3020*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

         వేకువ 4.14 కే మొదలైన 3020 * వ శ్రమ సందడి.

         5-2-24 నాడు అది 15 మంది, ఆదివారమైనందునేమో కార్యకర్తల సంఖ్య పెరిగి పెరిగి 45 కు చేరింది. ఇది జరిగింది సంత వీధి నుండి 3 రోడ్ల సెంటర్ల మధ్య. పని అయిష్టంగా ముగిసింది 6.15 కు.

         మరి ఇందరి వీధి మెరుగుదల చేష్టలు ఎప్పుడు-ఎక్కడ ఎలా జరిగినదీ సవివరంగా వ్రాయాలంటే కుదరక పోవచ్చు. నా కంటికానిన – బుర్రకు గుర్తున్న ముఖ్య ఘట్టాల్ని ప్రస్తావిస్తాను. అందులో మొదటి అంశం- జనాబ్ జానీ, నాయుడు మోహనరావుల చొరవతో ప్రతిభా కోచింగ్ నుండి 5 గురి ప్రవేశం.

         చల్లపల్లి సామాజిక- సామూహిక శ్రమదాన మంటే ఎక్కువగా వయసు మళ్లిన- మళ్ళుతున్న వారిదనే గుర్తింపును తొలగిస్తూ కనీసం ఐదుగురు విద్యార్థులైనా ఈ పూట గ్రామ బాధ్యతల్ని పంచుకోవడం శుభసూచకం.

         మిగిలిన వారిలో ధ్యాన మండలి వారు, రిటైరయి, సామాజిక కర్తవ్యంలో తలపండిన డాక్టర్లు, ఉద్యోగులు, రైతులు, గృహిణులు, వ్యాపారులు, వృత్తికారులు వ్యవహారజ్ఞులు ఉన్నారు.

         నేపథ్యాలు వేరైనా లక్ష్యం ఉమ్మడి గ్రామ వికాసమే! వాళ్ళ చేతుల్లో పనిముట్లు రకరకాలైనా గమ్యం ఈ బందరు వీధి పారిశుద్ధ్యమే!  సరిపడా దుకాణ దారుల, గ్రామస్తుల సహకారమున్నా లేకున్నా అందరి పంతం తమ ఊరి ప్రధాన వీధులు మురికి, దుమ్ము, ప్లాస్టిక్ లూ కనిపించక ఆహ్లాదంగా ఉండడమే!

         ఇంత మంచి ఆదర్శంతో వారు 3020 నాళ్లుగా అవాంతరాల్ని దాటుకొని, వాతావరణ వైపరీత్యాల్ని తట్టుకొని ప్రతి వేకువా శ్రమిస్తూనే ఉన్నారు. బహుశా మరో 3000 దినాలకైనా సంసిద్ధులౌతారు!

         ఈ వేకువ 4.00 కు ముందు కూడ ఈ సువిశాల వీధి శుభ్రంగానే ఉన్నది;

రకరకాల దుకాణాల, ఆలయాల, వస్తు విక్రయ కేంద్రాల వారు కాస్త బాధ్యతగా - మెలగడం వల్లనే వీధి శుభ్రతలో ఈ పురోగమనం.  వీధి మార్జిన్లలో మాత్రమే ఇంకా గలీజులు కనిపిస్తున్నవి. అందువల్లే ఈ 40 కి పైగా కార్యకర్తలు - దుమ్ము-ఇసుకల్ని ఊడ్చారు, పిండి మిల్లుల, శీతలపానీయ అంగళ్ల దగ్గరి కొన్ని వ్యర్థాల్ని ఏరారు.

- ATM సెంటర్, దాని ముందరి చిల్లర కొట్ల వద్ద మాత్రం కాస్త ఎక్కువ సమయం శ్రమించవలసి వచ్చింది.

- నిలిపి ఉన్న భారీ వాహనాల్ని తీసేయించి, అక్కడా శుభ్ర పరిచారు.

- దుమ్మూ-ఇసుకల్ని ట్రక్కులో నింపుకొని, కొందరు ఎక్కడ రోడ్డు భద్రతకు అవి అవసరమో చూసి, సర్ది వచ్చారు.

         6.30 వేళ ధర్మశాస్త్ర దేవాలయం ఎదుట నాయుడు మోహనరావు ప్రకటించిన నినాదాలను పునరుద్ఘాటించి,

         బుధవారం వేకువ నాగాయలంక వీధిలోని కూల్ డ్రింక్  షాపుల వద్ద మళ్ళీ కలవాలి అని నిర్ణయించుకొని, గృహోన్ముఖులయాయ్యారు.

           సంకల్పం విజయం ఇది !

ఇటు బందరు వీధి పనులు- అటు బందరు వైద్య శిబిర

మిట నలుబది మంది కృషీ- అటు ఐదారుగురి సేవ

స్వచ్చోద్యమ చల్లపల్లి సమాచార మిట్లున్నది

సగటు స్వచ్ఛ కార్యకర్త సంకల్పం విజయం ఇది !

- నల్లూరి రామారావు

   04.02.2024