3011*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

3011* వ నాటిది 35 మంది శ్రమ!

            శుక్రవారం పూట వేకువ చలి వేళ - ఊరి ఉమ్మడి మేలు కోసం వచ్చి, కాలూ వ్రేలూ పెట్టిన వారిలో చివరి చిరంజీవి నాలుగో తరగతి చదివే ఇర్షాద్ షరీఫ్ కాగా 36 వ వ్యక్తి అమెరికాలో ఉన్న మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు - (వీడియో ద్వారా!) తేదీ 26-1-24గణతంత్ర దినం! స్థానిక భవఘ్ని నగర వాసులు 5 గురు పాల్గొనబట్టి నేటి కార్యకర్తల బలగం పెరిగింది!

            కార్యకర్తల్లో వయసురీత్యా, భారంరీత్యా గౌరవనీయుడైన ఒకాయన తన సహ కార్యకర్తతో అనడం విన్పించింది - (నన్నుద్దేశించే) ఈ మాస్టారు ఏ రోజుకా రోజు మన పనుల గురించి ఎంత మంచి భాషతో ఎంత బాగా వ్రాస్తున్నాడో చూశావా?” అంటూ.

            అసలిలాంటి ప్రత్యేక శ్రమదానం గత చరిత్ర వదిలేయండి - మన సమకాలంలో ఇంత సుదీర్ఘకాలంగా దేశంలో ఎక్కడైనా జరుగుతున్నదా? చల్లపల్లి తప్ప ఇన్ని లక్షల ఊళ్లలో ఏ ఊరైనా ఇంత స్వచ్ఛ - సుందరంగా రూపొందిందా?’ మరి - ఇంతటి మహనీయ సన్నివేశం ప్రతి వేకువా ప్రత్యక్షంగా గమనిస్తుంటే కాస్త భావుకత ఉన్న వాళ్లెవరికైనా మనసు పులకించదా - అందుకనుగుణంగా వర్ణనా, భాషా రాకుంటాయా?

ఈ వేకువ దృశ్యాలే కొన్నిటిని పరిశీలిస్తే:

1) ఇద్దరు కార్యకర్తలు ఐదారు పొగడ చెట్లకు రక్షణగా ఎంత కళాత్మకంగా ముళ్ళ కంపను ఎంత దీక్షగా కట్టుతున్నదీ,

2) భవఘ్ని నగర్ నివాసి పనిలో కాలు జారి, బండ్రేవు కోడు మురుగు కాల్వలోకి జారిపోయినదీ,

3) కొలిమి మేస్త్రి గారి డెయిరీ దగ్గర 20 మంది కత్తుల్తో, దంతెల్తో నడుములెత్తకుండా శ్రమిస్తున్నదీ,

4) ముగ్గురు కార్యకర్తలు సన్ ఫ్లవర్ రోడ్డు ప్రక్కన మురుగు కంపు భరిస్తూ తదేకంగా, మమేకంగా వ్యర్ధాల్ని చెక్కి, కోసి, సేకరిస్తున్నదీ

5) నలుగురైదుగురు మహిళామతల్లులు ఇంట్లో బొత్తిగా పని లేకనా - వచ్చి, చేతులు నొప్పెట్టేంతగా వీధిని ఊడుస్తున్నారని తెలుసుకొంటే

            కార్యకర్తల్లో చాల మంది ఇంత కన్న బాగానే వ్రాయగలరు.

            అసలు మైకే అక్కర్లేని గొంతు కోడూరు వేంకటేశ్వరునిది. ఆయన మైకందుకొని, మూడు సార్లు నినాదాలు పలికితే వీధంతా మారుమ్రోగదా?

            DRK గారి నుండి రేపటి మన కలయికా, శ్రమదానమూ బందరు రోడ్డులోని SRYSP. కళాశాల వద్దనే ప్రకటన.

     రారమ్మని బొట్టు పెట్టి

రారమ్మని బొట్టు పెట్టి బ్రతిమిలాడి రప్పించిన

మాయజేసి - కథలు చెప్పి - మభ్యపెట్టి పిలిపించిన

ఆశ జూపి - మోసగించి ఆపై పనిలో దించిన

వారైతే పారిశుద్ధ్య పనులిట్లా జరిగేవా?

- నల్లూరి రామారావు

  26.01.2024