3016*వ రోజు........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

నెలాఖరున ముగిసిన గంగులవారిపాలెం వీధి పారిశుద్ధ్యం - @3016*

          బుధవారం వేకువ 4.14 కు కాబోలు – డజను మందితో ప్రారంభమైన మురికి పనుల ముగింపు 6:15కు 24 మందితో! ఫలితంగా – ఇతర గ్రామాల వారు కాదు - ఈ ఊరి ఇతర వార్డుల, వీధుల వాళ్లొచ్చి చూసినా - కళ్లు చెదిరేంత పరిశుభ్రత, ముచ్చటైన పచ్చదనం, కిలోమీటరు వీధి బారునా పూల వైభవం!

          ఐదారేళ్లుగా ఉభయ (చల్లపల్లి, రామానగరం) గ్రామాల నడకవారూ, వివిధ వయస్సుల స్త్రీ - బాల  వృద్ధులూ, ఫోటోలూ - వీడియో సెల్ఫీల వారూ ఎందుకు తండోపతండాలుగా ఈ వీధికి వస్తారో ఈ బాట, స్వచ్ఛ – శుభ్ర - సౌందర్యాలనూ, అందుకు మూలకారణమైన మానవ శ్రమను చూస్తే తెలుస్తుంది.  

          ఒక ప్రక్క సామాజిక బాధ్యతాంశాన్ని, శ్రమైక జీవన సౌందర్యాన్నీ, శ్రీ శ్రీ నుండి జయరాజ్ ల దాకా తమ రచనల్తో కీర్తిస్తుంటారు; దాన్ని 3016* వేకువల్నుండీ ఇదే గ్రామంలో స్వచ్ఛ కార్యకర్తలు అమలు చేస్తుంటారు – మరి ఊళ్లోని అన్ని వార్డుల – అన్ని వీధుల కొందరెందుకు పట్టించుకోరు?

          ఈ వేకువ పని మొదలు కాకముందు ఇద్దరు కార్యకర్తలు “ఏమిటి – నిన్నా ఇవాళా ఇంత చలిగా ఉన్నది? నా ఒక్కడికేనా – అందరికీనా?” అనడం విన్పించింది! ఐతే అది పనిలో దిగేంత వరకే! కష్టించే వాళ్ళకు చలీ, మంచూ ధ్యాస ఉంటుందా?

          చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలది తమ సొంతూరిపట్ల వల్లమాలిన ప్రేమాభిమానమనీ, ఆదొక వ్యసనమనీ కొందరు చెపుతుంటారు. అది నిజమే కాబోలు - మంచి రోడ్లను కొందరు త్రవ్వుకొని అమ్ముకొనే ఈ కాలంలో తమ ఊళ్లోని రోడ్లు మరమ్మత్తులు చేస్తూ, ఊడుస్తూ, అందుకు తమ సమయాన్ని - శ్రమనూ – ధనాన్నీ ఖర్చు చేయడమేమిటి? అందుగ్గాను ఏ 3 గంటలకో మేల్కొని పొరుగూళ్ళ నుండి సైతం రావడమెందుకు?

          వీళ్లలో కొందరు ఒక వీధి భాగాన్ని ఎంచుకొని, తాపీగా పని చేసుకుపోయారు; కొందరు చీపుళ్ళతో రోడ్డు బారునా శుభ్రం చేశారు; ముగ్గుర్నలుగురు పూల చెట్లను మరింత సుందరీకరించారు; ఏడెనిమిది మందైతే ఎక్కడ పని బడితే - ఉరుకులు పరుగుల్తో అక్కడ వాలారు!

          ఏ ప్రతిఫలమూ ఆశించని ఇలాంటి సామూహిక శ్రమ వేడుకలో అలుపూ సొలుపూ ఉంటాయా? ఊరందరి సౌకర్యం, ఆహ్లాదం కోసం చేసే పనిలో స్వార్ధానికి తావుంటుందా?

- మా ఇంటి ఎదుటి ఉద్యానాన్ని నలుగురు పూనుకొని తీర్చిదిద్దడమూ,

- వెతికి వెతికి మరీ ప్రతి కాలుష్యాన్నీ వీథంతటిలో తొలగించడమూ,

- మరీ ముఖ్యంగా ఐదుగురు దుబాయి (పావులూరి) శ్రీను ఇంటి దగ్గర రోడ్డు గుంటను సరిజేయడమూ నేటివిశేషాలు!

- 6.30 కు సమీక్షా సమయంలో సజ్జా ప్రసాదు గారు ద్వివిధ నినాదాలను మూడేసి మార్లు ప్రకటించడమూ,

- ఆదివారం నాటి

1) డజను మంది ఆకివీడు డాక్టర్ల గ్రామ సందర్శననూ,

2) బెజవాడలో 1977 నాటి గుంటూరు వైద్య కళాశాల విద్యార్ధుల రీ-యూనియన్లో పదేపదే ‘స్వచ్ఛ చల్లపల్లి’ ప్రస్తావననూ,  

3) వారి ఆ పునః కలయికలో ఒక్కసారికి పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడకపోవడాన్ని DRK గారు వివరించడమూ,

4) రేపటి వేకువ మన గమ్యం భగత్ సింగ్ గారి ఆస్పత్రిగా ప్రకటించడమూ....

              ఎందరికొ అభివందనీయులు!

అసాధ్యములను కొన్నపనులను సుసాధ్యములుగ చేసి చూపిన

సమాధానం లేని ప్రశ్నల జవాబులుగా నిలిచి వెలిగిన

ప్రమాదములనిపించు పనులనె ప్రమోదములుగ మార్చివేసిన

ఈ మహోన్నత కార్యకర్తలు ఎందరికొ అభివందనీయులు!

- నల్లూరి రామారావు

   31.01.2024