3013*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

చల్లపల్లి స్వచ్ఛ - సుందర ధారావాహిక - @3013*

            ఈ ఆదివారం (28-1-2024) నాటి ఎపిసోడ్ లోనూ రకరకాల పాత్రధారులు నికరంగా నలభై ముగ్గురూ, అతిథి పాత్రల్లో మరో ఐదుగురూ - వెరసి 48 మంది.

            టీ.వీ. ఛానళ్లలో వచ్చే సీరియళ్లలోనైతే అసలు భాగానికి 2 రెట్లు ప్రకటనలుంటాయి! ఇక్కడి స్వచ్ఛ – సుందరోద్యమ సీరియల్లో మాత్రం 2 గంటల పని వేళ చివర్లో మాత్రమే సమీక్షా సమావేశ విరామం ఉంటుంది.

            టెలీ విజన్ ధారావాహికల్లో చాలా వాటిలో అసందర్భ - వెకిలి సన్నివేశాలూ, చౌకబారు హాస్య సంభాషణలూ ఉంటున్నాయి; బొత్తిగా సహజత్వం లేక - కృతిమంగా కనిపిస్తున్నాయి. కాని - ప్రతి వేకువా నేను ఇష్టంగా చేస్తున్న – చూస్తున్న గ్రామ స్వచ్ఛ - శుభ్ర – సుందరీకరణ శ్రమదానం మాత్రం కళ్లెదుటి కఠోర - వాస్తవం. దీనిలో నటనలూ, కృత్రిమత్వమూ, గ్రాఫిక్సూ ఉండవు.

            పైగా దీని ద్వారా అందరనుకొనే ఆర్జనలుండవు – చేతి చమురు భాగోతం తప్ప! ప్రాత పాత్రధారులకైతే – అదేదో ఆత్మానందమట – ఏ రోజుకారోజు పొందుతారట గానీ, క్రొత్త వాళ్లను పదే పదే అడిగి నా ఒకటికి పది మార్లు అలోచిస్తారు తప్ప – మురుగు తోడే పాత్రనూ, వీధి దుమ్ము నూడ్చే వేషాన్నీ, దిక్కుమాలిన కసవులూడ్చే పాత్రలు ధరించడానికి రావడమే లేదు!

            అదీ గాక - 3013* ఎపిసోడ్లలో సుందరీకరణ, రెస్క్యూ పనుల, వేషాలు ధరించీ ధరించీ వీళ్లు అలసిపోతే? అసలే ఇందులో సగం మంది సుమారు 60 ఏళ్ల వారు - ఇకనైనా నాటకం నడిపించడానికి 30 ఏళ్ల లోపు వారు రావలిసిందే మరి!

ఈ ఆదివారం నాటి 40 మందికి పైగా కార్యకర్తల 2 గంటల క్రొత్త ఎపిసోడ్ కధేమంటే;   

- రంగస్థలం రిజిస్ట్రార్ కార్యాలయం మొదలు దంత వైద్యశాల దాక,

- అందులో ఒక కర్మల భవన స్థలమూ, మునసబు వీధీ, సజ్జా వారి బజారూ ఉన్నవి!

- కళా నర్సింగ్ హోమ్ ప్రాంతంలో ఉన్న ట్రాక్టర్లను ముందు - వెనుకలకు జరుపుతూ శుభ్రపరచవలసి వచ్చింది!

- జమీందారు భవనం దగ్గరి రహదారి వనంలోనే 10 మంది కత్తులకూ, దంతెలకూ పని చెప్పక తప్పలేదు!

- చెత్త లోడింగు ముఠా కూడా తమ పాత్ర - సజావుగా - సకాలంతో పోషించారు.

- ఆలస్యమౌతున్నా, స్వచ్చోద్యమ ఆస్ధాన గాయకుడు ఒక మంచి పాటతో అలరించాడు.

            నిన్నటితో దివంగత వూడత్తు ఝాన్సీలక్ష్మి గారి కర్మకాండలను సంతృప్తికరంగా ముగించిన రామారావు గారి కుటుంబం ఈ ఉదయం స్వచ్ఛ కార్యకర్తలకు ఆమె జ్ఞాపికలందజేసింది.

            సోమ- మంగళవారాల రెస్క్యూ టీమ్ వారి పనులు ముగిశాక – బుధవారం వేకువ మనం కలవదగింది గంగులవారిపాలెం రోడ్డులోని సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ అడ్డ రోడ్డు వద్ద.

          దైన్యమైన దుశ్చరిత్ర

గంగులపాలెం బాటకు కలదిప్పుడు ఘన చరిత్ర

దశాబ్దకాలం క్రితమది దైన్యమైన దుశ్చరత్ర

స్వచ్ఛ కార్యకర్తల + ట్రస్టు కార్మికుల కష్టం

ఈ ప్రస్తుత వైభవానికెంతగనో కారణం!                                                                                                                                                                                                                                                                                          

- నల్లూరి రామారావు

   28.01.2024