3012*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

స్వచ్చోద్యమమనగా ఏమి? అది చల్లపల్లియందెట్లుండును?@3012*

            ఇవి తెలియవలెనన్నచో శనివారం(27-1-24) నాటి వేకువ బందరు రోడ్డులోని SRYSP కళాశాల ప్రాంతములో చూచినచో క్రొత్త వారికి సులభముగా బోధపడును! వచ్చిన ఆగంతకులు జిజ్ఞాసాపరులైనచో, తొలిసారి ఈ ఊరికి వచ్చినచో ముందుగా అయోమయంలో చిక్కుకొనగలరు!

            “- చలి వేధిస్తున్న ఈ వేకువ సమయంలో 68 మంది ఈ రద్దీ వీధిలో ఎందుకు చేరితిరి?

            - వాళ్ళ చేతులకు తొడుగులూ, కొందరి తలలకు టోపీలూ, కాస్త ప్రత్యేకంగా ఉన్నవేల?

            - కొందరు చీపుళ్లూ,  మరి కొందరు పారలూ, డిప్పలూ, కొడవళ్లూ ధరించి చేయబోవు ఘనకార్యమేమి?

            -  రెండు వ్యానులూ, ట్రాక్టరూ వంటి హంగు లేల? మైకు నుండి అర్ధవంతమైన పాటలెందుకు?

అను కొన్ని ప్రశ్నలు వారిలో బయలు దేరి, కొంత సమాచారం పొందిన  పిదప వారి ఆసక్తి మరింత పెరగవచ్చును. సందేహాలు తొలగిపోయి,

ఇదొక శ్రమదాన కార్యక్రమమనీ, పదేళ్ల నుండీ చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛ - సుందరంగా మార్చుకొనే భగీరథ ప్రయత్నమనీ, సదరు ప్రయత్నమెన్నెన్నో ఆటుపోట్లను తట్టుకొని, 3012*, దినాలుగా, 3 కు పైగా లక్షల పని

గంటల శ్రమ వేడుకగా మారెననీ తెలుసుకొందురు!

- ఇది బోలెడంత ఖర్చుతో గూడు కొన్న కార్యక్రమమనీ, అంతకుమించి, విలువైన సమయాన్నీ, శ్రమనూ, మేధస్సునూ తమ ఊరి శ్రేయస్సు కోసం కొందరు ధారబోస్తున్న ఉద్యమమనీ, ఏ ప్రభుత్వం నుండీ ధన సహాయం లేనిదనీ విని కొందరైనా నమ్మగలరు.

            సాధారణంగా హాజరయ్యే 30-40 మంది వాలంటీర్లు కాక ఇంత పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వచ్చిన కారణం బహుశా బెజవాడ నుండి బండ్రెడ్డి రామకృష్ణ బృందం పాల్గొనడం కావచ్చు!

            దేశంలో మరెక్కడా లేని ఒక సామాజిక బాధ్యతా నిర్వహణాన్ని ప్రత్యక్షంగా చూసి, చీపుళ్ళు పట్టి పాల్గొని, మనసారా అభి నందించిన రామకృష్ణ గారు “ఇలా పాల్గొన్నదే తమ అదృష్ట మనీ, ఈ ఉద్యమం దేశానికి ఒక ఆశాకిరణమనీ,” సవినయంగా ప్రకటించారు!

            DRK డాక్టరు గారి సంగతి సరేసరి - ఇలాంటి శ్రేయోదాయక ఉత్సవాల్ని చూసే కొద్దీ ఆయన సంతోషం ఎక్కడికో

చేరిపోతుంది! సర్పంచి గారి నినాదాలతో, నందేటి వారి స్ఫూర్తిదాయక గీతాలాపనతో తుది సమావేశానికి మరింత వన్నె వచ్చింది.

            తన శ్రీమతి, ఇటీవల దివంగత ఝాన్సీలక్ష్మి గారి జ్ఞాపకార్థం వూడత్తు రామారావు గారి 25,000/- స్వచ్చోద్యమ విరాళమూ, బిస్కట్ల పంపకమూ, తమ తల్లి ఝాన్సీ గారి గుర్తుగా వూడత్తు రాంగోపాల్ (USA) 15,000/- చెక్కూ, యార్లగడ్డ పుష్ప సుందరావతి, వారి కుమారుడు వేంకటేశ్వర ప్రసాదుల 4,005/- ల వితరణా అదనపు విశేషాలు!

            ఈ మధ్యాహ్నం 12.00 - 1.00 సమయంలో స్వచ్ఛ కార్యకర్తలు వైశ్యా వీధిలో ఆమె స్మృతికి నివాళులర్పించవలసి ఉన్నది!

            రేపటి వేకువ మనం కలిసి, శ్రమించదగిన చోటు బందరు వీధిలోని జమీందార్ల భవనం దగ్గరే!

      సంరంభము మెండుగా.... !

జనవిఙ్ఞానం కోసం జరుగుతున్న క్రతువుగా

పర్యావరణ నిమిత్తం పచ్చదనం పెంపుగా

ఊరి జనవినోదార్ధం ఉద్యమించు తీరుగా

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభము మెండుగా....!                                                                                                                                                                                                                                                                                                            

- నల్లూరి రామారావు

   27.01.2024