3017*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

3017* వ నాటి (ఫిబ్రవరి 1, గురువారం) శ్రమదానం చిత్తగించండి!

          సదరు శ్రమ పాతిక మందిది, అందుకు నోచుకోన్న గ్రామ విభాగం బందరు మార్గంలోని ప్రముఖ దంత వైద్యశాలే కాదు, గంగులవారిపాలెం వీధిలో 2 చోట్లు కూడా! మరి, కార్యకర్తల సగటు వయసు అర్థశతాబ్దం పైమాటే!

          స్వయంగా వచ్చి పాల్గొనలేని స్వచ్ఛ సుందరోద్యమాభిమానులు “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” మాధ్యమం ఫొటోలు, వ్రాతల ద్వారా దైనందిన పారిశుద్ధ్య విశేషాలు తెలుసుకొంటున్నారు. అట్టి జిజ్ఞాసువులు ముందుగా – 40 రోజుల క్రితం క్షుణ్ణంగా శుభ్రపరిచినా, వర్షాల వల్ల గడ్డీ, పిచ్చి మొక్కలూ పుష్కలంగా వృద్ధి చెందిన కర్మల భవనం మొదలు నర్సరీల దాకా బందరు వీధి చిత్రాన్ని ముందుగా చూడాలి. ఆ తరువాత:

- కార్యకర్తలమర్చిన ఇనుప వలను ఏ పుణ్యాత్ముడో వంచేసి, కుర్చీగా ఊయలగా మారిస్తే – 2 వ సారి వాటిని  సరిచేస్తున్న ముగ్గురు కార్యకర్తల ఓపికను మెచ్చుకోవాలి!  

- జమీందార్ల ప్రాసాదం వెలుపలి రహదారి వనంలో ఇంత చలిలో కూడా చెమటలు చిందిస్తూన్న పది మంది పట్టుదలను గుర్తించాలి!

- రిస్కు తీసుకొని, ట్రాన్స్ఫార్మర్ మెష్ లోకి వెళ్లి శుభ్రపరుస్తున్న ఒక విశ్రాంత ఉద్యోగినీ, మరొక ఆల్ రౌండర్ కాంపౌండర్నీ గమనించాలి!

- రహదారి ఉత్తరాన- ‘వైజయంతం’ బారునా ఊడ్చే స్త్రీలనూ, ఆకసవును ప్రోగు చేసి డిప్పలకెత్తి చేరవేస్తున్న వ్యాపారినీ ఫోటోలుంటే చూడాలి!

- అదృష్టవశాత్తూ ఇదే వీధిలో దూరంగా తమకు దొరికిన రద్దును ట్రక్కులో నింపుకొని, కిలోమీటరు దూరంలోని గంగులవారిపాలెం వీధి రోడ్డు భద్రత కోసం రెండు చోట్ల సర్దుతున్న కర్మిష్టుల కృషిని గురించి అలోచించాలి!

- అంతిమంగా ఈ శ్రమదానం గురించి ఇప్పటికీ పట్టని సగం మంది గ్రామస్తులు “3 వేల రోజులుపైగా ఎందుకు వీళ్ళ శ్రమదానం? ఏ వెలుగుల కోసం – ఏ సామాజిక బాధ్యత వీళ్లని నడిపిస్తున్నది” అని తప్పక ప్రశ్నించుకోవాలి!

          ఎప్పటిలాగే 6.30 సమయంలో సమీక్షా సభా, అందులో ఒక కళాశాలోపన్యాసకుడు – వేముల శ్రీనివాస్ దబాయింపుగా చేసిన నినాదాలూ, DRK డాక్టరు వెలిబుచ్చిన సంతృప్తీ, తన చిన్నప్పటి రెడ్డిగారొకరు స్వచ్ఛ చల్లపల్లి సందర్శనకు రానున్న ప్రస్తావనా, గురవయ్య గురువరేణ్యుని భగవద్గీతాశ్లోకగానమూ వగైరాలన్నీ జరిగిపోయి –

          రేపటి మన వేకువ శ్రమదానం కూడ ఇదే బందరు వీధిలోననే ప్రకటనా....

     సౌభాగ్యం సాధించాలనే గదా!

ఇప్పుడున్న స్థితికన్నా ఇంకొంచెం మెరుగు పరచి,

భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి,

చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువులనమర్చి –

చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!

- నల్లూరి రామారావు

   01.02.2024