3008*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

3008* వ నాటి పని వివరాలు.

            స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరణ పనులేమో మంగళవారానికి (23-1-24) చెందినవి. ఏ ఒక్క తృణమూ ప్రతిఫలం ఆశించకుండ - పొగడ్తలూ, తెగడ్తలూ పట్టించుకోకుండ ఎండ - వానల్ని సరకు చేయక - నిర్వికారంగా - నిశ్చలంగా వేల కొద్దీ రోజులు - తమ కనుకూలమైన బ్రహ్మ ముహుర్తాన్నెంచుకొని ఉద్యమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల్లో ఆరేడుగురు రెస్క్యూ టీమ్ పేరిట ఈ వేకువ చేసిన పనులన్న మాట!

            పనులు జరిగింది మరొక మారు గంగులవారిపాలెం వీధి మధ్యలోనే. వాళ్ల సూక్ష్మ దృష్టికి తగిలింది ఊరి ముఖ్య మురుగు కాల్వకు అడ్డుతగులగల, వీధి సౌందర్యాన్ని కుంటుపరచగల ప్లాస్టిక్ - గడ్డీ వంటి వ్యర్ధాలే.

            వాళ్ళు బాగుపరచినది పాతిక గజాల బజారే గాని, ఏరినవి కొద్దిపాటి ఖాళీ సీసాలే గాని, ప్రోగు చేసిన ఎండు గడ్డి పరకలు కొద్దిపాటివే గాని ఇప్పుడు చూడండి వీధి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో!

            అసలీ పనులు వీధి కటూ - ఇటూగా ఉన్న ఐదారు ఇళ్ళ వారు కదా చేసుకోవలసింది? కార్యకర్తలు పెంచిన, పంచిన పచ్చదనమూ, పూల సుగంధమూ ఎక్కువగా భవఘ్ని నగర వాసుల అనుభవంలోనివే గదా! గతంలో వాళ్లు చాల మార్లు కార్యకర్తల్తో పోటీపడి పనిచేసిన వారే గదా! ఈ రోజు మాత్రం శీత కన్నేశారు మరి!

            మీ ఇల్లు మా ఇల్లు, మీ వీథి మా వీధి, వర్డు ఎవరిది....వంటి భేదాలు పట్టని కార్యకర్తలు మాత్రం

- ఇద్దరు తడారుతున్న డ్రైనులో దిగి, అవసరం లేని కొమ్మల్ని పెరగబోతున్న గడ్డినీ కత్తులతో చెక్కారు! పూల మొక్కల పాదుల్ని శుభ్రపరిచారు.

- మిగిలిన వారి పని వల్ల పుట్టుకొచ్చిన వ్యర్ధాల్ని ఒకాయన చీపురుతో తొలగించగా,

- మరొకరు కాగితమ్ముక్కల్తో సహా, గుట్కా పొట్లాల్తో సహా ఏరడం చూశాను.

            6.15 కు పని స్థలంలోనే 7 గురూ తూములూరి లక్ష్మణ నామధేయుని నినాదాలకు బదులిచ్చారు.

            బెజవాడ దానయ్య గారి కుటుంబీకులు వారి ప్రథమ వర్థంతి సందర్భంగా 10 వేలూ, ఆస్పత్రి సీనియర్ నర్సు రోహిణి తన తండ్రి శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతి గుర్తుగా 5 వేలూ విరాళాలిచినట్లు తెలిసింది!

            మన రేపటి వేకువ కలయిక గంగులవారిపాలెం బజారు మొదట్లోని గస్తీ గది వద్దనే!

    స్వార్థం తోకలు కత్తిరించ బడుచుండునొ

ఎచ్చట త్యాగం చిలవలు పలవలుగా పెంపొందునో

ఎందున స్వార్థం తోకలు కత్తిరించ బడుచుండునొ

30-40 మంది వ్యక్తులు ఊరును పూజిస్తుందురొ

అదే చల్లపల్లి అనుచు అందరు గుర్తిస్తుందురు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  (నల్లూరి రామారావు)

  23.01.2024