3022*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

మరొక వీధి భద్రతా చర్య - @3022*

          మంగళవారం (6/2/2024) వేకువ కూడ రెస్క్యూటీమ్ 2 గంటలకు పైగా కృషి జరిపింది గంగులవారిపాలెం బాటలో వంతెన దగ్గరే. అక్కడొక గంటలో బాధ్యత ముగించి, 2 వేగ నిరోధకాల వద్ద కష్టించింది కూడ ఆ వీధి మధ్యలోనే!

          దుబాయి శ్రీను ఇంటి దగ్గరి వేగ నిరోధకం వద్ద హెచ్చరిక దీపాలు పాడైపోతే రాత్రి వేళల వాహనదారుల భద్రత కోసం మిలమిలలాడే 6 లైట్లమర్చడమూ,

          అక్కడికి 50 గజాల దూరన కూడ అలాంటి అమరికలతోనే బాగా ఆలస్యమైంది. ఆ సమయంలో చూస్తే 12 మంది కార్యకర్తలక్కడ కనిపించారు గాని – వారిలో స్ధానికులు లేరు. నైపుణ్యం అవసరమైన పనే తప్ప మరీ కష్టమైన బరువు పనీ కాదు.

          మురుగుకాల్వ వంతెన దగ్గరకు నిన్న శివరాంపురం బాట నుండి తెచ్చిన 2 పెద్ద చెట్లను అవసరాన్ని మట్టి మలుచుకోవడమూ,  అందుకు గొడ్డలి ప్రయోగమూ, బాట కాల్వలోకి జారకుండ తాడి మొద్దుల్ని సర్దడమూ, వాటికి దన్నుగా పెగ్గుల్ని బాతడమూ అసలైన శ్రమంటే!

          అసలీ స్వచ్ఛ సుందర కార్యకర్తలకీ - అందులోని ఐదారుగురు రెస్క్యూ బృందానికీ సంవత్సరం పొడవునా గ్రామ వీధుల్లో ఇలాంటి లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటి పరిష్కారానికి వీళ్లు శ్రమిస్తూనే ఉంటారు.

          ఇక - వీళ్లకు పౌష్టికాహారం సమకూర్చడంలో పల్నాటి అన్నపూర్ణమ్మ గారు అశ్రద్ధ చేసిందీ లేదు.

          6.30 కి పద్మాభిరామం గేటు ముందర తమ దైనందిన కార్యక్రమం చివరి అంశం - బ్యానర్ సాక్షిగా (తూములూరి లక్ష్మణుని నేతృత్వంలో) నినాదాలు పలకడం కూడ యధావిధిగా జరిగింది.

          బుధవారం - 3023* వ వేకువ మనం కలువదగినది నాగాయలంక రహదారి దగ్గరి శీతల పానీయ దుకాణాల వద్దనే!

          ఆ పవిత్రత కంజిలిస్తాం!

ఎన్నియత్నము లెన్ని గెలుపులొ – ఎన్ని వేసట లెన్ని బాసట

లెన్నిత్యాగములెన్ని సహనము లీమహత్తర స్వచ్ఛ సుందర

ఉద్యమంలో చూచుచుంటినొ! ఉన్న ఊరిని మార్చి వేసే

ఆ చరిత్రను స్వాగతిస్తాం! ఆ పవిత్రత కంజిలిస్తాం!

- నల్లూరి రామారావు

   06.02.2024