3005*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం వెతకవలసిందే!

3005* వ వేకువ గ్రామ శ్రమదాన వైఖరులు!

            20.01.2024 నాడు కూడా బండ్రేవు కోడు కాల్వ ఉత్తరం గట్టు మీదే - వంతెనకు తూర్పు ప్రక్కనే సందడి ప్రారంభమయింది. శనివారం కావడం వల్లేమో గాని, వాలంటీర్ల గ్రాఫ్ పెరిగి, 31 కి చేరింది! పని సమయం 2 గంటలుగా నమోదైంది!

            స్వచ్ఛ కార్యకర్తల కఠిన శ్రమ ఫలించిన ఆ చోటు 10x400 అడుగుల కొలత కావచ్చు! తెల్లారాక ఎవరైనా చూస్తే “ఫర్లేదే –ఎవరో గాని బాగా చేశారే” అనిపించొచ్చు! కాని అసలు చూడవలసింది వేకువ 4:00 కన్నా ముందది ఎలా ఉన్నదనే! డజనున్నర మంది వేళ కాని వేళ ఎగుడు - దిగుడు గోతుల్లో, ఏటవాలు అంచుల్లో, ఎంత సమన్వయంగా, మొండి తెగింపుగా పని చేస్తే ఇప్పుడాబాట గమనయోగ్యంగా – చూడముచ్చటగా మారిందనే!

            అసలు కొన్ని చోట్ల ముళ్లేమిటీ – కాలు మోపే వీలులేకుండా అడుగడుక్కీ సారా - నీళ్ల సీసాలేమిటీ - రైతులు మినుంచేలకు నీళ్లు పెట్టేప్పుడు తడిసిన బురద చోటులేమిటీ – ఒక కాలి – బళ్ల బాట ఎలా ఉండకూడదో అలా ఉన్నది దృశ్యం! గడ్డీ - ధాన్యం బళ్లెలా అక్కడ నడుస్తున్నవో మరి!

            ఈ అష్టా దశ కార్యకర్తల కత్తులకెరగా మారి, ఎన్ని పులుగుడు – తాడి - ఇంకా ఎన్ని ఇతర చెట్లూ, పిచ్చి కంపా మర్యాదగా తొలగిపోయి, రెండు ప్రక్కలా సర్దుకున్నవో చూడండి! బాట నట్ట నడుమ తాటి మొక్కల్ని కూడ తొలగించే వాళ్ళే లేకపోతిరి! అక్కడున్న ఖాళీ మద్యం – నీళ్ల సీసాల్లో సగం కూడ కార్యకర్తలు ఏరలేకపోయారు!

            నేటి వేకువ పరిశుభ్ర – సుందరీకరణ చర్యలైతే – మురుగు కాల్వ ఉత్తర - వంతెనకు పడమరగా జరిగాయి. గంటన్నరపైగా గోకుడు, పారల, రైల్వే పారల చెక్కుడు చప్పుళ్లూ, అక్కడక్కడా మళ్లీ పెరుగుతున్న గడ్డిని కోస్తున్న కొడవళ్ల విసురుళ్ళూ కనువిందు చేశాయి! ఇక్కడి పని సమయంలోనైతే – ఇద్దరు ముగ్గురి నాటు చతురోక్తులు కూడ!

ఆలస్యంగా జరిగిన సమావేశంలో:

- సుభాషిణి ఉపాధ్యాయిని సమర్పిత బెండకాయలూ, ఉసిరి పళ్ళూ, టొమాటో మొక్కలూ, అస్మదీయ వితరణగా శాలువాలూ,

- నేనే విస్పష్టంగా పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి”, స్వచ్ఛ సుందర ఆరోగ్య, ఆనంద, అభ్యుదయ చల్లపల్లిని సాధిద్దాం అనే దైనందిన నినాదాలూ,

            రేపటి వేకువ అందరం కలువదగిన చోటుగా గంగులపాలెం బాట మలుపు నిర్దేశమూ!

            ఆ చరిత్రనె స్వాగతిస్తాం!

అనూహ్యంగా - అమాంతంగా - హఠాద్ఘటనలు కావు కావివి

ఏళ్ల తరబడి మధనపడుతూ - ఎంతగానో కష్టపడుతూ

ఆశయం సాధించుకొంటూ - అపరిశుభ్రత దాటుకొచ్చిన

ఆ చరిత్రనె స్వాగతిస్తాం! స్వచ్ఛ సంస్కృతి ప్రోత్సహిస్తాం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  20.01.2024