3007*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

3 వారాల తర్వాత మళ్లీ రెస్క్యూ టీమ్ తెర మీదకు - @3007*

            సోమవారం (22-1-24) వేకువ 4.24 అయిందో లేదో గంగులవారిపాలెంలో ఆ బృందం వాలిపోయింది. టీమ్ మొదట చిన్నదే గాని నెమ్మదిగా ఒక్కొక్కరు కలిసి, 7 గురుగా పెరిగింది. 6:10 దాక వాళ్ల స్వచ్ఛ కార్యకలాపాలు కొనసాగాయి.

            చలీ, మంచూ వాళ్లను చుట్టుముడుతూనే ఉన్నాయి! అందులో ఒకాయనకైతే జ్వరముందో ఏమో గాని గొంతు బొంగురుపోయి, దగ్గు వస్తున్నది కూడ! మరి ఇంత అననుకూల వేకువ వాతావరణంలో - బాగా శుభ్రంగానే కనిపిస్తున్న ఈ వీధిలో ఇంకా ఏం సాధించాలని 2 గంటలు గడిపారు?

            అంటే - మొదటి కారణం - ఎండుతున్న మురుగు కాల్వలో మళ్ళీ ప్రత్యక్షమైన ప్లాస్టిక్ సంచులు, 2-3 సైజుల్లో మద్యం, నీటి ప్లాస్టిక్, గాజు సీసాలు, పొలం వైపు నుండి డ్రైన్లోకి విస్తరిస్తున్న గడ్డీ, చెట్ల కొమ్మలు.

            రెండోదీ - తప్పని సరైనదీ - చెట్లకూ, పూల మొక్కలకూ తగుల్కొని వ్రేలాడుతున్న ఎండు వరి గడ్డి పీచులు. ఇక్కడి నుండి 2-3 నెలల పాటు వరి గడ్డి బళ్లూ, ట్రాక్టర్లూ తాకిడి ఈ వీధికి ఎక్కువగా ఉండి, ఇంత అందమైన రోడ్డునూ క్రమ్మేస్తుంటాయి వరిగడ్డి పరకలు.

            వీటన్నిటి తొలగింపే నేటి రెస్క్యూ దళం కృషి!

            ఏడుగురు కార్యకర్తలు పద్మావతి ఆస్పతి ఎదుట 3007* రోజుల బ్యానర్ సాక్షిగా మాలెంపాటి అంజయ్య గారిచ్చిన నినాదాల్ని అంది పుచ్చుకొని, నేటి శ్రమదానం పూర్తిచేశారు!

            మరో మార్గ మేమున్నది

స్వఛ్ఛ శుభ్రతల కోసం సొంత గ్రామ మందునా

మరో మార్గ మేమున్నది మన శ్రమదానం వినా

అందుకె గద సోదరా! ఆహ్వానిస్తున్నదీ

స్వచ్యోద్యమ మందు చేరి శ్రమదానం చేయుమనీ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  22.01.2024