3015*వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులకి ప్రత్యామ్నాయం చూసుకుందాం!

3015*వ పనిదినం చర్య!

          నిన్నటిలాగే గంగులవారిపాలెం వీధి చర్యే అది, ఎంతగా చలి వణికిస్తున్నా 4:20 కే రెస్క్యూటీమ్ హాజరు, 6.05 దాక జరిగిన పనైతే ఒక్కటేగాని, వేరెవరికైనా ‘ఓసోస్! ఇదీ పెద్ద పనా?’ అనిపించవచ్చును గాని, అసలు పనిమంతులైదుగురూ, కొసరువాళ్లం అంతేమందీ సాధించినదిదీ:

          6 వ నంబరు పంటకాల్వ వడ్లమర వేపు గట్టున కరెంటు డిపార్టుమెంటువారు మరొక చోట విరిగిపడిన స్తంభాన్ని తెచ్చివేయగా –

          దాని బరువే 1 ½ టన్నుల పైగా ఉండునని అంచనాతో దాన్ని తరలించడానికి క్రేన్ రప్పించాలనే ఆలోచనచేయగా –

          ఒకరిద్దరు కార్యకర్తలు మాత్రం బుర్రలకు బాగా పనిచెప్పి, ఐదారుగురూ ధైర్యం చేసి, ఏమైనా సరే – ట్రాక్టర్ తోనే దాన్ని బందరు రోడ్డు దక్షిణాన వీధి చివరకు చేర్చాలని పూనుకోగా –

          అంతబారూ, బరువూ ఉన్నస్తంభం ఒక ప్రక్క పెద్ద టైరు మీదికెక్కించి, రెండోకొసను ట్రాక్టరుకు బిగించి, ఆ చిన్న వీధిలో ఊరేగింపుగా - నిన్న రద్దుతో  పూడ్చిన చోటుకు చేర్చగా –

          పెద్ద వాహనాలు గుంట పూడిక వైపు రాకుండా సదరు సిమెంటు స్తంభాన్ని అడ్డుగా అమర్చగా –

          పల్నాటి అన్నపూర్ణ గారి ప్రోత్సాహక చిరుతిండి కార్యకర్తలకందగా - ఫొటోలో చూపినట్లు –

          మాలెంపాటి అంజయ్య గారిననుసరించి 12 మందీ (చివరి వారు స్వచ్చోద్యమ కాలభైరవుల వారు!) నినాదాలు ప్రకటించి, నేటి పని ముగించిరి.

          రేపటి వేకువ మరికొంత Extra సుందరీకరణ కోసం గంగులవారిపాలెం రోడ్డులోని సన్ ఫ్లవర్ వీధి వద్ద కలుద్దాం!

          రాచకార్యములు ఇవా?

బహు బాగుగ చదువుకొనీ మట్టి పిసుక్కొందురా?

బడాబడా ఉద్యోగులు డ్రైను మురుగు తోడుదురా?

శస్త్ర చికిత్సల చేతులు చక్కదిద్దు పనులివా?

రైతు – గృహిణి – వ్యాపారుల రాచకార్యములు ఇవా?  

- నల్లూరి రామారావు

   30.01.2024