3006*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

శ్రమదానకర్ణుల 3006* వ నాటి వేడుక!

            ఆదివారం – (21.01.2024) వేకువ 4.18 కే గంగులవారిపాలెం మురుక్కాల్వ మలుపులో 15 మందితో మొదలైన ఆ వేడుక 6.30 దాక కొనసాగుతూనే ఉన్నది! ఏమైనా సరే – “ఈ ఆదివారంతో ఇక్కడి వంకబెట్టలేని స్వచ్ఛ శుభ్ర వైభవం పూర్తి కావాలసిందేఅనే పంతం నెగ్గించుకొన్నారు 35 మంది కార్యకర్తలు! 

            తత్ఫలితంగానే - నిన్న బాగుపరచిన కొంత స్తలంతో సహా 150 గజాల వీధీ, పూల మొక్కల పాదులూ, దిక్కుమాలిన వ్యర్ధాలూ, తుడిచి పెట్టుకుపోయి, సదరు వీధి భాగాన్ని చూస్తే చాలు - పాతకాలపు ప్రచారం Neighbour’s envy – owner’s pride (పొరుగు వీధుల కసూయగా వీధి సొంత దారులకు గర్వకారణంగా మారిపోయింది!

            మరి - ఇక్కడ వారం రోజులుగా కష్టిస్తున్నదెవరు? అల్లాటప్పా కార్యకర్తలు కాదే - మూడేసి వేల రోజులుగా పనిలో రాటు దేలిన - కొందరైతే "ఒక ఆదర్శ గ్రామం ఎలా ఉండాలనే" పరిశోధనతో ఎమ్. ఫిల్ లూ, పి.హెచ్. డీలూ చేసిన వాళ్లు గదా!

            ఐదారుగురు కార్యకర్తల్నైతే అత్యాశాపరులనరాదుగాని, వీధి పారిశుద్ధ్య తృష్ణతీరనివాళ్లనొచ్చు బండ్రేవు కోడు మురుగుకూ వీధి మార్జిన్ల పూల మొక్కల మధ్యకు దూరి, గద్ద గోరు ముళ్లు గీసుకుపోకుండ ఆ చీకట్లోనే కలుపూ గడ్డీ గాదం తొలగించారు! 

            ఇంకో 10 మంది బ్యాచ్ అయితే - 6.15 దాటుతున్నా, మినప చేల ప్రక్కనున్న పిచ్చి మొక్కలూ, గడ్డీ మళ్ళీ 2 నెలల్దాక తలెత్తకుండా నరికి, పీకి గాని విరమించలేదు!

            రోడ్డు మూల నుండి దక్షిణంగా (దాని మీద ఇప్పటికీ ఐదారుగురికి బహిరంగ మలమూత్ర విసర్జనా హక్కులున్నవట !) కాల్వ గట్టును శుభ్రం చేశారు!

            మరి - మిగిలిన నలుగురైదుగురు చేతులు ముడుచుక్కూర్చున్నారా - అంటే! లేదు - బాటనంతా చీపుళ్లతో ఊడ్చే వారు ఊడ్చి, ప్లాస్టిక్ అవశేషాల్ని ఏరే వాళ్ళు ఏరి వాళ్ళ వంతు పని వాళ్లు నెరవేర్చారు!

            చల్లపల్లి శ్రమ వేడుక బొత్తిగా తెలియని వాళ్ళకైతే 35 మందా? ఈ కాస్త రోడ్డును బాగు చేసినందుకింతగా వర్ణిస్తూ వ్రాతలా?” అనిపించవచ్చు! గంగులవారిపాలెం వీథి 1 కిలోమీటరుకు పైగా ఐదారేళ్ల నుండి ఎందుకింత ప్రసిద్ధికెక్కిందో ఆలోచిస్తే ఎవరూ అలా ఆక్షేపించరు!

            శ్రమ సందడి ముగిశాక గోళ్ళ వేంకటరత్నం అభిమానంగా ముమ్మారు పలికిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ, DRK గారి మెచ్చుకోళ్లతోనూ, గురవయ్య గారి వివేకానంద సూక్తులతోనూ 21-1-24 వ నాటి కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చింది!

            మనందరం బుధవారం వేకువ శ్రమదానం కోసం బందరు రహదారిలో 6 వ నంబరు కాల్వ వంతెన వద్ద కలువవలెనని నిర్ణయం!

            స్వచ్ఛ - సుందర కర్మయోగమె

ఔను - భగవద్గీత కర్ధం స్వచ్ఛ - సుందర కర్మయోగమె

యుగయుగాలుగ నిలిచి వెలిగే స్వచ్ఛ సుందర సంప్రదాయమె

దేశ ప్రగతికి - జాతి సుగతికి సమాధానం శ్రమానందమె

తొమ్మిదేళ్లుగ కార్యకర్తల దమ్ము తెలిపిన శ్రమత్యాగమె!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  21.01.2024