3023*వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

3023* వ ప్రయత్నం 26 మందిది.

            అనగా బుధవారం (7-2-24) వేకువ శ్రమదానం సంగతన్నమాట. 4.14 కే 11 మందీ, క్రమక్రమక్రమంగా 15 మందీ తమ ఊరి కోసం ఇచ్చిన వరం కాదు; అనుగ్రహించిన కాయకష్టం కూడ కాదు, అది కేవలం తమ సామాజిక బాధ్యతనుకొని, ఉభయ పెట్రోలు బంకుల నడుమ - అటు నాగాయలంక దిశగా, ఇటు బందరు వైపుగా శక్తిమేర చేసిన ప్రయత్నం!

            మరి - "ఈ మాత్రానికే ఇన్ని ఫోటోలేల? వాట్సప్ మాధ్యమంలో ఈ వ్రాతలేల? 2 గంటల శ్రమానంతరం వీధికెక్కి స్వచ్ఛ సుందరోద్యమ సంబంధిత నినాదాలెందుకు?" అందురా?

            ఇప్పటి మన యుగం లక్షణాలైన అసత్య ప్రచారాలు, గ్రామాల్లో కనీస సంఘ చైతన్యం లేని అధిక సంఖ్యాక ప్రజలూ పై వాటికి కారణాలు కావచ్చు! ఐనా ఈ కార్యకర్తలు 3023* నాళ్ళుగా తాము చేస్తున్నదే చెపుతున్నారు, రద్దీ వీధుల్లో - అందరి సమక్షంలో పాటుబడుతున్న వాటి గురించే నినదిస్తునారు. ప్రతి వేకువా మైకు నుండి ఇలాంటి భావ ప్రచారక - ప్రబోధకగీతాలే వింటున్నారు!

            పనిగట్టుకొని, ఇంటింటికీ తిరిగి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు వాడొద్దనీ, ఎక్కడికక్కడ ఎవరి వీథినివాళ్లు కాస్త శుభ్రంగా, అందంగా ఉంచుకొమ్మనీ, వీధుల్లో చెత్త కేంద్రాలు సృష్టించక పంచాయతీ చెత్త బళ్లకు 2 రకాల చెత్తను అందించాలనీ అభ్యర్థిస్తున్నారు.

            కాబట్టే ఈ పంచాయతీకి రాష్ట్ర దేశ స్థాయిలో ఎన్నెన్నో గుర్తింపులూ బహుమతులూ! క్రమం తప్పకుండా ఎందరెందరో ఈ ఊరి శ్రమదానోద్యమాన్ని పరిశీలించే పర్యాటకులూ!

            వట్టి కబుర్లెప్పుడైనా మ్రోగుతూనే ఉంటాయి గాని, రోజూ 30-40 మంది మానవ శ్రమ విలువేంటో - ఫలితమేంటో ఈ చల్లపల్లిలోనే ఋజువౌతున్నది!

తాజాగా ఈ వేకువ 2 గంటల పాతిక మంది శ్రమ వల్లనే :

- ATM సెంటర్ దుకాణ వ్యర్ధాలు,

- గణేశ్ ప్రెస్ పరిసర కాలుష్యాలు,

- 2 ఇంధనశాలల ప్రాంతాలు,

- ద్విచక్ర వాహన విక్రయ స్తలమూ,

- కూల్ డ్రింకుల, ఎలక్ట్రానిక్ షాపుల బాధ్యతా రహిత చెత్తలూ,

- 3 రోడ్ల కూడలి దుమ్మూ - ఇసుకా.... అన్నీ తొలగిపోయి, కార్యకర్తలకు రోజంతటికీ సరిపడా సంతృప్తి దక్కింది!

            మన స్వచ్ఛ – సుందరోద్యమానికి గత నెలలో 5,000/- చందా ఇచ్చిన బత్తిని శ్రీనివాస్ – ఉమాదేవి దంపతులూ, హైదరాబాద్ వాస్తవ్యులూ, గోపాళం శివన్నారాయణ గారి మిత్రులూ ఈ నెల కూడ మరొక 5000/- తో మన శ్రమదానాన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.

            ప్లాస్టిక్ చెత్త నుండి మన వారి సంపాదనకొక ఉదాహరణగా ట్రస్టు ఉద్యోగుల పర్యవేక్షకుడైన కస్తూరి శ్రీనివాస్ ప్లాస్టిక్ తుక్కును అమ్మి ప్రోగేసిన 600/- ను ఈరోజు ట్రస్టుకు సమర్పించడమైనది.     

            ఈ నడుమనే చల్లపల్లి వచ్చి, కార్యాలయం తెరవాలనుకొంటున్న ఆడిటర్ గారొకరు రావడమూ,

            ఈ సాయంత్రం స్వచ్చాంధ్ర మిషన్సంచాలకుని కలిసేందుకు చల్లపల్లి స్వచ్చోద్యమ సారథులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు విజయవాడ వెళ్లడమూ, షణ్ముఖ (వేముల) శ్రీనివాసుని త్రివిధ నినాదాలూ నేటి సమీక్షా సమయపు విశేషాలు!

            రేపటి వేకువ కూడ మన పారిశుద్ధ్య/ సౌందర్య ప్రయత్నం నాగాయలంక రోడ్డులోనే!

            స్వచ్ఛతకే మా ఓటు వేస్తాం!

స్వచ్ఛ సుందర భావ విస్తృతి - చుట్టు ప్రక్కల లేని సంస్కృతి

దుష్ట కాలుష్యాలపైనే దుందుభులు మ్రోగించు సత్కృతి 

అందుకోసం శ్రమత్యాగము ననుసరిస్తే కలిగె నిష్కృతి

అట్టి చరితనె స్వాగతిస్తాం! స్వచ్ఛతకే మా ఓటు వేస్తాం!

- నల్లూరి రామారావు

   07.02.2024