3014*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

వేసట చెందని స్వచ్చోద్యమంలో 3014* వ నాడు!

          సోమవారమైనందున ఊరి వీధి బాధ్యత రెస్క్యూటీమ్ కు బదలాయించబడింది. వాళ్ళు ఐదుగురు కూడ (మరో ఐదుగురం తరవాత్తర్వాత  వాళ్లతో చేరిపోయాం) 4.20 కే 6 వ నంబరు కాల్వ దగ్గరి ‘గస్తీ గది’ దగ్గర చేరి, అనుకొన్న ప్రణాళికొకటి - తీరా అమలు జరిగిన పని మరొకటీ!

          మారిన ప్లాన్ ను బట్టి వాళ్ళు ఆ దగ్గర్లోని “రాజ్య ద్రవ్వ నిధి” (అనగా SBI) వద్దకు పోవడమూ, అక్కడ వీధి సౌందర్యానికి భంగకరంగా ఉన్న రాయి – ఇసుక - సిమెంటు వ్యర్ధపు గుట్టను చిన్న ట్రక్కులోకి ఎక్కిండమూ, గంగులవారిపాలెం రోడ్డు మధ్యకు చేర్చడమూ చకచకా జరిగాయి!

          అక్కడ పొలంలోని అదనపు నీరూ, వాన నీరూ ప్రధాన మురుగు కాల్వలో కలిపే తూము వద్ద నీరు లీకై, ఇరుకు రోడ్డు కావడాన పెద్దవాహనాల బరువుకు దెబ్బతిన్నది. ఈపూట సేకరించిన రద్దులో సగానికి పైగా దాని మరమ్మత్తుకు సరిపోయింది.

          మిగిలినది ఆదే రోడ్డు మలుపు తర్వాత మురుగు కాల్వ ఉత్తరం రోడ్డు మార్జిను పల్లాన్ని పూడ్చడానికి!

          ఈ చిన్న పనులే 4:20 నుండి 6:10 దాక పట్ట లేదు - పూల మొక్కలకు తగులుకొన్న చెత్త పరకల్ని లాగేసి, మినప చేల ప్రక్కన గడ్డి వ్యర్ధాలను ఏ 50-60 డిప్పలో ఎత్తి రోడ్డు రెండో వైపుకు మోసి, రక్షణ గట్టుగా పేర్చి, కొందరు చీపుళ్ళకు పని చెప్పి, రోడ్డును ఊడ్చి......

          - అసలిదంతా ఒక పూటకు పరిమితమయే కథా? ఈ కార్యక్రమం 6.30 కి ముగిసిందనుకోండి –అటు హైవే మీద ట్రస్టు కార్మిక సోదరులు పనులు మొదలెడతారు. రేపొక్కరోజు ఆగితే - మళ్లీ కార్యకర్తలంతా ఏ బందరు వీధి మెరుగుదలకో పూనుకొంటారు!

          పద్మాభిరామం వద్ద 10 మంది క్యాకర్తలూ BSNL నరసింహుని నాయకత్వంలో స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాల్ని గట్టిగా ప్రకటించారు.

          జనం చేతిలొ నిర్ణయం!

బిర్రుగా కశ్మల దరిద్రం - గిర్రుగిర్రని కాలచక్రం

కార్యకర్తల శ్రమోత్సాహం గ్రామ శుభ్రత కాలవాలం

చల్లపల్లిని తొమ్మిదేళ్ళుగ చక్కదిద్దే మహాయత్నం

విజితులెవరొ విజేతలెవ్వరొ జనం చేతిలొ నిర్ణయం!

- నల్లూరి రామారావు

   29.01.2024