, కాలుష్యాల అంతం చూశారు!

            1 వ బాధ్యతగా మురుగు కాల్వ వంతెన తూర్పు - దక్షిణ గట్టు మీద మిగిలిన పని చేసుకొంటూ - జాతీయ రహదారి దాక సాగిపోయారు. మంచు ఉధృతి తగ్గింది గాని, ఉష్ణోగ్రత బాగా క్షీణించింది. వెలుతురు చాలకపోవడం ఒక రకంగా మంచిదేనట - మందు వీరుల అశుద్ధాలు కనపడవు గనుక!

            అది ముగిశాక కార్యకర్తలు పూనుకొన్నది అదే బండ్రేవు కోడు కాలువ ఉత్తరం గట్టు మీది చిందరవందర ప్రక్షాళనకు.  ఇక్కడ మాత్రం పని చోటు నిడివి తక్కువే గాని, సమయం ఎక్కువ గడిచింది.

            ఈ సందర్భంలోనే ఒకరిద్దరు వాలంటీర్ల నుండి మౌలిక ప్రశ్న ఒకటి వినిపించింది – “మందు బాబులకు అడ్డాగానూ, మదుగుగానూ ఉన్న ఈ గట్టు మీది కొమ్మల్నీ, పిచ్చిమొక్కల్నీ పూర్తిగా తొలగిస్తే వాళ్ళకది అసౌకర్యం గదా...” అని!

            3 వ శ్రమ వేదిక మురుగు కాల్వ ఉత్తరం గట్టు రోట్టే - అక్కడున్న రెండే ఇళ్ల వెనుక భాగం దగ్గర, వీధి మార్జిన్ లోనూ, పొలం మూలలోనూ పెరిగిన గడ్డీ, తీగలూ, ఎండు చెత్తా, ఆరేడుగురి శ్రమతో తుడిచిపెట్టుకుపోయినవి!

            వారిలో ఒకాయన మాత్రం ఒక డిప్పా, చిన్న పంజా తీసుకొని, రోడ్డంతా గాలించి, నిన్న ఉదయం నుండి 24 గంటల్లో క్రొత్తగా ఏమైనా ప్లాస్టిక్ సంచులో -  సీసాలో పడి ఉంటే ఏరుకొచ్చాడు.

            మందు సీసాల, మరికొన్ని వ్యర్థ్యాల్ని డిప్పల్లో మోసేవారి కష్టం మాత్రం రెట్టింపయింది – చెత్త ట్రక్కు పని చోటుకు దూరంగా ఉండడమే అందుక్కారణం!

            కాఫీలు ముగించి అందరూ అర్థవలయంగా నిల్చినపుడు - డాక్టర్ గారి నేటి శ్రమ విశేష వివరణకు ముందు నిలకడగా ముమ్మారు చల్లపల్లి శ్రమదాన సాంప్రదాయక నినాదాలు వినిపించిన వారు జ్ఞానప్రసాదు!

            ఇదే బండ్రేవు కోడు వంతెన వద్దనే అగి, ఎలాగైనా రేపటితో ఇక్కడి కాలుష్యాలను వదిలించాలని నిర్ణయించారు!

            సాహసాల వేదికగా

సకలాంధ్రులు మొచ్చదగిన స్వచ్ఛ - శుభ్ర గామ్రముగా

పర్యావరణ ప్రియులకు పర్యాటక కేంద్రముగా

శ్రమ సంస్కృతి వెల్లి విరియు సామాజిక బాధ్యతగా

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాహసాల వేదికగా....!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  19.01.2024