3010*వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

3010* వ నాటి వీధి పరిశుభ్రతా ఆవిష్కరణలు!

          జనవరి 25 - బుధవారం నాటి ఆవిష్కర్తలు 29 మందిగాను, వారి పని వేళ వేకువ 411 - 6.10 మధ్యస్తంగానూ నమోదైంది! చీపుళ్ల ఊడ్పుల, కత్తులతో గడ్డీ, పిచ్చి మొక్కల తొలగింపుల, కత్తెర్లతో ముళ్ల పూల మొక్కల కత్తిరింపుల స్వచ్ఛ - శుభ్ర విన్యాసాలు జరిగిన గ్రామ భాగమేమో – ఊరి చివరి వార్డుకు చెందిన గంగులవారిపాలెం వీధి మధ్య భాగంలో!

          సుమారు 200 గజాల చిన్న వీధితో బాటు ఇళ్ల చివర ఖాళీ జాగాలోని చిట్టడవిని తొలగించడమొక ముఖ్య దృశ్యం.

          “నాలుగు సెంట్ల చోటులోని ముళ్ళ పొదల్ని తొలగించడమూ, రోడ్డును ఊడ్వడమూ, మార్జిన్ల గడ్డిని చెక్కడమేదో మహత్కార్యమా?” అని తేలికగా తీసిపారేయక్కర్లేదు. సామాజిక చైతన్య పరిణామాన్ని గుర్తించేవా ళ్ల దృష్టిలో:

- గ్రామీణ మహిళలు కొందరు వారి ఇంటి బాధ్యతలకు కామా పెట్టి, వీధికెక్కి చీపుళ్ళూ, దంతెలూ, డిప్పలూ పట్టిందే గొప్ప!

- రాత్రి ప్రొద్దు పోయే దాక వ్యాపార కార్యకలాపాలూ, ప్రయాణాలు, పొలం సంగతులూ, , వృత్తులూ చూసుకొన్న వారూ, వృద్ధులూ ఇలా వేకువ 4:00 కే పారిశుద్ధ్య పనులకూ వచ్చిందే విశేషం!

- 65-70 ఏళ్ల గౌరవనీయ విశ్రాంత ఉన్నతోద్యోగులూ, అమెరికా నుండి వేఱు పని మీద వచ్చిన ఉద్యోగి - వూడత్తు రాంగోపాల్  ఈ మాత్రం తన గ్రామ సామాజిక స్పృహను ప్రదర్శించడమే నా దృష్టిలో అతి మంచి వార్త!

- వీరిలో ఐదారుగురు కరుడు గట్టిన స్వచ్ఛ కార్యకర్తల సంగతైతే చెప్పేదేముంది - చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం - అవలీలగా చెట్లెక్కడమూ, మురుగ్గుంటల్లో దిగి బాగు చేయడమూ వాళ్లకొక లెక్కే కాదు!

          నేటితో గంగులవారిపాలెం బాట సుందరీకరణ కృషి పూర్తవుతుందనే అంచనా కుదర్లేదు. ఒకరిద్దరు కార్యకర్తలకు అక్కడక్కడా పరిపూర్ణత మీద నమ్మకం చిక్కలేదు.

          ఉస్మాన్ షరీఫ్ ప్రకటించిన స్వచ్ఛ - సుందరోద్యమ చిరకాల నినాదాల పిదప, నేటి కేషి సమీక్ష ముగిశాక, రేపటి వేకువ కూడ ఇదే సన్ ఫ్లవర్ వీధి మొదట్లోనే కలుసుకోవాలని నిర్ణయించారు.

          చిరునామా ఏదంటే

స్వచ్ఛ - శుభ్ర సొగసులకూ, పచ్చదనం పరవళ్లకు,

సామాజిక చేతనకూ, ఒక విశాల భావనకూ,

శ్రమదానం విభవానికి, సాటిలేని త్యాగానికి

చిరునామా ఏదంటే - స్వచ్ఛ చల్లపల్లంతే!

 - నల్లూరి రామారావు

    25.01.2024