3009*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

గ్రామ సరిహద్దులో ఆదర్శ శ్రమదానం! @3009*

          క్యాలెండర్ ను బట్టి అది 24.1.24 (బుధవారం) నాటిది! గడియారాన్ని బట్టి 4:10-6:10 వేకువ బ్రహ్మముహూర్తంలోనిది! అక్షరాల 26 మంది చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలది ! బందరు రాదారిలోని లక్ష్మీపురం - చల్లపల్లి పంచాయతీల సరిహద్దుగా గుర్తింపదగినది!

          100 గజాల మేర జరిగిన స్వచ్ఛ – శుభ్ర - సుందరీకరణలో పాల్గొన్నది పాతిక మందైతే - ప్రేక్షకులు అంతకు రెట్టింపు! వారిలో ముగ్గురు రేపల్లె ప్రాంతం నుండి పద్మావతి వైద్యశాలకు వచ్చిన పేషంట్ల తాలూకు! నాతో వారి సంభాషణ:

వాళ్ల ప్రశ్న : ఏంటండీ - ఇందరు పంచాయతీ పని వాళ్లు ఇంత చీకటితో పనులా?

నా సమాధానం : లేదు - ఊళ్లోని కొందరు ప్రతి వేకువా ఇలా స్వచ్ఛందంగా వీధులు శుభ్రపరుస్తుంటారు.

ప్రశ్న : నెలవారీ కాంట్రాక్టా? ఎంతండీ?

జవాబు: అదేం లేదు. కేవలం శ్రమదానం. గత పదేళ్ల నుండీ ఇలాగే జరుగుతున్నది.

          “మరి - ట్రాక్టర్లు, చీపుళ్లు, డిప్పలు, పారలు, కొడవళ్ళైనా పంచాయతీ ఇస్తుందా?

          “లేదు - పంచాయతీకి నిధులు చాలక ఇలాంటివి కొన్ని ఈ కార్యకర్తలే ఇచ్చారు”  

.......వాళ్ళు కొంత వరకు నమ్మినట్లే ఉన్నారు! టీ త్రాగేందుకు వెళ్లారు!

చల్లపల్లి శ్రమదాన సన్నివేశాలు ఇలా ఉంటాయి!

ఇక - నాకైతే ధర్మ సందేహాలు కల్గుతూ ఉంటాయి:

- 6 వ నంబరు కాల్వ వంతెన క్రింద తడీ – పొడీ - కంపు దారుణ వ్యర్ధాల్ని ఎత్తుతున్న స్వచ్ఛంద కార్మికుల గురించా....

- కాల్వ ఉభయ దిశలా ముళ్ళ గద్ద గోరు పూల చెట్ల పాదుల కలుపు తీసి, కసవులూడ్చి, వ్యర్ధాల్ని ట్రాక్టరుకు చేరవేసిన పని మంతుల సంగతా...

- అరగంటపాటు దుకాణాల ముందున్న కొబ్బరి బొండాల బండి దగ్గర మూరెడెత్తున పేరుకున్న చెత్తా చెదారం తొలగించిన కార్యకర్తల శ్రమా.....

- రోడ్డును ఊడ్చి, బాటకు అందం పెంచిన మహిళల ప్రయత్నమా.....

          ఏ సంగతి ముందుగా వ్రాయాలి అనే సంశయాలు!

          6.30 పిదప గ్రేస్ ఆస్పత్రి ముంగిట జరిగిన సమీక్షా కాలంలో:

- 87 ఏళ్ల ప్రఖ్యాత చల్లపల్లి శస్త్ర వైద్యుడు దుగ్గిరాల శివ ప్రసాదు గారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు వల్లించి, రాబోవు 12 నెలలకూ తన విరాళాన్ని చెక్కుల రూపంలో ఇచ్చి, ఉద్యమకారులను ఆశీర్వదించగా

- వారింతవరకూ ఇచ్చిన విరాళం ఎన్ని లక్షలో వివరించి, Dr. DRK గారు కృతజ్ఞతలు తెల్పగా

- రేపటి మన శ్రమదాన రంగస్తలం మళ్లీ గంగులవారిపాలెం రోడ్డులోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ రోడ్డు వద్దని ప్రకటించగా..

          జోహార్లు! జోహార్లు!!

దయనీయ మగు పారిశుద్ధ్య దుస్థితి జూసి

రమణీయ - స్తవనీయ గ్రామ సుస్థితి కోరి

వేలాది రోజులుగ విచలించు - ప్రచలించు

స్వచ్చోద్యమానికే జోహార్లు! జోహార్లు!!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  (నల్లూరి రామారావు)

  24.01.2024