3019*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

3-2-24 - శనివారం పనిదినం 3019* వది!

         4.14 కే మొదలై, 6.15 దాక – రెండేసి గంటల శ్రమ - ట్రస్టు వర్కర్లతో సహా 30 మందిది! నిన్న నిర్ణయానుసారం బందరు వీధి - బత్తుల రామాలయం వద్ద మొదలైన రహదారి మెరుగుదలా అటూ - ఇటూగా పోలీస్ వీధి దాక విస్తరించింది. అవసరాన్ని బట్టి గంగులవారిపాలెం వీధిలోకీ శ్రమదానం వెళ్లింది!

         అది నిన్న శుభ్రపడిన చోటే గాని, నర్సరీ యజమాని అనుమతితో ఆ ప్రహరీ వెలుపలి రాతి ముక్కల, ఎర్రమన్ను గుట్టల్ని చిన్న ట్రక్కుతో గస్తీ గది వద్దకూ, ఆస్పత్రి వద్దకూ చేర్చి భద్రపరిచారు – దెబ్బతిన్న రోడ్ల, మొక్కల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని!

         ఒక వంక మసీదులోని ప్రార్ధనలూ, మరో వంక ఇసుక బళ్ల ట్రాక్టర్ల రణగొణల మధ్య చాకచక్యంగా, ఒడుపుగా - కిలోమీటరు వీధి బారునా - సొంతానికి కాక - ఊరి ఆహ్లాదం కోసం పని చేసుకుపోతున్న 30 మందిది ఎంత అపురూప దృశ్యమో కదా!

         ఐతే – టీ దుకాణాల, కూర ఆంగళ్ళ, టిఫిన్ సెంటర్ల వాళ్ళ నుండి నలుగురైదుగురైనా శ్రమదాతల్తో కలిస్తే మరింత అద్భుతంగా ఉండేది!

         ఇంతకీ 30 మంది గ్రామ సామాజిక బాధ్యులు ఏమేం చేశారని కాక – ఏం చేయలేదని ప్రశ్నించుకోవాలి,

- పవిత్రమైన - ప్రార్థనాలయాల దగ్గరి గలీజుల్ని తొలగించినదీ,

- 2 చోట్ల మురుగ్గుంటలోని వ్యర్ధాల్ని పైకి లాగి, డిప్పల్తో మోసినదీ,

- అప్పటికే ఎండి, బిగిసిన మురుగు మట్టిని పెకలించి, ట్రక్కులోకెత్తినదీ,

- రోడ్డు పొడవునా ఊడ్చి, ఫోటోలో చూపినట్లు అద్భుతంగా శుభ్రపరిచినదీ,

- భవన నిర్మాణం దగ్గర వ్యర్ధాల్ని తొలగించ శ్రమించినదీ,

- మొత్తమ్మీద దుమ్మూ – ధూళీ – మురుగు కంపూ పీల్చినదీ....

- ఊరంతటి బాధ్యతను మోసినదీ ఈ 30 మందే కదా!

* స్వచ్ఛ - సుందరోద్యమం గురించి ఈ వేళ నినదించింది గ్రామ సర్పంచి గారు,

* నిన్న రోడ్లు తిరిగి చూసి, దుకాణదారుల్లో కూడ మార్పును గమనించినప్పటి ఆనందాన్ని పంచుకొన్నది DRK వైద్యుల వారు,

* బందరు వీధి తదుపరి ఎక్కడ శ్రమించాలో, రానున్న శివరాత్రికి ఏ వీధినెలా శుభ్రపరచాలో సూచనలు చేసింది కొందరు కార్యకర్తలు,

* ఇంతింత శ్రమ వేడుక తమ వాడకట్టులో జరుగుతున్నా వచ్చి చేతులు కలపనిది స్థానికులు!

         రేపటి రేపు మనం కలువదగిన చోటు రక్షకభట నిలయ వీధిలోనట!

         సమర్పిస్తాం ప్రణామంబులు!

‘సమాజ బాధ్యత’ అన్న పేరుతో సదుద్దేశంతోడ మొదలై

హరిత సంపద, పూల వనముల నంతకంతకు విస్తరిస్తూ

శ్రమతొ బాటుగ శ్రమార్జితముల గ్రామమునకే ధారబోసే

స్వచ్ఛ సుందర కార్యకర్తకు సమర్పిస్తాం ప్రణామంబులు!

- నల్లూరి రామారావు

   03.02.2024