3018*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

3018* వ ప్రయత్నంతో – వంకబెట్టలేనంతగా బందరు వీధి!

          శుక్రవారం (2.2.24) వేకువ 4.18-6.15 నడుమ జరిగిన ప్రయత్నమది! ప్రయత్నించినవారు ముప్పదినొక్కరు, వీధి పారిశుద్ధ్య సఫలత సుమారు 200 గజాల మేర - అనగా దంత వైద్యశాల నుండి పెద్ద మసీదు పర్యంతం!

          ఒక్కోసారి నాకనిపిస్తుంటది: “ఏమిటి ఏళ్ల తరబడీ ఈ పిచ్చి వ్రాతలు? అరె – తమ సాటి గ్రామస్తుల కోసం ఈ 30-40-50 మంది దశాబ్ద కాలంగా రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమిస్తుంటే (గుర్తుంచుకొండి – ఏపనీ లేక - సోమరులుగా గోళ్ళు గిల్లుకొంటూ కూర్చొనే రకాలు కాదు– బిజీ డాక్టర్లూ, ఉద్యోగులూ, రైతులూ, గృహిణులూ, వ్యాపారులూ, అంతంత మాత్రంగా ఓపికున్న వయోధిక విశ్రాంతులూ సుమా వీళ్ళు) శ్రమదానం చేయదగిన కొందరు గ్రామస్తులు అంటీ ముట్టకుండిపోవడమేమిటా అని! రోజుకొక్క గంట వీధిలోకొచ్చి, కార్యకర్తల్తో చేయి కలిపితే పోయేదేమిటా అని!”

          ఈ ఒంటి చేతి చప్పట్లు ఇంకా ఎన్ని దశాబ్దాలు? స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఫలితం కళ్లెదట కనిపిస్తుండగా, ఇక్కడి సామాజిక బాధ్యతను అనుసరించడానికెందరెందరో చాల చోట్ల ప్రయత్నిస్తుండగా - ఎంతో కొంత సంఘ చైత్యన్యవంతులైన చల్లపల్లి ప్రజలెందుకింకా తటపటాయిస్తున్నట్లు? ఈ ఊళ్లో ఉట్టిపడుతున్న స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాలు, వాటికి మూలమైన లక్షల కొద్దీ పని గంటల శ్రమా, ‘మనకోసం మనం ట్రస్టు’ కార్యకలాపాలూ - ఇవేమన్నా కనికట్లా? గ్రాఫిక్సా?

          ఎక్కువ మంది ఊరి వారు స్వచ్ఛ కార్యకర్తలుగా మారే కొద్దీ ఈ చల్లపల్లి రూపురేకలు మరింత త్వరగా పరిపూర్ణమైపోతాయి!

ఈ వేకువ శ్రమ కాలంలో నేను గమనించిన ముఖ్యాంశాలివి:

- నలుగురు పట్టుదలగా నిన్న శుభ్రపరచిన ట్రాన్స్ఫార్మర్ దగ్గరే కత్తులతో, గోకుడు పారల్తో కష్టించడం – మళ్ళీ నాలుగైదు నెలల్దాక ఆ గరికా, తుంగా తలలెత్తనంతగా త్రవ్వి దుంపనాశనం చేస్తున్నారు,

- ముగ్గురు మాత్రం వీధి ఉత్తరపు మార్జిన్ ను తమకే సొంతమన్నట్లు - గంటకుపైగా పరిశుభ్రత నింపుతున్నారు. (ఉమ్మడి సౌకర్యార్థం సమష్టి శ్రమ చేసే వాళ్లకి విసుగూ – వేసటా ఉండవుగాక ఉండవు!)

- పని కాలం ముగుస్తుండగా రమణ నర్సరీ ఎదుట ఏడెనిమిది మంది శ్రమ కోలాహలం చూసి తీరాలి.

- అసలెవరి కష్టం తక్కువని? డిప్పల్తో దుమ్ము మోసి, ట్రక్కు నింపిన, చీపుళ్లూ - గూళ్లూ అరిగేలా వీధిని ఊడ్చిన, కారక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించిన...ఎవరి ప్రత్యేకతను గూర్చి వ్రాయగలను?

          విశ్రాంతోపాధ్యాయిని “రాయపాటి (ఘంటశాల) విజయరమ” గారి నినాదాలూ, DRK గారి మాటల్లో – గ్రామ పరిశుభ్రత పట్ల తపనా - అంతిమంగా ఇళ్లకెళ్లే ముందటి కార్యకర్తల వదనాల్లో నిండు తృప్తీ - ఇవీ శుక్రవారం ఉదయ కాలపు విశేషాలు!

          తూర్పు (బత్తుల వారి) రామాలయం వద్ద ఆగి, మిగిలిన బందరు వీధి మెరుగుదలకు ప్రయత్నించాలనేది రేపటి వేకువ ప్రణాళిక!

          యదార్థముల? గాఫ్రిక్సా?

ఇది కాదా గ్రామ సేవ? ఇది కాదా చైతన్యం?

ఇవసలు వట్టి కబుర్లేన? ఇది ఊరికి మేలు కాద?

30 వేల చెట్లు - ఈ సుందర రహదారులు

యదార్థముల? గాఫ్రిక్సా?....ఏదీ తగు స్పందన?

- నల్లూరి రామారావు

   02.02.2024